సిలికాన్ ఆంధ్రా రజతోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న సంగీత దిగ్గజాలు!
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, ఓక్లాండ్ అరెనా వేదికగా సిలికాన్ ఆంధ్రా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సిలికాన్ ఆంధ్రా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్’ (రజతోత్సవాలు) జులై 31 నుండి ఆగస్టు 1, 2026 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. 25 ఏళ్ల సాంస్కృతిక ప్రయాణాన్ని పురస్కరించుకుని, సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతను చాటిచెప్పేలా ఈ గొప్ప వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ రజతోత్సవ వేడుకల్లో భారత్ నుండి ప్రఖ్యాత సంగీత దిగ్గజాలు ప్రత్యేకంగా పాల్గొని తమ ప్రదర్శనలతో సంగీత ప్రియులను అలరించనున్నారు.
ఈ వేడుకల్లో పాల్గొననున్నది వీరే…
డా. త్రిచి శంకరన్: అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన విద్వాంసులు, సంగీత కళానిధి డా. త్రిచి శంకరన్ ఈ వేడుకల్లో పాల్గొని తమ అద్భుతమైన ప్రదర్శనతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేయనున్నారు.
విద్వాన్ శ్రీ కె.ఎన్. శశికీరణ్: ప్రఖ్యాత కర్ణాటక గాయకులు, కంపోజర్, ఆర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్ విద్వాన్ శ్రీ కె.ఎన్. శశికీరణ్ సంప్రదాయానికి నూతనత్వాన్ని జోడిస్తూ కర్ణాటక సంగీత వైభవాన్ని చాటిచెప్పనున్నారు.
విద్వాన్ శ్రీ పత్రి సతీష్ కుమార్: లెజెండరీ, మృదంగ నాధ మణి, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత విద్వాన్ శ్రీ పత్రి సతీష్ కుమార్ తన లయలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.
కళైమమణి శ్రీ తిరువారూర్ వైద్యనాథన్: ప్రముఖ కర్ణాటక సంగీత దిగ్గజం, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ‘కళైమమణి’ శ్రీ తిరువారూర్ వైద్యనాథన్ తరాలను దాటి నిలిచే తన లయ ప్రదర్శనతో అలరించనున్నారు.
విదుషి సుధా రఘునాథన్: ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విదుషి సుధా రఘునాథన్ తన మధురమైన గాత్రంతో వేదికను కనువిందు చేయనున్నారు.
సంగీత, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ఈ దివ్య సంగీత అనుభూతిలో సంగీత ప్రియులందరూ పాలుపంచుకోవాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.








