హాలీవుడ్లో సినిమాగా వస్తున్న సెన్సేషన్ నవల.. అందులో కథేంటి?
ఒక పుస్తకం ఇంకా మార్కెట్లోకి రాలేదు. పాఠకులు ఒక్క పేజీ కూడా చదవలేదు. కానీ హాలీవుడ్ మాత్రం అప్పటికే దాని సినిమా హక్కుల కోసం పోటీ పడి కొనేసింది. ఇంకా విశేషం ఏమిటంటే…అది కూడా ఒక కొత్త రచయిత రాసిన తొలి నవల కావటం. ఆ పుస్తకం ఏమిటి… ఆ పుస్తకంలో హాలీవుడ్‌కు అంతగా కనిపించినదేమిటి? చూద్దాం.
పుస్తకం రిలీజ్ కు ముందే సెన్సేషన్
ఆ పుస్తకం పేరు ‘Yesteryear’. రాసింది Caro Claire Burke. ఇది ఆమె తొలి నవల. పుస్తకం బయటకు రావడానికి చాలా ముందే దాని సినిమా హక్కుల కోసం హాలీవుడ్లో పోటీ మొదలైంది. చివరకు Amazon MGM Studios ఆ హక్కులను సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఈ కథలో ప్రధాన పాత్రను హాలీవుడ్ స్టార్ Anne Hathaway పోషించబోతున్నారు. ఆమె ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
ఇక్కడే అసలు ఇంట్రస్టింగ్ విషయం ఉంది. ఎందుకంటే ఆ సమయంలో Caro Claire Burke ఏమీ పెద్ద సెలబ్రిటీ రచయిత కాదు. పుస్తకం కూడా బెస్ట్‌సెల్లర్ కాదు. అసలు పుస్తకం పూర్తిగా ప్రచురించబడినదే కాదు. అయినా హాలీవుడ్ మాత్రం “ఈ కథలో ఏదో ఉంది” అని ముందే గుర్తించింది.
అసలు ఆ “ఏదో” ఏమిటి?
నవలలోని కథలోకి వెళ్తే.. Natalie Heller Mills అనే 32 ఏళ్ల మహిళ కనిపిస్తుంది. ఆమె సాధారణ గృహిణి కాదు. సోషల్ మీడియాలో లక్షలాది మందికి తెలిసిన ట్రాడ్‌వైఫ్ ఇన్ఫ్లుయెన్సర్. అంటే.. “మహిళలు కెరీర్, బయట ఉద్యోగాల వెంట పరుగెత్తడం కంటే ఇంటిని చూసుకోవడం, భర్తకు అండగా ఉండటం, పిల్లలను పెంచడం, సంప్రదాయ విలువలతో జీవించడం చాలా గొప్ప విషయం” అని చెప్పే మహిళ.
Natalie సోషల్ మీడియాలో తన జీవితాన్ని అద్భుతంగా చూపిస్తుంది. పెద్ద ఇల్లు, భర్త, పిల్లలు, పొలం, ఇంట్లో తయారుచేసిన ఆహారం.. చూస్తే “ఇదే కదా పర్ఫెక్ట్ ఫ్యామిలీ లైఫ్” అనిపిస్తుంది. పాతకాలపు జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఆధునిక ప్రపంచం కంటే సంప్రదాయ జీవితం ఎంత మంచిదో ఆమె తన ఫాలోవర్లకు చెబుతుంటుంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
ఆమె చూపించే జీవితం పూర్తిగా నిజం కాదు.
ఆమె పిల్లలను చూసుకోవడానికి నానీలు ఉంటారు. పొలం పనులు చేయడానికి మనుషులు ఉంటారు. సోషల్ మీడియా కంటెంట్ వెనుక పెద్ద టీమ్ ఉంటుంది. అంటే.. ప్రపంచానికి ఆమె “నేను అన్నీ స్వయంగా చేసుకునే సంప్రదాయ గృహిణిని” అని చూపిస్తుంది. కానీ ఆ పర్ఫెక్ట్ ఇమేజ్ను నిలబెట్టడానికి వెనుక ఆధునిక ప్రపంచం మొత్తం పనిచేస్తుంటుంది.
ఇంతలోనే కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది.
ఒకరోజు Natalie నిద్రలేచి చూసేసరికి.. తనకు తెలిసిన ప్రపంచం కనిపించదు. ఆమె 1855లో ఉంటుంది. అంటే ఇలాంటి జీవితం కావాలని పదే పదే చెప్పే జీవితం అన్నమాట. అవును.. సోషల్ మీడియాలో తాను గొప్పగా చెప్పుకునే పాతకాలపు జీవితం ఇప్పుడు ఆమె ముందే నిజంగా నిలబడుతుంది.
