విదేశాలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్ట్‌లో ఈ సీన్ ఇక కనిపించదు!!
పాస్‌పోర్ట్ చేతిలో ఉంది. ఫోన్లో టికెట్ ఉంది. బ్యాగ్ చెక్ అయిపోయింది. ఇక ఇమ్మిగ్రేషన్ కౌంటర్ ఒక్కటే మిగిలింది.
అక్కడికి వెళ్లగానే అధికారి బోర్డింగ్ పాస్ తీసుకుని చూస్తారు. కొన్ని సెకన్లు పరిశీలిస్తారు. తర్వాత దానిపై ఓ స్టాంప్ వేస్తారు. ప్రయాణికుడు దాన్ని మరోసారి చూసుకుని జేబులో పెట్టుకుంటాడు. విదేశీ ప్రయాణంలో ఇది ఎప్పటి నుంచో కనిపించే సాధారణ సీన్.
కానీ ఇకపై ఈ సీన్ మారబోతోంది.
విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర బోర్డింగ్ పాస్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ప్రింట్ తీసుకుని రావాల్సిన తప్పనిసరి రూల్ కూడా ఉండదు. మరి అక్కడ ఏం చూపించాలి? అదే ఇప్పుడు వచ్చిన కొత్త మార్పు.
సెప్టెంబర్ 1 నుంచి భారత్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బోర్డింగ్ పాస్ విషయంలో కొత్త విధానం అమల్లోకి రానుంది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ నిర్ణయం ప్రకారం, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ సమయంలో భౌతిక బోర్డింగ్ పాస్‌ను తప్పనిసరిగా చూపించాల్సిన అవసరం ఉండదు. అలాగే బోర్డింగ్ పాస్‌పై ఇమ్మిగ్రేషన్ స్టాంప్ కూడా వేయరు.
అంటే ప్రయాణికుల చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌నే బోర్డింగ్ పాస్‌గా ఉపయోగించుకోవచ్చు. ఫోన్లో ఉన్న ఈ-బోర్డింగ్ పాస్‌ను ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద చూపిస్తే సరిపోతుంది.
ఇప్పటివరకు ఏం జరిగేది అంటే.. అంతర్జాతీయ ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద పాస్‌పోర్ట్‌తో పాటు బోర్డింగ్ పాస్‌ను చూపించేవారు. అధికారులు వివరాలను పరిశీలించిన తర్వాత కొన్ని సందర్భాల్లో బోర్డింగ్ పాస్‌పై స్టాంప్ వేసేవారు. కొత్త విధానంతో ఈ స్టెప్నే తొలగిస్తున్నారు.
దీంతో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. బోర్డింగ్ పాస్‌పై స్టాంప్ సరిగ్గా పడిందా? క్లియర్‌గా ఉందా? అనే చిన్న చిన్న సమస్యలు కూడా ఉండవు.
అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రింట్ చేసిన బోర్డింగ్ పాస్ తీసుకెళ్లకూడదనే రూల్ ఏమీ లేదు. పేపర్ కాపీతో ప్రయాణించడం మీకు సౌకర్యంగా ఉంటే దాన్ని తీసుకెళ్లవచ్చు. కానీ ఇమ్మిగ్రేషన్ సమయంలో దానిపై స్టాంప్ మాత్రం వేయరు.
మరి ఫోన్లో బోర్డింగ్ పాస్ ఎలా వస్తుంది?
చాలా సింపుల్. మీరు ప్రయాణించే ఎయిర్‌లైన్ వెబ్సైట్లోకి వెళ్లి Web Check-in ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ PNR నంబర్, మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ వివరాలు నమోదు చేయాలి.
ఆ తర్వాత సీటు ఎంచుకుని చెక్-ఇన్ పూర్తి చేస్తే బోర్డింగ్ పాస్ జనరేట్ అవుతుంది. దాన్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ఎయిర్లైన్లు ఈ-బోర్డింగ్ పాస్‌ను ఈమెయిల్ లేదా WhatsApp ద్వారా కూడా పంపిస్తాయి.
అందుకే సెప్టెంబర్ 1 తర్వాత విదేశాలకు వెళ్లేవారు ఒక పని ముందుగానే చేసుకోవడం మంచిది. బోర్డింగ్ పాస్‌ను ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకుని సిద్ధంగా పెట్టుకోండి. అవసరమైనప్పుడు స్క్రీన్‌పై చూపించవచ్చు.
విమానాశ్రయంలో గంటల తరబడి కనిపించే చిన్న చిన్న ప్రక్రియలు ఒక్కొక్కటిగా డిజిటల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ మార్పు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర బోర్డింగ్ పాస్‌పైనా కనిపించబోతోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








