Flipkart కొత్త రూల్… సరిగ్గా లేకపోతే బ్యాండ్ బజా బరాత్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
పండుగకు కొత్త బట్టలు కొనాలి. పిల్లలకు షూస్ తీసుకోవాలి. ఇంటికి ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకోవాలి. షాపింగ్ మాల్‌కు వెళ్లే టైమ్ లేకపోతే ఫోన్ తీసి ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేస్తాం. డబ్బులు కట్ అవుతాయి. “ఆర్డర్ కన్ఫర్మ్ అయింది” అనే మెసేజ్ వస్తుంది. ఇక పండుగకు ముందే పార్సిల్ ఇంటికి వచ్చేస్తుందని మనం ఫిక్స్ అయిపోతాం.
కానీ ఆ పార్సిల్ పంపాల్సిన వ్యక్తి సమయానికి పంపకపోతే? చివరికి ఆర్డర్ క్యాన్సిల్ అయితే? కస్టమర్‌కు నిరాశ.. సెల్లర్‌కు పెనాల్టీ. ఇప్పుడు ఈ రెండో భాగాన్నే ఫ్లిప్‌కార్ట్ గట్టిగా పట్టుకుంది.
పండుగ సీజన్ మొదలయ్యే ముందు ఫ్లిప్‌కార్ట్ కొత్త పెనాల్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆగస్టు 23 నుంచి ఈ కొత్త రూల్స్ అమలవుతున్నాయి. కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత నిర్ణయించిన తేదీలోపు వస్తువును డిస్పాచ్ చేయకపోతే సెల్లర్‌పై రూ.30 నుంచి రూ.60 వరకు పెనాల్టీ పడుతుంది. ఆర్డర్‌ను సెల్లర్ స్వయంగా క్యాన్సిల్ చేస్తే కూడా ఛార్జ్ ఉంటుంది.
ఇక డిస్పాచ్ గడువు దాటిపోయిన తర్వాత అదే ఆర్డర్‌ను క్యాన్సిల్ చేస్తే పెనాల్టీ రూ.90 వరకు వెళ్తుంది.
చూస్తే రూ.90 పెద్ద మొత్తంలా అనిపించదు. ఒక టీ షాప్‌లో నాలుగు ఐదు టీలు తాగితే ఖర్చయ్యే డబ్బే. కానీ ఇక్కడ అసలు లెక్క ఒక్క ఆర్డర్‌తో కాదు.. వందలు, వేల ఆర్డర్లతో.
ఒక సెల్లర్‌కు 1,000 ఆర్డర్లు వచ్చాయని అనుకుందాం. వాటిపై రూ.90 చొప్పున పెనాల్టీ పడితే ఏకంగా రూ.90,000 పోతాయి. పండుగ సీజన్లో ఆర్డర్లు ఇంకా పెరిగితే ఈ మొత్తం కూడా పెరుగుతుంది.
అందుకే ఇది కేవలం “రూ.90 ఫైన్” కథ కాదు. ఆన్లైన్లో వస్తువు అమ్మే చిన్న వ్యాపారికి ఇది తన లాభంలో నుంచి నేరుగా కట్ అయ్యే డబ్బు.
ఇక్కడే సామాన్యుడి కథ కూడా మొదలవుతుంది.
మనకు ఫ్లిప్‌కార్ట్‌లో ఒక వస్తువు రూ.999కి కనిపిస్తుంది. “ఇది ఆఫర్లో ఉంది” అని వెంటనే ఆర్డర్ చేస్తాం. కానీ ఆ వస్తువు వెనక ఒక చిన్న సెల్లర్ ఉంటాడు. అతని దగ్గర స్టాక్ ఉండాలి. ప్యాక్ చేయాలి. సమయానికి డిస్పాచ్ చేయాలి. ఒక్క దశలో సమస్య వచ్చినా ఆర్డర్ ఆలస్యం కావచ్చు.
పండుగ సీజన్లో ఇదే ఒత్తిడి మరింత పెరుగుతుంది.
ఎందుకంటే దసరా, దీపావళి దగ్గరపడుతున్నప్పుడు కస్టమర్‌కు ఒక్క రోజు ఆలస్యం కూడా పెద్ద విషయమే. పండుగకు వేసుకోవాల్సిన డ్రెస్ ఆలస్యంగా వస్తే? పిల్లల కోసం ఆర్డర్ చేసిన గిఫ్ట్ పండుగ తర్వాత వస్తే? ఇంటికి కావాల్సిన వస్తువు పండుగ రోజుకు ముందు రాకపోతే?
అప్పుడు కస్టమర్‌కు “సెల్లర్‌కు ఇబ్బంది వచ్చింది” అనే కథ అవసరం లేదు. అతనికి కావాల్సింది తన పార్సిల్ మాత్రమే.
ఇదే కారణంగా ఈ-కామర్స్ కంపెనీలు సెల్లర్లపై డెలివరీ, డిస్పాచ్ విషయంలో క్రమంగా ఒత్తిడి పెంచుతున్నాయి. కస్టమర్‌కు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చాలని చూస్తున్నాయి.
అయితే చిన్న సెల్లర్లకు మాత్రం మరో భయం ఉంది. పెద్ద కంపెనీలకు ప్రత్యేక గిడ్డంగులు, సిబ్బంది, లాజిస్టిక్స్ వ్యవస్థలు ఉంటాయి. చిన్న వ్యాపారి మాత్రం పరిమిత సిబ్బందితోనే వందల ఆర్డర్లను మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ కొత్త రూల్ వారికి ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది.
“ఆర్డర్లు ఎక్కువగా తీసుకోవడం మాత్రమే కాదు.. వాటిని సమయానికి పంపే సామర్థ్యం కూడా ఉండాలి.”
ఫ్లిప్‌కార్ట్ దృష్టిలో ఇది కస్టమర్ సర్వీస్‌ను మెరుగుపరిచే ప్రయత్నం. కస్టమర్ దృష్టిలో చూస్తే ఇది మంచి పరిణామమే. ఎందుకంటే ఆర్డర్ చేసి చివరి నిమిషంలో క్యాన్సిల్ కావడం ఎవరికీ ఇష్టం ఉండదు.
కానీ చిన్న సెల్లర్ దృష్టిలో మాత్రం లెక్క మారుతుంది. పండుగ సీజన్లో అమ్మకాలు పెరగాలి. అదే సమయంలో ఒక్క తప్పు కూడా జరగకూడదు. లేకపోతే పండుగ సమయంలో కస్టమర్ ఇంట్లో బ్యాండ్ బజా మోగుతుందో లేదో తెలియదు కానీ… సెల్లర్ అకౌంట్లో మాత్రం పెనాల్టీకి బ్యాండ్ బజా బరాత్ ఖాయం!








