‘ఫ్లిప్‌కార్ట్’ కొత్త AI షాపింగ్ ప్రయోగం.. తేడా కొడుతోందే!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఫ్లిప్‌కార్ట్ కానీ అమేజాన్ కానీ మరో షాపింగ్ సైట్ కానీ ఓపెన్ చేసి వెతకడం మొదలుపెడితే దానికి ఆదీ అంతం ఉండదు. మనం అనుకున్నది కొనేసి వెంటనే బయటకు వచ్చేయలేము. ఒకటి చూస్తాం, ఇంకొకటి నచ్చుతుంది. ఒకదాని ధర తక్కువగా ఉంటుంది, మరొకదానికి రివ్యూలు బాగుంటాయి. ఇంకొకటి ఫొటోలో అదిరిపోతుంది. చివరికి సెర్చ్ చేసి చేసీ చివరకు, మొదట వెతికిన వస్తువు ఏదో కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంది.ఆ క్రమంలో అసలు కొనాలనుకోని వస్తువును కూడా కార్ట్‌లో వేసుకుంటాం, బిల్ పే చేస్తాం. ఎంతో టైమ్ వేస్ట్ కదా అంటే… అదే కదా షాపింగ్లోని చిన్న మజా!అని తేల్చేస్తాం. అయితే ఇప్పుడు ప్లిఫ్ కార్ట్ సంస్ద ఈ తిప్పలన్నీ మీకెందుకు మీకో బ్రహ్మాండమైన సౌకర్యం ఇస్తానని బయిలుదేరింది.
మీ బదులు AI షాపింగ్ చేస్తుంది!
ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన డిజిటల్ పేమెంట్స్ సంస్థ Super.money ఇప్పుడు ఓ కొత్త ఆలోచనతో ముందుకు వస్తోంది. కస్టమర్ల కోసం AI ఏజెంట్లను దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోంది. రాబోయే రెండు నెలల్లో తన మొత్తం కస్టమర్ బేస్‌కు ఈ సదుపాయాన్ని అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. Super.moneyకి ప్రస్తుతం నెలకు దాదాపు 2 కోట్ల యాక్టివ్ యూజర్లు ఉండటం చూస్తే.. ఇది చిన్న ప్రయోగం కాదని అర్థమవుతుంది.
మొదట ఈ AI ఏజెంట్ల పని ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయించడమే. మీకు ఏం కావాలో, ఎంత బడ్జెట్లో కావాలో చెబితే.. మీ అవసరానికి తగ్గ వస్తువులను AI వెతికి, వాటి ధరలు, ఫీచర్లు వంటి విషయాలను పరిశీలించి సరైన ఆప్షన్ వైపు తీసుకెళ్తుంది. ఇది సక్సెస్ అయితే భవిష్యత్తులో కేవలం ఫ్లిప్‌కార్ట్‌తోనే ఆగకుండా ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఇదే విధంగా కొనుగోళ్లు చేయించే ఆలోచనలో సంస్థ ఉంది.
అంటే ఇప్పటివరకు మనం యాప్‌లోకి వెళ్లి సెర్చ్ చేసేవాళ్లం. ఇకపై మన అవసరాన్ని AIకి చెప్పడం మాత్రమే చేసి, సెర్చ్ బాధ్యత దానికి అప్పగించవచ్చు.
సౌకర్యం సరే..కిక్ ఏది బాస్
ఒక వస్తువు కొనాలంటే మనం ఎంత టైమ్ ఖర్చు పెడతామో ఆలోచించండి. ఏ బ్రాండ్ బాగుంటుంది, ఏ మోడల్ తీసుకోవాలి, ధర ఎంత ఉంది, ఆఫర్ నిజంగానే ఆఫరేనా, రివ్యూలు ఎలా ఉన్నాయి..ఎవరికో ఫోన్ చేస్తాం.. ఇలా ఒక్క చిన్న కొనుగోలుకే పెద్ద రీసెర్చ్ చేస్తూంటాం.ఈ పనంతా AI తీసుకుంటే నిజంగా మనకు సమయం మిగులుతుంది. ముఖ్యంగా రోజూ చేయాల్సిన కొనుగోళ్లు, అవసరమైన వస్తువులు, ఒకే రకమైన ప్రొడక్టుల్లో బెస్ట్ ఆప్షన్ ఎంచుకోవాల్సిన సందర్భాల్లో ఇది చాలా ఉపయోగపడొచ్చు.
కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. చాలా మంది నిజంగా షాపింగ్ అవసరమయ్యి చేయరు. అందులో వాళ్లు కిక్ వెతుక్కుంటారు. మజా అనుభవిస్తారు. అయితే ఈ యాంగిల్ ని కంపెనీ మర్చిపోయినట్లుంది. మనం షాపింగ్‌ను ఎందుకు ఇష్టపడతాం అన్నది ఇక్కడ మర్చిపోయింది.
