ఆసియా కప్ లో క్రికెట్ కష్టమేనా..?
జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న 2026 ఆసియా క్రీడలలో(Asia Games) క్రికెట్ నిర్వహణ ఏర్పాట్లు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ మెగా టోర్నమెంట్ కోసం జపాన్ సిద్ధం చేసిన పిచ్ నాణ్యత, డ్రెస్సింగ్ రూమ్‌లు మరియు క్రీడాకారులకు కేటాయించిన హోటల్ వసతులపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI), పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. నిస్సిన్లోని ‘కొరోగి స్పోర్ట్స్ పార్క్’ అనే కన్వర్టెడ్ బేస్‌బాల్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.
అయితే, అక్కడ ఇటీవల కొత్తగా వేసిన హైబ్రిడ్ పిచ్ నాణ్యతను ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా పరీక్షించకపోవడం మరియు డ్రెస్సింగ్ రూమ్‌లు కనీస ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) స్వయంగా వేదికను తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఈ టోర్నమెంట్లో పిచ్ కంటే పెద్ద సమస్యగా ఆటగాళ్ల హోటల్ వసతులు మారాయి. గతంలో లాగా కాకుండా ఈసారి క్రీడాకారులందరికీ ఒకే ‘అథ్లెట్స్ విలేజ్’ కాకుండా విడివిడిగా హోటల్ గదులను కేటాయించారు.
ఈ హోటళ్లు క్రికెట్ మైదానానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండటమే కాకుండా, రూమ్‌లు అత్యంత ఇరుకుగా ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. ఎంతలా అంటే.. ఆటగాళ్లు తమ భారీ కిట్బ్యాగులను గదిలో తెరిచి పెడితే, కనీసం నిలబడటానికి కూడా స్థలం లేనంత చిన్నవిగా ఆ రూమ్‌లు ఉన్నట్లు ఒక అధికారి స్వయంగా అంగీకరించారు. తమ అంతర్జాతీయ ఆటగాళ్లకు ఇలాంటి ఇరుకైన వసతులు కల్పించడంపై బీసీసీఐ నేరుగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) మరియు ఆసియా క్రీడల నిర్వాహక కమిటీకి ఫిర్యాదు చేసింది.
ఈ ఆసియా క్రీడల క్రికెట్ టోర్నీలో భారత్ పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి. మహిళల ఈవెంట్ సెప్టెంబర్ 17 నుండి 22 వరకు, పురుషుల ఈవెంట్ సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా, పురుషుల జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లు కూడా ఈ టోర్నీలో ఆడే అవకాశం ఉన్నందున, ఆటగాళ్ల భద్రత మరియు వసతుల సమస్యను త్వరగా పరిష్కరించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పట్టుబడుతున్నాయి.








