‘టిప్’ ను బ్యాన్ చేస్తున్న రెస్టారెంట్లు.. ఎందుకంటే? అసలు కారణం ఇదే!
ఇక మనకు హోటల్స్ లో, రెస్టారెంట్ లలో టిప్ సుల్తానులు ఇంక కనిపించకపోవచ్చు. అవును..టిప్ మీరు ఇద్దామని, జాలి, దయతో మీ హృదయం తహతహలాడినా తీసుకునేవాళ్లు కరువు అయ్యే అవకాసం ఉంది. కంగారుపడకండి ఇది ఇండియాలో కాదు…అమెరికాలోనే. అక్కడ ఇదే పెద్ద ట్రెండ్. ఇది సక్సెస్ అయ్యితే మనోళ్లు మొదలెట్టేస్తారనటంలో సందేహం ఏ మాత్రం లేదు. అయినా హఠాత్తుగా ప్రపంచంలో ఏమీ దొరకనట్లు ఈ టిప్ ల మీద దృష్టి పెట్టిందేంటి ప్రపంచం అంటారా…అదే ఇంట్రస్టింగ్ ..
అమెరికాలో కొత్త ట్రెండ్ మొదలైంది. చాలా రెస్టారెంట్లు తమ స్టాఫ్ కు టిప్స్‌ను ఇవ్వద్దంటున్నాయి. “కస్టమర్ ఇచ్చే టిప్ మీద మా సిబ్బంది బతకాల్సిన అవసరం ఉండకూడదు. వాళ్ల జీతం మేమే ఇస్తాం” అంటున్నాయి.ఎందుకి హఠాత్తు నిర్ణయం..ఎందుకు తమ స్టాఫ్ కు వచ్చే టిప్స్ మీద రెస్టారెంట్స్ ఓనర్స్ దృష్టి పెట్టి, చెక్ చెప్పాల్సి వచ్చింది?.
సాధారణంగా రెస్టారెంట్లో మనకు కనిపించేది సర్వర్. కానీ వాళ్ల వెనుక అసలు పని చేసే వాళ్లు వంటగదిలో ఉంటారు. ఆహారం తయారు చేయడం, ప్లేట్లు సిద్ధం చేయడం, గంటల తరబడి నిలబడి పనిచేయడం.. ఇవన్నీ వాళ్లే చేస్తారు. కానీ కస్టమర్ టిప్ మాత్రం ఎక్కువగా టేబుల్ దగ్గర కనిపించే సర్వర్కే వెళ్తుంది.
మసాచుసెట్స్‌లోని నైట్‌షేడ్ నూడిల్ బార్ యజమాని రాచెల్ మిల్లర్‌కు ఇదే విషయం నచ్చలేదు. “ఒకే రెస్టారెంట్లో ఒకే సమయం పనిచేస్తున్న ఇద్దరిలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ సంపాదించడానికి కారణం కస్టమర్ ఎవరికెంత టిప్ ఇచ్చాడన్నదే అయితే అది సరైన వ్యవస్థ కాదు” అని ఆమె భావించారు.
అంతేకాదు, లింగం, జాతి వంటి అంశాలు కూడా టిప్ మొత్తంపై ప్రభావం చూపుతున్నాయని మిల్లర్ చెబుతున్నారు. ఒకే స్థాయిలో పనిచేసినప్పటికీ తెల్లజాతి పురుష సిబ్బందికి ఎక్కువ టిప్స్, ఇతరులకు తక్కువ టిప్స్ రావడం ఆమె గమనించారు. “ఒక వ్యక్తి జీతం అతని లింగం, జాతి లేదా లైంగికత ఆధారంగా మారకూడదు” అనే ఉద్దేశంతో టిప్స్‌ను తొలగించారు.
అలాగే అమెరికాలో ‘టిప్ ఫెటీగ్’ కూడా పెరుగుతోంది. కాఫీ నుంచి డెలివరీ వరకు ప్రతి సేవకూ టిప్ అడుగుతుండటంతో కస్టమర్లు అసహనానికి గురవుతున్నారు.
అందుకే టిప్‌ను తీసేశారు. కానీ ఇక్కడే అసలు లెక్క మొదలవుతుంది. టిప్ పోయింది కానీ ఆ డబ్బు మాయమైపోలేదు. ఆ టిప్స్ ద్వారా వచ్చే డబ్బుని తన స్టాఫ్ కు జీతంగా ఇవ్వాలనుకున్నారు.
అయితే అక్కడ ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇవ్వాలి కాబట్టి మెనూ ధరలు పెరిగాయి. అంటే ఇంతకుముందు 80 డాలర్లుగా ఉన్న భోజనం ఇప్పుడు 100 డాలర్లుగా కనిపించొచ్చు. కానీ ఆ 100 డాలర్ల తర్వాత మరో 20 డాలర్లు టిప్‌గా అడగరు.
