ఓట్ల కోసం AI తయారు చేసిన నకిలీ మనుషులు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
“ఆ రాత్రి జరిగినది సాధారణ రాజకీయ సమావేశం కాదు. అక్కడ తీసుకున్న ఒక నిర్ణయం.. కొన్ని నెలల తర్వాత దేశ రాజకీయాలను మార్చబోతోందని అప్పటికి ఎవరికీ తెలియదు.”
ఆ కొన్ని నెలల తర్వాత..
ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఫోన్ ఓపెన్ చేస్తే అవే స్పీచులు, వాద్గానాలు…విమర్శలు. అయితే అందరి మధ్యా ఓ వ్యక్తి మాత్రం చాలా విలక్షణంగా మాట్లాడుతున్నాడు. “మీ సమస్య ఎవరికైనా పట్టిందా?” అని మన మనస్సులో ఆవేదననే ప్రశ్నిస్తున్నాడు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. సామాన్య ప్రజల కష్టాల గురించి చెబుతున్నాడు. అతడి మాటల్లో ఆవేశం ఉంది. బాధ ఉంది. నిజాయితీ కనిపిస్తోంది.
ఆ వీడియో కింద వేలాది లైకులు. వందల కామెంట్లు.
“మనలాంటి వాళ్ల మాటే మాట్లాడుతున్నాడు.”,. “ఈసారి మార్పు రావాలి.”. “ఇతను చెప్పేది నిజమే.” అతడు రోజూ వీడియోల్లో కనిపిస్తూనే ఉంటాడు. ఒక్కో రోజు ఒక్కో అంశంపై మాట్లాడతున్నాడు. ఒకరోజు ఉద్యోగాల గురించి.. మరో రోజు ధరల గురించి.. ఇంకో రోజు ఎన్నికల గురించి.
కొద్దిరోజులకు అతడిని చూసే వారికి ఒక భావన వస్తుంది.
“ఈ మనిషి మనవాడే.”
కానీ ఇక్కడే కథలో ట్విస్ట్.
అతడు మనిషే కాదు.
అతడికి ఇల్లు లేదు. గతం లేదు. కుటుంబం లేదు. అసలు జన్మించిందే లేదు. మరెవరు అతను ..?
ఏఐతో తయారు చేసిన ఒక నకిలీ వ్యక్తి.
ఇదేదో సినిమా కథ అనుకుంటున్నారా? కాదు.ఇక ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా జరిగే తంతు ఇదే.ప్రస్తుతం బ్రెజిల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు ఇలాంటి కొత్త రాజకీయ ప్రయోగానికి వేదికగా మారుతున్నాయి. రాజకీయ ప్రచారకర్తలు ఏఐ సాయంతో మనుషుల్లా కనిపించే, మాట్లాడే, ప్రవర్తించే వర్చువల్ వ్యక్తిత్వాలను సృష్టించి, వాటిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉపయోగించే దిశగా వెళ్తున్నారు.
డీప్ ఫేక్ కాదు
ఇప్పటివరకు మనం వింటూ ,చూస్తూ వస్తున్న డీప్ఫేక్లకూ దీనికీ చాలా తేడా ఉంది. డీప్‌ఫేక్‌లో ఒక నిజమైన వ్యక్తి ఉంటాడు. వేరే వాళ్ల ముఖమో, గొంతో మార్చేస్తారు. కానీ ఇక్కడ గేమ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లింది. మొదట్నుంచీ ఒక నకిలీ మనిషినే తయారు చేస్తున్నారు. అతడికి పేరుంది, ముఖం ఉంది, గొంతు ఉంది, సొంతంగా అభిప్రాయాలున్నాయి, సోషల్ మీడియా ఖాతాలున్నాయి, లక్షల్లో ఫాలోవర్లు కూడా ఉన్నారు!
అంటే.. నిజమైన మనిషిని నకిలీగా మార్చడం కాదు.. ఒక నకిలీ మనిషిని మనకు అత్యంత ఇష్టమైన నిజమైన ఇన్ఫ్లుయెన్సర్గా మార్చేస్తున్నారు. ఇదే అసలైన ప్రమాదం!
