టీటీఏ కన్వెన్షన్లో అలరించిన రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా.. ఆసక్తికర కామెంట్స్
చార్లెట్లో జరుగుతున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మెగా కన్వెన్షన్ 2026లో ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా అభిమానులతో ముచ్చటించారు. తమదైన శైలిలో సమాధానాలు చెబుతూ, సినిమా మేకింగ్ , తమ కెరీర్ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
గురువు-శిష్యుడు అనే చర్చపై…
సందీప్ రెడ్డి వంగా తన శిష్యుడని ఎవరైనా అనుకుంటే, అది పొరపాటని వర్మ స్పష్టం చేశారు. సందీప్ తన శిష్యుడు కాదని, నిజానికి సందీప్ సినిమాలను చూసి తాను నేర్చుకుంటున్నానని వర్మ పేర్కొన్నారు. వర్మ సినిమాలలోని ఎడిటింగ్, ప్రజంటేషన్ , సినిమాటిక్ భాషను తాను నిరంతరం అధ్యయనం చేస్తానని సందీప్ అంగీకరించారు.
‘శివ’ రీమేక్ సాధ్యమేనా?
ఒకవేళ వర్మ తన ఐకానిక్ సినిమా ‘శివ’ను రీమేక్ చేస్తే ఎవరిని నటిస్తారని ఒక అభిమాని అడగగా, ఆ పాత్రకు నాగార్జున తప్ప మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమని వర్మ సమాధానమిచ్చారు.
కలిసి పని చేస్తారా?
ఒకవేళ ఇద్దరూ కలిసి ఒక కథపై పనిచేస్తే ఎలా ఉంటుందని అడగగా, వర్మ తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు. తమద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయని, కలిసి పనిచేస్తే ఖచ్చితంగా గొడవ పడతామని, చివరకు ఎవరో ఒకరు పూర్తిగా కంట్రోల్ తీసుకుంటారని సరదాగా చెప్పారు.
తమ సినిమాలపై ప్రేక్షకులకున్న ప్రేమను చూసి దర్శకులు ఆనందం వ్యక్తం చేశారు. కన్వెన్షన్ ప్రాంగణంలో ఈ ఇద్దరు దర్శకుల కాంబినేషన్ అభిమానులకు ఒక గొప్ప అనుభూతిని అందించింది.








