సూర్యకుమార్ యాదవ్ కమ్‌బ్యాక్ హింట్..?
భారత క్రికెట్ జట్టు మాజీ టీ20 కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి పునరాగమనం చేయడంపై సరికొత్త చర్చ మొదలైంది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో లంక క్రికెట్ లెజెండ్ సనత్ జయసూర్యతో సూర్యకుమార్ యాదవ్ సరదాగా ముచ్చటించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జయసూర్యను ఎంతో ఆప్యాయంగా పలకరించిన సూర్య.. ఆయన ఫిట్నెస్ను చూసి ఆశ్చర్యపోతూ “మళ్లీ ఫిట్‌గా తయారవుతున్నారు, ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఏమైనా కమ్‌బ్యాక్ ప్లాన్ చేస్తున్నారా? చూస్తుంటే 100% అలాగే ఉంది” అంటూ జోక్ చేశాడు.
సూర్య చేసిన ఈ ఫన్నీ కామెంట్‌కు జయసూర్య నవ్వేయగా, వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది. అయితే, ఈ వైరల్ వీడియో వెనుక సూర్యకుమార్ యాదవ్ సొంత కమ్‌బ్యాక్‌పై కూడా బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ గెలిపించిన కొద్దిరోజులకే.. బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోవడంతో సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు సంబంధించిన భారత జట్టు నుంచి పూర్తిగా పక్కనబెట్టారు.
బిసిసిఐ (BCCI) సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పటికీ.. భారత్ ప్రదర్శన ఘోరంగా పడిపోయింది. అయ్యర్ నాయకత్వంలో టీమిండియా ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అవ్వగా, ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా 4-0తో ఘోరంగా కోల్పోయింది. టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ పునరాగమనంపై బీసీసీఐ వర్గాల నుంచి కీలక సమాచారం బయటకు వచ్చింది.
సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టు తలుపులు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదని ఏఎన్ఐ (ANI) వార్తాసంస్థకు చెందిన ఒక అంతర్గత వనరు వెల్లడించింది. ప్రస్తుతానికి ఆయన భవిష్యత్తు ప్రణాళికల్లో లేకపోయినప్పటికీ, దేశీవాళీ క్రికెట్ లో స్థిరంగా పరుగులు సాధిస్తే మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపికయ్యే పూర్తి అర్హతను ఆయన కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ దేశీవాళీ మ్యాచుల్లో రాణించి, త్వరలోనే టీమిండియా మిడిలార్డర్‌ను బలోపేతం చేయడానికి తిరిగి వస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








