మీ విజ్ఞానం, అనుభవం, నైపుణ్యం ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వండి: కేంద్ర మంత్రి డా. చంద్రశేఖర్ పెమ్మసాని
ఈరోజు విజయవాడ పార్టీ కేంద్రఆఫీసులో అత్యంత ఘనంగా జరిగిన గ్లోబల్ ఎన్నారై టీడిపి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రత్యేకాతిథిగా వచ్చిన కేంద్రమంత్రి డాక్టర్ చంద్ర పెమ్మసాని మాట్లాడుతూ.. “ దాదాపు ముప్పై ఏళ్ల క్రితమే రాబోయే అంతర్జాతీయ ప్రమాణాలు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అనేక ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించి, వేల సంఖ్యలో ఇంజనీర్లను తయారు చేసి, వేల సంఖ్యలో అమెరికా, లండన్ నే కాకుండా, అన్ని ప్రపంచంలోని అన్ని దేశాలకు తెలుగువారిని పంపి, వారిని ఎన్నారైలు గా గుర్తించేలా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిది. ఆయన మార్గదర్శకత్వంలో, యువనాయకుడు నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఎన్నారైల మీద ప్రత్యేక దృష్టి సారించారు.
ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా సరే, తెలుగువారు అక్కడ “ఎన్నారై” గా ఉద్యోగాలు చేస్తూ స్థిరపడి ఉన్నారు. వాళ్లు నివసిస్తున్న దేశంలో పేరు తెచ్చుకోవడమే కాకుండా, మాతృదేశం అయిన ఇండియాతో, మాతృరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో తమ బంధాన్ని పెంచుకుంటున్నారు. అమరావతి నిర్మాణానికి, అమరావతి రైతుల సమస్యలకి, ఎలెక్షన్లు అన్నిట్లోనూ పాలుపంచుకుంటున్నారు. వారిని గుర్తించి, ఈరోజు గ్లోబల్ ఎన్నారై టీడిపి కమిటీ సభ్యులుగా ఉన్నవారు పదిహేను ఏళ్ళుగా పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారు. డా. గురురాజాను ప్రెసిడెంట్గా నియమించటం, వారి సేవలను పార్టీ- ప్రభుత్వ సేవలకు అనుసంధానం చేయడం గొప్ప స్ఫూర్తి దాయకమైన విషయం. మీ రాష్ట్రానికి మీరు మీ ప్రాతంలో ఉన్న ఎన్నారైలనందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతటితో మీ భాధ్యత అయిపోలేదు. ఈ రాష్ట్రానికి, రాష్ట్రాభివృద్ధి కి మీ విజ్ఞానం, మీ అనుభవం, మీ నైపుణ్యం, మీ సామర్ధ్యం కావాలి అని ఆయన తన ప్రసంగంలో ఎన్నారైలను ఉత్తేజ పరిచారు.










