ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్… క్రెడాయ్ ప్రాపర్టీ షోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
అంతర్జాతీయ నగరాల సరసన నిలుస్తున్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకం, పారదర్శకత చాలా ముఖ్యమని, క్రెడాయ్ సభ్యులు వీటికి కట్టుబడి పని చేయాలన్నారు. మెట్రోవిస్తరణ, ప్రాంతీయ రింగ్ రోడ్డు, మూసీ తీర అభివృద్ధి వంటి అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మెరుగైన మౌలిక వసతులు, అనుకూల వాతావరణంతో హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతోందన్నారు.
భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలోనే అత్యుత్తమ ఆకాశ హర్మ్యాలు ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటన్నారు. ముంబై తర్వాత ఆ స్థాయి పోటీని ఇస్తున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమేనని పేర్కొన్నారు. 2013 తర్వాత నగరంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గొప్ప దార్శనికతతో హైదరాబాద్‌ను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుతో నగర రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయన్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నిజంగానే అంతర్జాతీయ స్థాయి నగరంగా మారుతుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో సహజంగా వచ్చే హెచ్చుతగ్గులు తాత్కాలికమేనని, నగరంలో జరుగుతున్న భారీ మౌలిక వసతుల కల్పన కారణంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుందన్నారు.
క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్.జైదీప్‌రెడ్డి మాట్లాడుతూ…ప్రస్తుతం ఉన్న మార్టిగేజ్ నిబంధనను 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరారు. తద్వారా బిల్డర్లకు క్యాష్ ఫ్లో మెరుగవుతుందన్నారు. ప్రభుత్వానికి కూడా రెవెన్యూ సమకూరుతుందని తెలిపారు. నాలా పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయాలన్నారు. హైదరాబాద్‌లో క్రెడాయ్ ఏర్పాటు చేసిన 19వ ప్రాపర్టీ షోలో స్థానికంగా ఉన్న 200లకుపైగా ప్రాజెక్టులను ఇందులో ప్రదర్శించారని చెప్పారు.
ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ రూపొందించిన ‘హైదరాబాద్ హౌజింగ్ రిపోర్ట్ హెచ1-2026’ నివేదికను సంజయ్ జాజు ఆవిష్కరించారు. క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జి.రాంరెడ్డి, జాయింట్ సెక్రెటరీ రామచంద్రారెడ్డి, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు కె.ఇంద్రాసేనారెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ బి.జగన్నాథ రావు, ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్ రెడ్డి, కోశాధికారి నితీశ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనాథ్, సంయుక్త కార్యదర్శి సంజయ్‌కుమార్, క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో కన్వీనర్ జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ డిమాండ్‌లో ఎలాంటి తగ్గుదల లేదని క్రెడాయ్ హైదరాబాద్ పేర్కొంది. ‘రేట్ ఆగదు.. డిమాండ్ తగ్గదు’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో–2026 శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది. ఆగస్టు 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షోలో 60కి పైగా డెవలపర్లు పాల్గొంటుండగా, 300కు పైగా రేరా అనుమతులు పొందిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, భువనగిరి ఎమ్మెల్యే కె. అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, ఇతర భాగస్వాములు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రూ.52,900 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై క్రెడాయ్ హైదరాబాద్, రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ CRE Matrix సంయుక్తంగా రూపొందించిన నివేదికను ఈ సందర్భంగా విడుదల చేశారు. నగరంలో ఇళ్ల సరఫరా, విక్రయ వేగం, ఇళ్ల పరిమాణాలు, వివిధ ప్రాంతాల్లో మార్కెట్ పరిస్థితులను ఈ నివేదిక విశ్లేషించింది. క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎన్. జైదీప్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం–రియల్ ఎస్టేట్ పరిశ్రమ మధ్య గత ఏడాది కాలంగా కొనసాగుతున్న సానుకూల చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని అన్నారు. నిర్మాణ అనుమతుల్లో ఉన్న 10 శాతం బిల్డింగ్ పర్మిట్ మార్ట్ గేజ్‌ను తొలగించాలని లేదా కనీసం 5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనివల్ల డెవలపర్లకు నిలిచిపోయిన మూలధనం విడుదలై ప్రాజెక్టులపై పెట్టుబడులు పెంచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నాలా సంబంధిత అంశాలను కూడా బిల్డింగ్ అనుమతుల ప్రక్రియలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ అభివృద్ధి నిరంతర వృద్ధి పథంలో కొనసాగుతోందని, ‘రేట్ ఆగదు.. డిమాండ్ తగ్గదు’ అనే థీమ్ నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పారు.








