జనసేనానికి చంద్రబాబు ఫోన్ కాల్..!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) ఆయనకు ప్రత్యేకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు అందజేశారు. పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో ముందంజలో ఉండాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు తన సందేశాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళలో ఆయుర్వేద వైద్య చికిత్స చేయించుకుంటున్నారు.
గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ కల్యాణ్‌కు ఇటీవల ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స (Surgery) జరిగింది. గత ఎన్నికల ప్రచార సమయం నుండి ఎడతెరిపి లేకుండా పర్యటనలు చేయడం వల్ల ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. సర్జరీ అనంతరం వైద్యుల సూచనల మేరకు ఆయన కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు. ముంబైలో శస్త్రచికిత్స పూర్తి చేసుకున్న తర్వాత, పవన్ కల్యాణ్ తన తదుపరి కోలుకునే ప్రక్రియ మరియు ఫిట్నెస్ కోసం కేరళ ఆయుర్వేద చికిత్సను ఎంచుకున్నారు.
పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా కేరళ నుంచే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ కాల్‌ను స్వీకరించి, ధన్యవాదాలు తెలిపారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు, అభిమానులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలతో జరుపుకుంటున్నారు. అటు మంత్రి నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. దేవుడు ఇచ్చిన అన్నయ్య అంటూ తన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోను ఆయన షేర్ చేసారు.