విద్యుత్తు లేదు. ఆధునిక సౌకర్యాలు లేవు. సోషల్ మీడియా లేదు. నానీలు లేరు. ఫోన్ లేదు. ఆధునిక వైద్యం లేదు. తాను “చాలా అందమైన జీవితం” అంటూ ప్రపంచానికి అమ్మిన ఆ ప్రపంచాన్ని ఇప్పుడు నిజంగానే జీవించాలి.
అక్కడే కథలోని అసలు సెటైర్ మొదలవుతుంది. కెమెరా ముందు “సింపుల్ లైఫ్” గురించి మాట్లాడటం ఒకటి. ఆ జీవితాన్ని నిజంగా బతకడం మరొకటి. ఇంట్లో బ్రెడ్ తయారు చేయడం వీడియోలో చాలా అందంగా కనిపిస్తుంది. కానీ రోజూ కుటుంబం మొత్తం తినడానికి ఆహారం తయారు చేయడం ఎంత శ్రమో వేరే విషయం. పిల్లలతో రోజంతా గడపడం ఇన్‌స్టాగ్రామ్‌లో అందంగా కనిపిస్తుంది. కానీ పిల్లల బాధ్యత అంతా నిజంగా మీదే పడితే? భర్తకు అంకితమైన భార్యగా ఉండటం ఒక సోషల్ మీడియా పోస్టులో రొమాంటిక్‌గా కనిపించొచ్చు. కానీ 19వ శతాబ్దపు సమాజంలో మహిళకు ఉన్న పరిమితులు ఎదురైతే?
ఇదే ‘Yesteryear’ అసలు గేమ్. రచయిత ఒక సిద్ధాంతాన్ని తీసుకుని దాన్ని నిజ జీవితంలోకి విసిరేశారు. “గతం అంత గొప్పదని చెబుతున్నావు కదా.. మరి ఒక్కసారి నిజంగానే గతంలో జీవించి చూడు.” అంతే కాదు. Natalie అసలు 1855లోకి ఎలా వెళ్లిందన్నది కూడా కథలో ఒక మిస్టరీ. ఇది నిజంగానే టైమ్ ట్రావెలా? ఆమెకు ఏదైనా జరిగిందా? ఎవరో ఆమెను కావాలనే అక్కడికి పంపారా? లేక దీని వెనుక ఇంకేదైనా కారణముందా? అనే ప్రశ్నలు కూడా కథతో పాటు నడుస్తాయి.
ఇప్పుడు చెప్పండి.. హాలీవుడ్‌కు ఈ కథ ఎందుకు నచ్చిందో అర్థమవుతోందా?
సినిమాకు కావాల్సిన చాలా విషయాలు ఇందులో ఒకేసారి ఉన్నాయి. మొదటే ఒక బలమైన హుక్ ఉంది. “సోషల్ మీడియాలో పాతకాలపు భార్య జీవితాన్ని అమ్ముకునే ఒక మహిళ నిజంగానే 1855లోకి వెళ్లిపోతే?” సినిమా నిర్మాతకు ఇంతకంటే సులభంగా అమ్మగలిగే కథా హుక్ ఇంకేం కావాలి?
ఈ ఒక్క లైన్‌తోనే సినిమా ట్రైలర్ ఊహించుకోవచ్చు. ఒకవైపు 2026 ప్రపంచం. మరోవైపు 1855 ప్రపంచం. ఒకవైపు సోషల్ మీడియా స్టార్. మరోవైపు సోషల్ మీడియా అనే మాటే తెలియని సమాజం. ఒకవైపు ఆమె చూపించిన “పర్ఫెక్ట్ లైఫ్”. మరోవైపు అదే జీవితంలోని అసలు కష్టం.
అంతేకాదు.. ఈ కథ ప్రస్తుతం జరుగుతున్న ఒక పెద్ద సామాజిక చర్చను కూడా తాకుతోంది. ట్రాడ్‌వైఫ్ సంస్కృతి. సోషల్ మీడియాలో కొంతమంది మహిళలు సంప్రదాయ కుటుంబ జీవితాన్ని మళ్లీ గొప్పగా చూపిస్తున్నారు. భర్త, పిల్లలు, ఇల్లు, వంట, మతం, సంప్రదాయం.. ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన జీవనశైలిని ప్రచారం చేస్తున్నారు. కొంతమందికి అది నిజమైన స్వేచ్ఛలా కనిపిస్తుంది. మరికొందరికి అది మహిళలను మళ్లీ పాత పాత్రల్లోకి నెట్టే ప్రయత్నంలా కనిపిస్తుంది.
