కేసీఆర్కు హరీష్ రావు వెన్నుపోటు.. కవిత సంచలన ఆరోపణలు!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అంతర్గత వైషమ్యాలు, తీవ్రస్థాయి ఆరోపణలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అత్యంత తీవ్రమైన రాజకీయ, ఆర్థికపరమైన ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు హరీశ్ రావు వెన్నుపోటు పొడిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, పార్టీని పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. గతంలోనూ హరీశ్ రావు తీరుపై కవిత బహిరంగంగా విమర్శలు చేసినప్పటికీ, ఈసారి నేరుగా సీఎం, బీజేపీ, కార్పొరేట్ సంస్థలతో ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల హరీశ్ రావు మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించారని కవిత వెల్లడించారు. ఆ భేటీలో పాల్గొన్న ఓ ఎమ్మెల్యే ద్వారా తనకు విశ్వసనీయ సమాచారం అందిందని ఆమె పేర్కొన్నారు. “కేసీఆర్ గారు ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి.. కానీ తన కొడుకుకు పార్టీ వారసత్వం ఇవ్వడం సరికాదు” అని హరీశ్ రావు ఆ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు కవిత ఆరోపించారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరును ఆయన ప్రస్తావించారంటేనే, కేసీఆర్పై వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారని అర్థమవుతోందని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ను పూర్తిగా హస్తగతం చేసుకున్నాక, బీజేపీ మద్దతు తీసుకోవాలనే వ్యూహంతో ఆయన అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు నగరానికి వచ్చిన ప్రతిసారీ ‘రాజ్పుష్ప ఓపెన్ స్కై విల్లాస్’ కేంద్రంగా హరీశ్ రావు తన షెడ్యూల్స్ రద్దు చేసుకుని రహస్య మంతనాలు సాగిస్తున్నారని, ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రితో హరీశ్ రావుకు అంతర్గత అవగాహన ఉందని కవిత తీవ్రంగా ఆరోపించారు. కొన్ని రోజుల క్రితం లండన్ వేదికగా ఇరువురి మధ్య రహస్య భేటీ, ఒప్పందం జరిగిందని, ఆ లాలూచీ ఫలితంగానే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో విచారణలు ముందుకు సాగడం లేదని ఆమె విమర్శించారు. ఒకవేళ లండన్లో ఎలాంటి అగ్రిమెంట్ జరగకపోతే, హరీశ్ రావుపై తక్షణమే ‘క్విడ్ ప్రో కో’ కేసు నమోదు చేసి నిజాయితీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రిని ఆమె డిమాండ్ చేశారు. ఈ లండన్ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ రక్షణ సేన త్వరలోనే ఆధారాలతో సహా ఒక్కొక్కటిగా బహిర్గతం చేస్తుందని హెచ్చరించారు.
ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీశ్ రావు పెద్ద ఎత్తున క్విడ్ ప్రో కో వ్యవహారాలకు పాల్పడ్డారని కవిత ఆరోపణలు సంధించారు. ఆంధ్రాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులతో వేల కోట్ల పాల వ్యాపారం నడిపారని ఆమె పేర్కొన్నారు. కేవలం శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలకే నెలకు రూ. 5 కోట్ల చొప్పున, గత 8 ఏళ్ల కాలంలో దాదాపు రూ. 960 కోట్ల విలువైన పాల వ్యాపారాన్ని సాగించారని లెక్కలు బయటపెట్టారు. వీటితో పాటు కిమ్స్, కామినేని, యశోద వంటి ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రులకు సైతం పాల సరఫరా పేరుతో భారీ లబ్ధి పొందారని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకే కాకుండా కరీంనగర్, ముల్కనూరు, మదర్ డెయిరీ, విజయ డెయిరీ వంటి స్థానిక సహకార సంస్థలకు ప్రాధాన్యత ఇస్తూ, ఐదుగురికి పైగా విద్యార్థులున్న ప్రతీ చోట వాటి నుంచే పాలు సేకరించేలా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకరికి పాల వ్యాపారం, మరొకరికి రియల్ ఎస్టేట్, ఇంకొకరికి ఇసుక దందాలు అన్న రీతిలో పంపకాలు జరిగి వ్యవస్థీకృత అవినీతి నడిచిందని కవిత మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ వైఫల్యాలను సాకుగా చూపి మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, ప్రజలు మరోసారి మోసపోవద్దని ఆమె పిలుపునిచ్చారు. అంతేకాకుండా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకున్న వ్యక్తులకు హరీశ్ రావు మద్దతు పలికారంటూ ఆయనను బీసీ వ్యతిరేకిగా ఆమె అభివర్ణించారు. అవినీతి లేని, జవాబుదారీతనంతో కూడిన ప్రజాపాలన కోసం, కొత్త తరానికి రాజకీయ అవకాశాలు కల్పించే లక్ష్యంతోనే తాము తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశామని, ప్రజలు తమ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కవిత కోరారు.








