క్రికెట్ చరిత్రలో 51 ఏళ్ళ క్రికెటర్ అపూర్వ రికార్డు..!
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేనని నిరూపిస్తూ, 51 ఏళ్ల 171 రోజుల వయసులో ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ (Isle of Man) మహిళల క్రికెట్ జట్టు ఆటగాడు జోవాన్ హిక్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. గ్రీస్‌తో జరిగిన మహిళల టీ20 అంతర్జాతీయ (WT20I) మ్యాచ్‌లో ఆమె అద్భుతమైన బౌలింగ్‌తో ఐదు వికెట్ల ప్రదర్శన (Five-wicket haul) నమోదు చేసి, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన అత్యంత వయస్కురాలైన క్రికెటర్‌గా నిలిచారు.
అంతేకాకుండా, యాభై ఏళ్ల వయసు దాటిన తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో ఐదు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా జోవాన్ హిక్స్ రికార్డులకెక్కారు. ఈ క్రమంలో జోవాన్ హిక్స్ క్రికెట్ ప్రపంచంలో ఉన్న 94 ఏళ్ల నాటి ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టారు. అంతకుముందు 1932లో ఆస్ట్రేలియాకు చెందిన పురుషుల క్రికెటర్ బెర్ట్ ఐరన్మంగర్ తన 49 ఏళ్ల 314 రోజుల వయసులో సౌతాఫ్రికాపై టెస్ట్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి అత్యంత వయస్కుడైన బౌలర్‌గా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును జోవాన్ హిక్స్ అధిగమించారు.
ఈ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ తన 47వ వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడం విశేషం. ఇప్పటివరకు ఆమె ఆడిన 29 టీ20 మ్యాచ్‌లలో 4.12 అత్యుత్తమ ఎకానమీ రేటుతో మొత్తం 36 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో జోవాన్ హిక్స్ కేవలం 4 ఓవర్లు బౌలింగ్ చేసి, కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. ఆమె ధాటికి గ్రీస్ జట్టు కేవలం 15 ఓవర్లలో 52 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు కేవలం 6 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయం సాధించింది. గతంలో ఆమె 49 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సాధించిన రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలే మహిళల క్రికెట్లో రికార్డుగా ఉండగా, ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వయస్కురాలైన బౌలర్‌గా జోవాన్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.