‘Yesteryear’ ఈ రెండు వాదనల్లో ఒకదాన్ని ఎంచుకుని ఉపన్యాసం ఇవ్వదు. బదులుగా ఒక విచిత్రమైన ప్రయోగం చేస్తుంది. “సరే.. ఈ జీవితం అంత గొప్పదైతే, దాన్ని నిజంగా జీవించి చూద్దాం.” అంటుంది. ఇదే హాలీవుడ్‌కు బాగా నప్పే అంశం.
అందుకే హాలీవుడ్ స్టార్ Anne Hathaway కూడా ఈ కథలోకి వచ్చింది. ఆమె పుస్తకం ఇంకా ప్రచురణకు రాకముందే దాని డ్రాఫ్ట్ చదివారు. సినిమా హక్కుల కోసం పోటీ జరుగుతున్న సమయంలో Burkeతో Natalie పాత్ర గురించి మాట్లాడారు. రచయిత చెప్పిన ప్రకారం, Hathaway తన దృష్టిలో Natalie ఎలా ఉండాలనే విషయాన్ని కూడా వివరించింది. చివరకు ఆమె ఈ సినిమాలో Natalieగా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించనున్నారు.
ఈ నవల గురించి ముందే స్టూడియోలకు ఎలా తెలిసింది
Caro Claire Burke పుస్తకం ప్రచురణకు ముందే దాని మాన్యుస్క్రిప్ట్‌ను ప్రచురణకర్తలకు, హక్కుల ప్రతినిధులకు పంపించారు. పుస్తకంపై ఆసక్తి పెరిగింది. ప్రచురణ హక్కుల కోసం పలు సంస్థలు పోటీ పడ్డాయి. ఆ తర్వాత సినిమా హక్కుల కోసం కూడా స్టూడియోలు పోటీ పడ్డాయి. చివరకు Amazon MGM గెలిచింది.
అంటే హాలీవుడ్ “ఈ పుస్తకం ఇప్పటికే హిట్” అని చూసి కొనలేదు. “ఈ కథ సినిమా అయితే హిట్ అయ్యే అవకాశం ఉంది” అని చూసి కొంది. సాధారణంగా మనకు పుస్తకం అంటే.. ముందు రిలీజ్ అవుతుంది, జనాలు చదువుతారు, అమ్మకాలు పెరుగుతాయి, పాపులర్ అవుతుంది, ఆ తర్వాత సినిమా వస్తుంది అనిపిస్తుంది. కానీ హాలీవుడ్లో లెక్క కొంచెం వేరుగా ఉంటుంది.
ఒక పుస్తకం ఇంకా ప్రచురణలో ఉండగానే దాని మాన్యుస్క్రిప్ట్‌ను స్టూడియోలు చూడొచ్చు. కథలో సినిమా హుక్ ఉందా? ప్రధాన పాత్ర బలంగా ఉందా? ఇప్పటి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశం ఉందా? సినిమాగా తీస్తే దృశ్యపరంగా బాగుంటుందా? పెద్ద నటుడు లేదా నటి ఆ పాత్రపై ఆసక్తి చూపుతున్నారా? ఇప్పటికే ఇతర స్టూడియోలు పోటీ పడుతున్నాయా? ఇలా చాలా విషయాలను ముందే లెక్కలోకి తీసుకుంటారు.
పుస్తకం ఎంత అమ్ముడవుతుందో చెప్పడం కాదు.. సినిమా ఎంత బాగా అమ్ముడవుతుందో అంచనా వేయడం వాళ్ల పని.
.
‘Yesteryear’ పెద్ద బెస్ట్‌సెల్లర్ అయింది.
New York Times బెస్ట్‌సెల్లర్ జాబితాలో వరుసగా 17 వారాలు కొనసాగింది. దాదాపు 14 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది అత్యంత ఎక్కువగా చర్చించబడిన పుస్తకాలలో ఒకటిగా మారింది. అంటే పుస్తకం విడుదలకు ముందే హాలీవుడ్ చూసిన అవకాశం.. విడుదల తర్వాత పాఠకుల చేత కూడా నిరూపించబడింది.
ఇప్పుడు పుస్తకం హిట్ అయింది. Anne Hathaway తెరపై Natalieగా కనిపించబోతోంది. సినిమా ఇంకా స్క్రిప్టు డవలప్మెంట్ దశలోనే ఉంది. విడుదల తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు.ఇక హాలీవుడ్ ముందే చూసిన ఆ “సినిమా” నిజంగా తెరపై కూడా అంతే అద్భుతంగా కనిపిస్తుందా? అనేది తెలియాల్సిన విషయం.