AI చేయబోయే పనేంటి.. మనకు ఇప్పటికే తెలిసిన అవసరాలు, మన బడ్జెట్, మన గత కొనుగోళ్లు, మన ఇష్టాల ఆధారంగా “ఇదే నీకు బెస్ట్” అని చెప్పే అవకాశం ఉంది. అక్కడే కొంచెం తేడా మొదలవుతుంది. AI ధర తగ్గే వరకు కూడా వేచి చూస్తుందట.
Super.money ప్రయోగంలో మరో ఆసక్తికరమైన అంశం బంగారం కొనుగోలు.
ఉదాహరణకు మీరు ఒక నిర్దిష్ట ధరను నిర్ణయించుకున్నారనుకోండి. బంగారం ఆ ధరకు వచ్చినప్పుడు కొనాలని అనుకుంటున్నారు. ప్రతిరోజూ ధరలు చూస్తూ కూర్చోవడం మన వల్ల కాదు. అలాంటి పనిని AIకి అప్పగించవచ్చు. మీరు పెట్టిన ధర స్థాయికి మార్కెట్ వచ్చినప్పుడు, మీ తరఫున కొనుగోలు చేసే విధంగా ఏజెంట్ పనిచేయగలదు.
ఇక్కడ AI కేవలం “ఏం కొనాలి?” అని చెప్పడం లేదు. “ఎప్పుడు కొనాలి?” అన్నదాన్ని కూడా గమనిస్తోంది. ఇదే ఆలోచన భవిష్యత్తులో మరిన్ని వస్తువులకు విస్తరించవచ్చు. మనకు ఒక వస్తువు కావాలి, కానీ ఇప్పుడున్న ధర నచ్చలేదు. “ఈ ధర కంటే తక్కువకు వస్తే కొను” అని AIకి చెప్పేసి మన పనిలో మనం ఉండొచ్చు. అది సరైన సమయం కోసం వేచి చూసి, షరతు నెరవేరితే కొనుగోలు చేయగలదు.ఇలాంటివి కొన్ని బాగానే ఉన్నాయి.
షాపింగ్ నుంచి బిల్లుల వరకు.. ఆ తర్వాత పెట్టుబడుల వరకు!
Super.money అసలు ప్లాన్ ఇక్కడితో ముగియడం లేదు. భవిష్యత్తులో AI ఏజెంట్లను బిల్లులు చెల్లించడం, పెట్టుబడులకు సంబంధించిన పనులు చేయడం వంటి ఆర్థిక సేవలకూ విస్తరించాలని సంస్థ భావిస్తోంది.
అంటే ఈ రోజు “నా కోసం ఒక వస్తువు వెతుకు” అని AIకి చెప్పొచ్చు. రేపు “నా బిల్లు చెల్లించు” అనొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే “ఈ ధరకు బంగారం వస్తే కొను” అని చెప్పొచ్చు.
ఇలా చూస్తే AI ఏజెంట్ కేవలం షాపింగ్ అసిస్టెంట్‌గా ఉండదు. క్రమంగా మన డబ్బుతో మనం చేసే కొన్ని పనులను మన తరఫున నిర్వహించే డిజిటల్ సహాయకుడిగా మారొచ్చు.
అందుకే Super.money ఈ టెక్నాలజీపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతోంది. ఈ ఏడాది సంస్థ ఇంజినీరింగ్ ఖర్చుల్లో దాదాపు 20 శాతం AI ఏజెంట్లను నిర్మించడం, వాటిని పెద్ద స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికే కేటాయించనుంది. మరో మూడు నాలుగేళ్లలో ఈ మోడల్ బాగా పనిచేస్తే, సంస్థ ఆదాయంలో 30 నుంచి 40 శాతం వరకు ఇలాంటి AI ఆధారిత సేవల నుంచే రావచ్చని సీఈఓ ప్రకాశ్ సికరియా అంచనా వేస్తున్నారు.
అన్నీ బాగానే ఉన్నాయి.కానీ …
మనం పైనే చెప్పుకున్నట్లు షాపింగ్ చేసేది కేవలం “సరైన వస్తువు” కోసం మాత్రమేనా?
కొత్త వస్తువును చూసి ఆశ్చర్యపోవడం, ఊహించని బ్రాండ్ నచ్చడం, మనకు నిజంగా ఏది కావాలో వెతుకుతూ తెలుసుకోవడం.. ఇవన్నీ కూడా షాపింగ్‌లో భాగమే కదా. AI ఈ మొత్తం ప్రక్రియను చాలా సమర్థంగా మార్చొచ్చు. కానీ అదే సమయంలో మన క్యూరియాసిటీని, డిస్కవరీని తగ్గించే అవకాశం కూడా ఉంది.అప్పుడు దాన్ని జనం ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.








