తెలంగాణ కాంగ్రెస్‌లో కేబినెట్ ప్రకంపనలు!
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడు హస్తిన చుట్టూ వేగంగా తిరుగుతున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఆలోపే సెప్టెంబర్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీకి వెళ్లనుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ, బెంగళూరు పర్యటనలు ముగించుకుని అధిష్ఠానంతో సంప్రదింపులు జరిపిన తరుణంలో, సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్ర నాయకత్వంతో భేటీ కానుండటం మంత్రివర్గ విస్తరణ, శాఖల పునర్వ్యవస్థీకరణ వార్తలకు బలమైన రాజకీయ ఆజ్యం పోస్తోంది.
ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత స్వయంగా ముఖ్యమంత్రిపై చేసిన తీవ్ర ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తన వాదనను వినిపించగా, కొద్ది రోజుల వ్యవధిలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఏఐసీసీ అధ్యక్షుడితో చర్చలు జరిపారు. మరోవైపు, ఈ వివాదంపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే సమగ్ర నివేదికను రూపొందించి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు అందజేసింది. అయితే, ఈ నివేదిక అధిష్ఠానానికి చేరిందా లేదా అనే అంశంపై స్పష్టత లేనప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి తన తాజా ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖ వివాదంపై హైకమాండ్‌తో కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది.
కేవలం కేబినెట్ విస్తరణ మాత్రమే కాకుండా, మంత్రుల శాఖల్లో భారీగా మార్పులు-చేర్పులు చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో పలువురు మంత్రుల పనితీరుపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, ప్రస్తుత మంత్రులలో గుబులు మొదలైంది. కేబినెట్ నుంచి ఒకరిద్దరిని తప్పించి లేదా వారి శాఖలను మార్చి కొత్త వారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జోరందుకుంది.
ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో 2 ఖాళీలు ఉన్నాయి. ఒకవేళ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒకరిద్దరు సిట్టింగ్ మంత్రులకు ఉద్వాసన పలికితే, గరిష్టంగా నలుగురు ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. దీంతో బెర్తులు ఆశిస్తున్న ఆశావహులు ఢిల్లీ స్థాయిలో ముమ్మర లాబీయింగ్ ప్రారంభించారు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురు శాసనసభ్యులు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ బాటపట్టి అధిష్ఠానం పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
రాజకీయ సమీకరణాల పరంగా అత్యంత కీలకమైన బీసీ కోటా మంత్రి పదవి కోసం తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తన కుమార్తె, ప్రస్తుత రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి పేరును బీసీ కోటా కింద కేబినెట్ బెర్తు కోసం గట్టిగా ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సామాజిక వర్గం నుంచి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్సీ విజయశాంతి పేర్లు కూడా కేబినెట్ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే మంత్రివర్గ కసరత్తును కొలిక్కి తెచ్చి, పార్టీలో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టడంతో పాటు సమతుల్యత సాధించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ పరిణామాలన్నింటి మధ్య రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 3 ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది.








