ఏపీ గిరిజన గురుకుల ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్..!
ఆంధ్రప్రదేశ్లోని గిరిజన గురుకుల ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న గిరిజన గురుకుల సొసైటీ (APTWREIS) రెగ్యులర్ బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ‘జీవో ఎంఎస్ నంబర్ -33’ను విడుదల చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. గతేడాది జులై 2026 నుంచి రిటైర్ అయ్యేందుకు అర్హత సాధించిన ఉద్యోగులందరికీ ఈ వయస్సు పెంపు నిబంధన వర్తిస్తుంది. వారందరినీ విధుల్లో కొనసాగించనున్నారు. ఆర్థిక శాఖ గతంలో జారీ చేసిన జీవో నంబర్-45 నిబంధనల పరిధిని ప్రామాణికంగా తీసుకుని ఈ విరమణ వయస్సు పెంపును వర్తింపజేశారు. అయితే, రీ-ఇండక్షన్ (తిరిగి విధుల్లో చేర్చుకునే) కాలానికి సంబంధించి ఎలాంటి పాత వేతన బకాయిలు ఉండవని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఈ వయస్సు పెంపు నిర్ణయాన్ని ఎలాంటి అదనపు కొత్త పోస్టులను సృష్టించకుండా, ప్రస్తుతం ఉన్న పరిమితుల్లోనే అమలు చేయాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. అలాగే 2026-27 వార్షిక బడ్జెట్ పరిధిలోనే దీనికి సంబంధించిన వ్యయాన్ని సర్దుబాటు చేయాలని పేర్కొంది. ఒకవేళ అవసరమైతే.. నిర్దేశిత 28 మంది బోధన సిబ్బంది కొనసాగింపునకు రూ.4.12 కోట్ల అదనపు నిధుల మంజూరు ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తామని గిరిజన సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), కార్పొరేషన్ల పరిధిలోని ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచగా, ఇప్పుడు గిరిజన గురుకుల సిబ్బందికి కూడా దీనిని విస్తరించడం పట్ల ఉద్యోగ సంఘాలు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.