ఇక్కడో మైండ్ గేమ్
ఇక్కడ కస్టమర్‌కు మాత్రం చిన్న మైండ్ గేమ్ మొదలవుతుంది. 100 డాలర్ల బిల్లు కనిపిస్తే “అబ్బా.. చాలా ఖరీదు!” అనిపిస్తుంది. అదే 80 డాలర్ల బిల్లు చూసి చివర్లో 20 శాతం టిప్ ఇచ్చినా అంత పెద్దగా అనిపించకపోవచ్చు. మనం మొత్తం ఎంత ఖర్చు చేశామన్నదానికంటే బిల్లుపై కనిపించిన మొదటి సంఖ్యను చూసి ఖర్చు ఎక్కువా తక్కువా అని నిర్ణయించుకుంటాం.
అందుకే కొన్ని రెస్టారెంట్లు టిప్లేని విధానాన్ని తీసుకొచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయాయి. మసాచుసెట్స్‌లోని తలుల్లా అనే రెస్టారెంట్ కూడా టిప్స్‌ను తీసేసి, ఉద్యోగుల జీతాల కోసం మెనూ ధరలను 23 శాతం పెంచింది. కానీ ఆ విధానం ఎక్కువకాలం నిలబడలేదు. చివరికి మళ్లీ టిప్స్ తీసుకొచ్చింది.
అయితే ఉద్యోగుల దగ్గర మాత్రం కథ కాస్త వేరుగా ఉంది.
టిప్ మీద పనిచేసేవాళ్లకు ఒక రోజు 200 డాలర్లు రావచ్చు. మరో రోజు 80 డాలర్లు రావచ్చు. కస్టమర్లు ఎంత ఇచ్చారో దానిపైనే ఆధారపడాలి. పైగా కస్టమర్ తక్కువ టిప్ ఇస్తే.. “సర్వీస్ సరిగ్గా ఇవ్వలేదా? నేను ఏం తప్పు చేశాను?” అనే ఆలోచన కూడా వస్తుంది. టిప్లేని విధానంలో మాత్రం లెక్క చాలా క్లియర్. “నేను గంటకు ఇంత సంపాదిస్తాను.” అంతే.
ఒక రెస్టారెంట్లో గతంలో గంటకు 10 డాలర్లు, దానికి అదనంగా టిప్స్ తీసుకునే ఉద్యోగి.. టిప్స్ తీసేసిన తర్వాత గంటకు 21 డాలర్ల స్థిరమైన వేతనం పొందారు. ఆమెకు అది నచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఎంత టిప్ వస్తుందో అంచనా వేయాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఇక కస్టమర్లలో కూడా మరో రకమైన విసుగు పెరుగుతోంది. దీన్నే అమెరికాలో “టిప్ ఫెటీగ్” అంటున్నారు.
కాఫీ తీసుకున్నా టిప్. డెలివరీ తీసుకున్నా టిప్. రెస్టారెంట్లో తిన్నా టిప్. కొన్ని సందర్భాల్లో చిన్న సేవకూ టిప్ ఆప్షన్ స్క్రీన్ మీద ముందుకొస్తోంది. “ప్రతి పనికీ మళ్లీ టిప్ ఎందుకు?” అనే ప్రశ్న కస్టమర్లలో పెరుగుతోంది.
అందుకే కొన్ని రెస్టారెంట్లు ఇప్పుడు ఒక సింపుల్ మెసేజ్ ఇస్తున్నాయి: “మీరు మాకు ఇవ్వాల్సిన మొత్తం మెనూలోనే ఉంది. అదనంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు.” అని. చాలా రెస్టారెంట్స్ ఈ కొత్త ట్రెండ్ ని ప్రస్తుతానికి అయితే ఫాలో అవుతున్నాయి.
అయితే టిప్స్ పూర్తిగా పోతాయని మాత్రం చెప్పలేం. ఎందుకంటే మంచి సర్వర్లు టిప్స్ ద్వారా కొన్నిసార్లు చాలా ఎక్కువ సంపాదిస్తారు. వాళ్లను టిప్లేని రెస్టారెంట్లకు తీసుకురావడం, అక్కడే ఎక్కువకాలం ఉంచడం అంత ఈజీ కాదు.
అందుకే ఇది కేవలం “టిప్ ఇవ్వాలా? వద్దా?” అనే విషయం కాదు. ఒక రెస్టారెంట్ ఉద్యోగి జీతాన్ని కస్టమర్ మూడ్ నిర్ణయించాలా? లేక యజమాని ముందే న్యాయమైన జీతం నిర్ణయించాలా? అమెరికాలో కొన్ని రెస్టారెంట్లు రెండో దారిని ఎంచుకుంటున్నాయి.
కస్టమర్‌కు మాత్రం ఈ కొత్త పద్ధతి చాలా సింపుల్‌గా ఉంటుంది. బిల్లు వచ్చింది. డబ్బు చెల్లించాం. బయటికి వచ్చేశాం. కానీ ఒక చిన్న ట్విస్ట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. టిప్ అడగడం మానేసిన రెస్టారెంట్.. ఆ టిప్ ఖర్చును మెనూలో ముందే కలిపి ఉండొచ్చు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








