ఆటోవాలాలకు రేవంత్ సర్కార్ బంపరాఫర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే ‘మహాలక్ష్మి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఆటో డ్రైవర్ల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీసిందన్న ఆరోపణలు, అసంతృప్తులు ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గానే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఆటోవాలాల నుంచి ఎదురవుతున్న ఆగ్రహాన్ని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ ఒక భారీ మాస్టర్ ప్లాన్‌ను తెరపైకి తెచ్చింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆటో కార్మికులను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా రవాణా శాఖ రూ. 200 కోట్ల భారీ పథకానికి శ్రీకారం చుట్టింది.
రాజీవ్ యువ వికాసంలో భాగంగా ప్రభుత్వం తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026ను అమల్లోకి తెచ్చింది. క్యూర్ పరిధిలో పర్మిట్ కలిగి తిరుగుతున్న మొత్తం 18,766 డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం లేదా కొత్త ఈ-ఆటోలతో రీప్లేస్ చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇందులో 11,254 డీజిల్ ఆటోలు, 7,512 పెట్రోల్ ఆటోలు ఉన్నాయి.
ఈ పథకం కింద ఆటో యజమానులకు ప్రభుత్వం రెండు సువర్ణావకాశాలను కల్పిస్తోంది. పాత ఆటోల స్థానంలో ప్రభుత్వం గుర్తించిన ఎంప్యానెల్డ్ తయారీదారుల నుంచి ఫిక్స్డ్-బ్యాటరీ లేదా స్వాపబుల్-బ్యాటరీ కిట్లను అమర్చుకోవచ్చు. దీనికి అయ్యే అసలు ఖర్చు లేదా గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తుంది. లేదా పాత వాహనాన్ని లేదా ఇంజిన్‌ను స్క్రాపింగ్ కోసం అప్పగించి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేస్తే, ఆన్-రోడ్ ధరపై నేరుగా ఫ్లాట్ రూ. 1.5 లక్షల భారీ సబ్సిడీని ముందస్తుగానే సర్దుబాటు చేస్తారు.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ. 200 కోట్ల నిధులను ప్రభుత్వం సామాజిక న్యాయం ప్రాతిపదికన సమీకరిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ శాఖల నుంచి ఒక్కో శాఖ రూ. 50 కోట్ల చొప్పున నిధులను విడుదల చేయనున్నాయి. ఎలాంటి అవకతవకలు జరగకుండా, డూప్లికేట్ క్లెయిమ్‌లను అరికట్టేందుకు రవాణా శాఖ కమిషనర్ ప్రత్యేక డిజిటల్ సాఫ్ట్వేర్ మాడ్యూల్ ద్వారా పూర్తి పారదర్శకంగా పథకాన్ని అమలు చేయనున్నారు.
తెలంగాణలో లక్షలాదిగా ఉన్న ఆటో డ్రైవర్లు ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలు చేయడంతో తమ గిరాకీలు పడిపోయాయని, ఆదాయం లేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆటో యూనియన్లు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయి. దీనిని ప్రధాన అస్త్రంగా మార్చుకున్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయి రాజకీయ ఒత్తిడిని పెంచాయి.
ఈ రాజకీయ నష్టాన్ని పూడ్చుకోవడానికి రేవంత్ ప్రభుత్వం సరైన సమయంలో పావులు కదిపింది. ఒకవైపు పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను నిర్మిస్తున్నామంటూ హైటెక్ ఇమేజ్ను సొంతం చేసుకోవడం, మరోవైపు ప్రతి ఆటోకు రూ. 1.5 లక్షల భారీ ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చడం ద్వారా క్షేత్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్న డ్రైవర్ల వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడం కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. యూనియన్లతో ఇటీవలే జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చడాన్ని తెలంగాణ స్టేట్ ఆటో, యాప్ బేస్డ్ డ్రైవర్స్ జేఏసీ నేతలు స్వాగతించారు. అలాగే బలహీన వర్గాలకు ఈ సబ్సిడీని త్వరితగతిన అందించాలని విజ్ఞప్తి చేశారు.
మొత్తానికి, ‘మహాలక్ష్మి’ పథకం తెచ్చిన డ్యామేజ్‌ను సరిదిద్దడంతో పాటు, సంక్షేమ నిధుల ద్వారా బలహీన వర్గాల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు రేవంత్ సర్కార్ వేసిన ఈ ‘ఈవీ పాచిక’ రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ ఫలితాలను ఇస్తుందో చూడాలి.








