కొండా సురేఖకు ఢిల్లీ పిలుపు!?
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. పార్టీ అంతర్గత విభేదాలు, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సురేఖను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ లేదా విస్తరణ దిశగా హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకోబోతోందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుని, నాలుగు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. బుధవారం జరిగే డాక్టర్ వైఎస్ఆర్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అధిష్ఠానం పిలుపు మేరకు రాజధానికి చేరుకోనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, క్రమశిక్షణా చర్యల కమిటీ నివేదికను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు విదేశీ పర్యటన ముగిసి మంగళవారం నాటికి తిరిగి రాగానే సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లు ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు, ఇతర సీనియర్లతో విస్తృతంగా చర్చించనున్నారు.
కొండా సురేఖతో పాటు ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అంశాలపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి కొండా సురేఖను నేరుగా ఢిల్లీకి పిలిపించి, ఆమె వైపు వాదనలు వినే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే తన సిఫార్సులను సిద్ధం చేసినందున, ఆమె వివరణను పరిగణనలోకి తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవసరమైతే ఆమెతో రాజీనామా చేయించే ఆలోచనలో కూడా నాయకత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులను తొలగించి, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని అధిష్ఠానం భావిస్తోంది. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆ స్థానంలో టీపీసీసీ చీఫ్‌ను కేబినెట్లోకి తీసుకోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అలాగే శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీనియర్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సెక్షన్ 22-ఏ నిషిద్ధ భూముల వ్యవహారం, పాలిటెక్నిక్ కాలేజీల వివాదం వంటి అంశాలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే ప్రమాదం ఉన్నందున, వివాదాస్పద శాఖల మార్పిడి చేయాలని కొందరు మంత్రులు అధిష్ఠానాన్ని కోరే యోచనలో ఉన్నారు. ఇదే సమయంలో మంత్రి పదవుల కోసం పలువురు ఆశావహులు కూడా ఢిల్లీ బాట పట్టి పైరవీలు ముమ్మరం చేశారు. అధిష్ఠానం తీసుకునే తుది నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది.