ఆ నకిలీ వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఏమాత్రం మోసం చేయాల్సిన పనిలేదు; “నేను నిజమైనవాడినే” అని నిరూపించుకోవాల్సిన అవసరమూ లేదు. కేవలం మీ సమస్యల గురించి మాట్లాడితే చాలు, మీకెలాంటి అభిప్రాయాలున్నాయో వాటినే పదేపదే బలపరిస్తే చాలు.. మీరు వాడిని ఇష్టపడిపోతారు.
మొదట వాడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తర్వాత మీకు నచ్చిన వ్యక్తి. ఆ తర్వాత మీరు గుడ్డిగా నమ్మే వ్యక్తి. చివరికి.. మీ ఓటు ఎవరికి పడాలో డిసైడ్ చేసే శక్తి!
బ్రెజిల్లో సోషల్ మీడియా వాడకం విపరీతంగా ఉండటం, ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ బలంగా ఉండటంతో అక్కడి ఎన్నికలు ఈ ఏఐ ప్రయోగాలకు పెద్ద అడ్డాగా మారాయి.
ఏం కలిసి వస్తుంది ఈ నకిలి నాయకుడుతో
ఒక నిజమైన రాజకీయ నాయకుడికి కొన్ని పరిమితులు ఉంటాయి. రోజుకు ఒకటి రెండు సభలకు మించి తిరగలేడు. కానీ ఈ ఏఐ మనిషికి ఆ అలసట ఉండదు. నిద్రపోడు, సెలవు అడగడు, జీతం కోరదు! ఒకే సమయంలో వందల కొద్దీ అకౌంట్లలో ప్రత్యక్షమవుతాడు. ఒక వర్గానికి ఉద్యోగాల గురించి చెప్తే, ఇంకో వర్గానికి ధరల గురించి చెబుతాడు. ఇంకోచోట ప్రభుత్వంపై కోపం రగిలిస్తాడు. ఒకే ఒక్క ఏఐ.. వందల ముఖాలు, వేల సందేశాలు, లక్షల మంది ఓటర్లను ఇట్టే ప్రభావితం చేస్తుంది.
కోడింగ్ మీద కేసు పెట్టలేం బాస్
అయితే మొదట మనం ఆలోచించాల్సింది. ఈ నకిలీ ఇన్ఫ్లుయెన్సర్ వెనుక ఉన్న సూత్రధారి ఎవరు? వీడిని తయారు చేసింది ఎవరు? డబ్బు పెడుతున్నదెవరు? ఇవన్నీ పసిగట్టడం మన చట్టాలకు చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నికల నియమాలన్నీ నిజమైన మనుషులు, పార్టీల కోసం మాత్రమే రూపొందించబడ్డాయి. కానీ ఇప్పుడు పోరాడుతున్నది మనిషి కాదు.. ఒక కోడింగ్!
అందుకే రేపటి ఎన్నికల్లో ఓటు అడిగేది నిజమైన నాయకుడా? లేక తెరవెనుక ఏఐ తయారు చేసిన నకిలీ మనిషా? అని మనమే ప్రశ్నించుకోవాలి. ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌లో మీ ముందైతే ఏఐ కనిపించదు. కానీ, అంతకుముందు నెలల తరబడి మీ ఫోన్ స్క్రీన్‌ని శాసించి, మీ భయాలను రెచ్చగొట్టి, మీకు నచ్చిన మాటలే చెప్పి మీ ఓటును డిసైడ్ చేసింది ఆ ఏఐ ప్రచార యంత్రాంగమే అయితే?
ఫైనల్ గా…
భవిష్యత్ ఎన్నికల అసలు పోరాటం ఇక సభల్లో మాత్రమే ఉండకపోవచ్చు. బ్యాలెట్ బాక్స్ దగ్గర కాదు.. మీ ఫోన్ స్క్రీన్ దగ్గరే మొదలవుతుంది. ఎందుకంటే “స్క్రీన్‌పై కనిపిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కష్టం కాదు. అసలు కష్టం.. అతడిని నడుపుతున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవడం..”








