సామాన్యుడిలా ప్లేట్ పట్టుకుని.. అన్న క్యాంటీన్ లో కేంద్ర మంత్రి..!
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో ఏర్పాటు చేసిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) అందరినీ ఆశ్చర్యపరిచారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం, ఆయన నేరుగా అక్కడే ఉన్న ‘అన్న క్యాంటీన్’కు చేరుకున్నారు. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా, సాధారణ సామాన్యుడిలా ప్లేట్ పట్టుకుని లైన్లోకి వెళ్లి మధ్యాహ్న భోజనం చేయడం అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది.
క్యాంటీన్‌కు చేరుకున్న మంత్రి రామ్మోహన్ నాయుడు మొదట స్వయంగా అక్కడికి విచ్చేసిన స్థానికులకు, పేదలకు భోజనాలను వడ్డించారు. ఆ తర్వాత ఆయన కూడా స్థానికులతో కలిసి కూర్చుని భోజనం చేశారు. భోజనం చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న వారితో ముచ్చటిస్తూ.. అన్న క్యాంటీన్లో అందిస్తున్న ఆహార నాణ్యత ఎలా ఉంది, క్యాంటీన్ పరిసరాల శుభ్రత ఎలా ఉందనే విషయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభించిన ‘అన్న క్యాంటీన్ల’ పనితీరుపై మంత్రి అభినందనలు వ్యక్తంచేశారు. గతంలో ప్రభుత్వం మారినప్పుడు ఈ క్యాంటీన్లను మూసేసినా, మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని ప్రారంభించి పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని ఈ సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ఇలా తమతో కలిసి భోజనం చేయడంతో కొత్తపేట గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.








