ఎకరం రూ.269 కోట్లు.. హైదరాబాద్‌లో ఆల్‌టైమ్ రికార్డు.!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐటీ కారిడార్ కేంద్రమైన రాయదుర్గం ప్రాంతం భూముల విలువల పరంగా సరికొత్త చరిత్రను క్రియేట్ చేసింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (TGIIC) నిర్వహించిన తాజా భూముల వేలంలో ఎన్నడూ లేనివిధంగా ఎకరం భూమి రికార్డు స్థాయిలో రూ.269 కోట్ల ధర పలికింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవడం హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌కు, ఇక్కడి స్థిరాస్తి రంగంపై పెట్టుబడిదారులకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది.
శుక్రవారం నిర్వహించిన ప్లాట్ P2 వేలం ప్రక్రియ రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. స్థానిక, జాతీయ స్థాయి దిగ్గజ డెవలపర్లు ఈ వేలంలో పోటాపోటీగా పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘బ్రిగేడ్’ చివరి నిమిషం వరకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, చివరకు హైదరాబాద్‌కు చెందిన ‘వంశీరామ్ బిల్డర్స్’ ఎకరానికి రూ.269 కోట్ల అత్యధిక బిడ్ దాఖలు చేసి భూమిని దక్కించుకుంది. మొత్తం 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్లాట్ విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.1,447.22 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఈ బిడ్ విలువ ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వ్ ధర కంటే 52.3 శాతం అధికం కావడం గమనార్హం.
ఈ ప్రాంతంలో భూముల ధరలు అంతకంతకూ దూసుకుపోతున్నాయి. సరిగ్గా వారం క్రితం నిర్వహించిన ప్లాట్ P1 వేలంలో ఎకరం రూ.264 కోట్ల ధర పలికి సంచలనం సృష్టించింది. ఆ వేలంలో 5.25 ఎకరాల విక్రయం ద్వారా సర్కారుకు రూ.1,386 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో నిబంధనల ప్రకారం 25 శాతం తొలిదశ చెల్లింపును సదరు సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి జమ చేసింది. అయితే, ఆ రికార్డు వారం రోజులైనా నిలబడకుండానే ప్లాట్ P2 వేలంలో ఎకరాకు మరో రూ.5 కోట్లు అదనంగా పెరిగి రూ.269 కోట్లకు చేరడం మార్కెట్ జోరును తెలియజేస్తోంది.
రాయదుర్గం భూములు ప్రభుత్వానికి అసలైన బంగారు గనులుగా మారాయి. గత రెండు దశాబ్దాల వేలం గణాంకాలను పరిశీలిస్తే భూముల విలువల్లో అనూహ్య వృద్ధి కనిపిస్తుంది. 2007 నుంచి 2013 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 102.49 ఎకరాల భూములను వేలం వేయగా ప్రభుత్వానికి సమకూరిన మొత్తం ఆదాయం రూ.2,143.69 కోట్లు. అయితే 2014 నుంచి 2024 వరకు దశాబ్ద కాలంలో 31.88 ఎకరాల భూముల విక్రయం ద్వారా రూ.730.66 కోట్ల రాబడి వచ్చింది. 2025, 2026లలో రియల్ ఎస్టేట్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం ఈ రెండేళ్లలోనే టీజీఐఐసీ రాయదుర్గంలో 41.74 ఎకరాల భూములను వేలం వేయగా, ఏకంగా రూ.8,457.47 కోట్ల అసాధారణ రాబడి లభించింది. గతంలో వందలాది ఎకరాలు వేలం వేస్తే వచ్చిన రాబడి కంటే, ప్రస్తుతం కేవలం 41.74 ఎకరాల ద్వారా దాదాపు రూ.8.5 వేల కోట్లకు పైగా ఖజానాకు చేరడం మార్కెట్ వృద్ధికి అద్దం పడుతోంది.
రాయదుర్గం ప్రాంతంపై పెట్టుబడిదారుల్లో ఉన్న అపారమైన నమ్మకానికి, నగరంలో మౌలిక వసతుల విస్తరణే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరుసగా రెండు వేలం పాటల్లోనూ చారిత్రక స్థాయిలో భూముల ధరలు పలకడం హైదరాబాద్ మార్కెట్ స్థిరత్వాన్ని, వాణిజ్య విస్తరణ సామర్థ్యాన్ని చాటుతోందని విశ్లేషిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల రాక, ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో హైదరాబాద్ రియల్టీ మార్కెట్ అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా దూసుకుపోతోంది.








