కృష్ణమ్మకు చంద్రబాబు సాష్టాంగ నమస్కారం..!
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ప్రకాశం జిల్లా నల్లమల ప్రాంత రైతాంగం, ప్రజల కల సాకారమైంది. ప్రతిష్టాత్మక “పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు”(Veligonda Project) తొలి దశను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. గంటావానిపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ ద్వారా నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను ఆయన విడుదల చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ‘వెలిగొండ జలసిరులు – అభివృద్ధికి రెక్కలు’ పేరుతో ప్రారంభోత్సవ వేడుకను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉరకలెత్తుతూ వచ్చిన కృష్ణా జలాలకు శాస్త్రోక్తంగా జలహారతి ఇచ్చిన అనంతరం, కెనాల్ ఒడ్డున నిలబడిన ఆయన కృష్ణమ్మకు ‘సాష్టాంగ ప్రణామం’ చేశారు. ప్రాజెక్టు పూర్తి కావడం కోసం దశాబ్దాలుగా పడిన శ్రమ, ఈ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తుచేసుకుంటూ సీఎం సాష్టాంగ నమస్కారం చేయడంతో అక్కడ చేరిన వేలాది మంది రైతులు, మహిళలు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. అనంతరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పైలాన్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ అందుబాటులోకి రావడంతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందనుంది. ఈ నీటి విడుదలతో నల్లమల సాగర్ జలాశయం జలకళను సంతరించుకోబోతోంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వేగంగా పనులను పూర్తి చేసి ప్రారంభించడంపై రాయలసీమ, ప్రకాశం జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.








