మేడిగడ్డతో తుమ్మిడిహెట్టికి క్లియరెన్స్? తెలంగాణ ఎత్తుగడ!
గోదావరి నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాలపై పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్రల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రంగంలోకి దిగింది. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలో సీడబ్ల్యూసీ ఛైర్మన్ అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కీలక సమావేశం జరగనుంది. ముఖ్యంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు, ముంపు విస్తీర్ణం, సాంకేతిక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించి ఒక స్పష్టత తీసుకురావాలని భావిస్తున్నారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాన్ని ప్రధాన అస్త్రంగా ముందుకు తీసుకురావాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ నిర్ణయించింది. 2023 నుంచి మేడిగడ్డ పియర్ల కుంగుబాటు, ఇతర నిర్మాణ లోపాల కారణంగా గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులను సీడబ్ల్యూసీకి సమర్పించే నివేదికలో తెలంగాణ స్పష్టం చేయనుంది.
గత ప్రభుత్వ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా భారీ విద్యుత్ ఖర్చుతో నీటిని ఎత్తిపోయాల్సి వచ్చిందని తెలంగాణ అధికారులు ప్రస్తావించనున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా, తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా సులభంగా నీటిని మళ్లించవచ్చని, అదనపు ఆర్థిక భారం లేకుండా నీటిని సద్వినియోగం చేసుకోవచ్చని వివరిస్తూ ఒక సమగ్ర నివేదికను సీడబ్ల్యూసీ ముందు ఉంచనున్నారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సీడబ్ల్యూసీ స్వంత అధ్యయనాలు, అలాగే పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సమర్పించిన తాజా నివేదికలను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించనుంది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం ఆవశ్యకతను అటు కేంద్ర జల సంఘానికి, ఇటు మహారాష్ట్ర సర్కారుకు ఈ నివేదికల ద్వారా అర్థమయ్యేలా వివరించాలని భావిస్తున్నారు.
తుమ్మిడిహెట్టి వివాదంలో ప్రధాన అంశం బ్యారేజీ ఎత్తు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో మే 2012లో అప్పటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, పృథ్వీరాజ్ చవాన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా నిర్ణయించారు. అయితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంలో ఈ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించింది. ఆ తర్వాత ప్రాజెక్టు ప్రాధాన్యత మారిపోయి ప్రాణహిత ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టారు.
తాజా భేటీలో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించడంలోని ప్రయోజనాలను, ప్రాముఖ్యతను తెలంగాణ అధికారులు వివరించనున్నారు. బ్యారేజీ ఎత్తు, మహారాష్ట్ర భూభాగంలో ముంపు ప్రభావాన్ని తగ్గించడం, అదే సమయంలో రెండు రాష్ట్రాలకు సమర్థవంతమైన నీటి వినియోగం కల్పించడంపై సీడబ్ల్యూసీ మధ్యవర్తిత్వంలో లోతైన సమీక్ష జరగనుంది. సెప్టెంబర్ 1న జరిగే ఈ భేటీ ద్వారా ఏళ్ల తరబడి నలుగుతున్న తుమ్మిడిహెట్టి జల వివాదానికి ముగింపు లభిస్తుందో లేదో వేచి చూడాలి.








