మీ మంచితనం మిమ్మల్నే ముంచుతోందా.. ఈ సంకేతాలు గమనించండి!
మనలో చాలామంది ఇతరులకు సహాయం చేయడం, అవసరమైనప్పుడు అండగా నిలబడటం మంచి లక్షణంగా భావిస్తారు. అయితే ఇదే మంచితనాన్ని కొందరు తమ అవసరాల కోసం ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకరి కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండటం, వారి సమస్యలను పదేపదే పరిష్కరించడం మొదట సాధారణంగానే అనిపించవచ్చు. కానీ క్రమంగా మీ సమయం, డబ్బు, శ్రమ (Efforts) , భావోద్వేగాలను (Emotions) మాత్రమే తీసుకుంటూ మీ అవసరాలను పట్టించుకోకపోతే ఆ సంబంధాన్ని ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని గుర్తించడానికి కొన్ని ప్రవర్తనా సంకేతాలు ఉపయోగపడతాయి. అయితే ఒక్క లక్షణం ఆధారంగా ఎవరైనా మిమ్మల్ని వాడుకుంటున్నారని నిర్ణయించకూడదు; పదేపదే కనిపించే ప్రవర్తనా విధానాన్ని గమనించాలి.
మీ మాటకు గౌరవం ఉందా

మొదటగా మీరు ‘నో’ చెప్పినప్పుడు ఎదుటివారి స్పందన ఎలా ఉంటుందో గమనించండి. మీరు ఒక పని చేయలేనని చెప్పగానే వారు కోపపడటం, బాధపెట్టే మాటలు మాట్లాడటం లేదా మీపై అపరాధ భావన కలిగించడం మొదలుపెడితే అది ఆరోగ్యకరమైన సంబంధానికి (Healthy Relation) సంకేతం కాదు. మీ పరిస్థితిని అర్థం చేసుకునే వ్యక్తి మీ నిర్ణయాన్ని గౌరవిస్తాడు.
అవసరం ఉన్నప్పుడే మిమ్మల్ని సంప్రదిస్తున్నారా? కొందరు వ్యక్తులు తమకు సహాయం కావాల్సినప్పుడు మాత్రమే ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం లేదా ప్రేమగా మాట్లాడటం చేస్తారు. పని పూర్తయిన తర్వాత మాత్రం మిమ్మల్ని పట్టించుకోరు. ఒక సంబంధంలో ఇచ్చిపుచ్చుకోవడం లేకుండా ఎప్పుడూ ఒకరే సహాయం చేస్తుంటే దాన్ని గమనించాలి.
ఇవి కూడా చదవండి
మీపై బాధ్యతలు మోపడం

మీ మంచితనాన్ని బాధ్యతగా మార్చడం మరో ముఖ్యమైన సంకేతం. మొదట చిన్న సహాయం అడిగిన వ్యక్తి, మీరు ఒకసారి సహాయం చేశారనే కారణంతో తర్వాత అదే విషయాన్ని మీ బాధ్యతగా భావించవచ్చు. “నువ్వు చేస్తావు కదా” అంటూ పదేపదే ఒత్తిడి చేయడం మొదలైతే మీ పరిమితులను స్పష్టంగా చెప్పడం అవసరం. సహాయం చేయడం మీ ఇష్టం కావాలి కానీ అది తప్పనిసరి కర్తవ్యంగా మారకూడదు.
సంబంధంలో శ్రద్ధ, గౌరవం లేకపోవడం

మీరు అలసిపోయినా, బాధలో ఉన్నా లేదా మీకు సమస్య ఉన్నా పట్టించుకోకుండా తమ అవసరాల గురించే మాట్లాడే వ్యక్తులు ఉంటారు. మీరు వారికి ఇచ్చే శ్రద్ధకు సమానమైన శ్రద్ధను తిరిగి ఇవ్వకపోతే సంబంధంలో అసమతుల్యత ఏర్పడుతుంది. మీ నిర్ణయాలను తప్పుబట్టడం, జరిగిన విషయాలను వేరే విధంగా చూపించడం, ప్రతి సమస్యకు మిమ్మల్నే కారణంగా నిలబెట్టడం వంటి ప్రవర్తన క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. ఇలాంటి మానసిక ఒత్తిడిని తేలిగ్గా తీసుకోకూడదు.
మంచితనానికి హద్దులు అవసరం
మంచితనం ఉండటం తప్పు కాదు. కానీ దానికి హద్దులు కూడా ఉండాలి. ఎవరికైనా సహాయం చేసే ముందు అది నిజంగా అవసరమా, ఆ వ్యక్తి మీ సహాయాన్ని గౌరవిస్తున్నారా, మీ పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటున్నారా అనేది ఆలోచించాలి. అవసరమైన చోట స్పష్టంగా ‘వద్దు’ అని చెప్పడం స్వార్థం కాదు. మీ సమయం, శక్తి, ప్రశాంతతకు విలువ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ఇలా ఆరోగ్యకరమైన హద్దులు పెట్టుకున్నప్పుడే మంచితనం మీకు భారంగా కాకుండా మంచి గుణంగా కొనసాగుతుంది.








