శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మానకు షాక్..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై(Dharmana prasad) శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇళ్ల కేటాయింపులు జరిపారనే ఆరోపణలపై గృహనిర్మాణ శాఖ డీఈఈ వి.వి.సత్యాజీ శ్రీకాకుళం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ కరణం సురేష్ మాజీ మంత్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గతంలో ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన హుధూద్ తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లా గార మండల పరిధిలోని కుందువానిపేట గ్రామంలో ఇళ్లు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా పక్కా ఇళ్లను మంజూరు చేసింది. ఆ క్రమంలో సుమారు 250 మంది అర్హులైన లబ్ధిదారులకు అప్పటి టిడిపి ప్రభుత్వం ఇళ్లను పంపిణీ చేసింది. అయితే, లబ్ధిదారులు అందుబాటులో లేకపోవడం వల్ల మిగిలిపోయిన కొన్ని ఇళ్లకు సంబంధించిన పట్టాలను అధికారుల వద్దే భద్రపరిచారు.
ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జోక్యంతో నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టారనే అభియోగాలు వెలుగులోకి వచ్చాయి. గృహనిర్మాణ శాఖ అధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారులు కాని ఇతరులతో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు బలవంతంగా గృహ ప్రవేశాలు చేయించారని అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు రూప దివ్యతో కలిసి ధర్మాన ప్రసాదరావు గ్రామాన్ని సందర్శించి ఈ అక్రమ కేటాయింపులకు పాల్పడినట్లు తేలింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమ గృహ ప్రవేశాలపై అంతర్గత విచారణ జరిపిన గృహనిర్మాణ శాఖ అధికారులు పక్కా ఆధారాలతో పోలీసులను ఆశ్రయించారు. ఈ భారీ ఇళ్ల కేటాయింపుల వివాదంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు రూప దివ్య, అలాగే అక్రమంగా ఇళ్లలోకి ప్రవేశించిన మరో ఆరుగురు మత్స్యకారులపై కలిపి మొత్తం ఎనిమిది మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.








