సత్య నాదెళ్లకు ₹923 కోట్లు.. ఇందులో అసలు జీతం ఎంతో తెలుసా?
–సూర్య ప్రకాష్ జోశ్యుల
ఏడాదికి ₹923 కోట్లు సంపాదిస్తే ఎలా ఉంటుంది?
మనలో చాలామందికి ఆ అంకె వినగానే వినగానే ముందుగా “ఎన్ని తరాలు కూర్చొని తిన్నా అవ్వనంత డబ్బు కదా!” అనిపిస్తుంది. కానీ ఇది ఓ వ్యక్తి సంవత్సర ఆదాయం అని తెలిస్తే ..ఆశ్చర్యం వేస్తుందీ. అదీ ఈ డబ్బు సంపాదిస్తున్న వ్యక్తి మన తెలుగువాడు..హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవాడు అని తెలిస్తే..అమ్మో అనిపిస్తుంది.ఆయన మరెవరో కాదు… సత్య నాదెళ్ల. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్‌కు సీఈఓ. మన భాషలో చెప్పాలంటే… మైక్రోసాఫ్ట్‌కు బాస్.
ఇప్పుడు ఆయనకు ఏడాదికి ఎంత ప్యాకేజీనో తెలుసా?
సుమారు ₹923 కోట్లు. అంతకుముందు ఏడాది అది సుమారు ₹756 కోట్లు. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు ₹167 కోట్లు పెరిగింది. శాతాల్లో చూస్తే 22 శాతం పెంపు. ఇక్కడే చాలామంది ఒక్కసారి ఆగిపోతారు. “అబ్బా… సీఈఓ జీతం అంటే ఇంత ఉంటుందా?” అని.
అయితే ఒక్క నిమిషం. ఇది మనం సాధారణంగా అనుకునే “జీతం” కాదు. నాదెళ్లకు వచ్చే ₹923 కోట్లలో ఆయన బేసిక్ సాలరీ కేవలం ₹24 కోట్లు మాత్రమే. మరి మిగిలిన ₹899 కోట్లు? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.
జీతం కంటే షేర్లే పెద్దది!
ఆయనకు వచ్చే మొత్తం ప్యాకేజీలో సింహభాగం… అంటే సుమారు రూ. 805 కోట్ల విలువైన మైక్రోసాఫ్ట్ షేర్లు, మరో రూ. 91 కోట్ల పైచిలుకు క్యాష్ ఇన్సెంటివ్‌ల రూపంలో ఇస్తున్నారు.
అంటే “నాదెళ్లా, ఇదిగో ₹923 కోట్లు… వెళ్లి ఖర్చు చేసుకోండి” అని మైక్రోసాఫ్ట్ చెక్కు రాసి చేతిలో పెట్టలేదు. అంత డబ్బు బ్యాంకులో పడినట్టు ఊహించుకుంటే లెక్క తప్పినట్టే. ఆ మొత్తంలో ఎక్కువ భాగం షేర్ల రూపంలో ఉంది.
అంటే మైక్రోసాఫ్ట్ బోర్డు ఆయనతో ఒక రకమైన సైలెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుందన్నమాట. “కంపెనీని లాభాల బాటలో నడిపించి షేర్ ధరను పెంచండి… మీకూ అందులో వాటా దక్కుతుంది” అనేదే ఆ లాజిక్. ఒకవేళ కంపెనీ రేపు తేడా కొడితే, ఆ షేర్ల విలువ కూడా ఆటోమేటిక్‌గా పడిపోతుంది. అంటే నాదెళ్ల సంపద నేరుగా మైక్రోసాఫ్ట్ భవిష్యత్తుతోనే ముడిపడి ఉందన్నమాట.
నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ను ఎటు తీసుకెళ్తున్నారు?
ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ అంటే కేవలం విండోస్, ఆఫీస్ మాత్రమే అనుకునేవాళ్లం. కానీ నాదెళ్ల పగ్గాలు చేపట్టాక సీన్ మొత్తం మారిపోయింది. విండోస్ కాలం పోయి, ఇప్పుడు అంతా క్లౌడ్, అజూర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యం నడుస్తోంది. 2014లో సీఈఓ అయినప్పటి నుంచి ఆయన కంపెనీ రూపురేఖలే మార్చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఒక్క క్లౌడ్ వ్యాపారమే ఏకంగా రూ. 16 లక్షల కోట్లకు చేరిందంటే మామూలు విషయం కాదు. అజూర్ అయితే ఏకంగా రూ. 7.2 లక్షల కోట్లకు పైగా సంపాదించిపెట్టింది.
అందుకే నాదెళ్ల ప్యాకేజీని అర్థం చేసుకోవాలంటే ఆయన జీతాన్ని మాత్రమే చూడటం వల్ల ఉపయోగం లేదు. అజూర్ ఎంత పెరిగింది? మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఎంత సంపాదించింది? కంపెనీ మొత్తం ఆదాయం ఎంత పెరిగింది? షేర్హోల్డర్లకు ఎంత విలువ వచ్చింది? ఇవే అసలు లెక్కలు.
2025 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ వ్యాపారం సుమారు 23 శాతం పెరిగి $169 బిలియన్లకు, అంటే దాదాపు ₹16 లక్షల కోట్లకు చేరింది. అజూర్ సంగతి మరింత ఆసక్తికరం. అది 34 శాతం పెరిగి $75 బిలియన్లకు పైగా, అంటే సుమారు ₹7.2 లక్షల కోట్లకు చేరింది. అంటే నాదెళ్లకు ప్యాకేజీ పెరిగింది… అదే సమయంలో మైక్రోసాఫ్ట్‌లోని కొన్ని కీలక వ్యాపారాలు కూడా బలంగా పెరిగాయి.
మైక్రోసాఫ్ట్ ఇప్పుడు తన భవిష్యత్తునంతా ఏఐ మీద పెడుతోంది. ఆ భారీ బాధ్యతను మోస్తున్నందుకు, కంపెనీని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తున్నందుకు బోర్డు ఇస్తున్న రివార్డే ఈ షేర్లు, ప్యాకేజీలు.
మొత్తానికి చూస్తే…
“ఒక వ్యక్తి విలువ ఇంతా?”
కార్పొరేట్ ప్రపంచం దానికి మరో సమాధానం ఇస్తుంది.
“ఆయన తీసుకెళ్లే డబ్బు చూడకండి. ఆయన కంపెనీకి సృష్టించే విలువ చూడండి” అంటుంది.
కాబట్టే ఈ కథనం సత్య నాదెళ్ల జీతం గురించి కాదు… మైక్రోసాఫ్ట్ అనే టెక్ దిగ్గజం భవిష్యత్తును ఆయన ఎలా నడిపిస్తున్నాడు అనేదాని గురించే! భవిష్యత్తులో ఏఐ మైక్రోసాఫ్ట్‌కు ఎంత కాసుల వర్షం కురిపిస్తుందనే దాని బట్టే ఈ లెక్కలన్నీ మారుతుంటాయి. మరి ఈ రేంజ్ గేమ్‌లో నాదెళ్ల నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి!








