స్థానిక పోరుకు జనసేన సన్నద్ధం.. సీట్ల విషయంలో తగ్గేదేలే..
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఎలా ఉండాలన్న దానిపై చర్చలు కొనసాగుతున్న సమయంలో జనసేన (JanaSena) మాత్రం తన పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సిద్ధం చేసే పనిలో వేగం పెంచింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ బలాన్ని మరింత పెంచుకోవాలని అధినాయకత్వం భావిస్తోంది.
2024 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం జనసేనకు రాష్ట్రంలో రాజకీయంగా మరింత బలం వచ్చిందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. అందుకే స్థానిక ఎన్నికల్లో కూడా గత పరిస్థితులను కాకుండా ప్రస్తుత బలాబలాలను పరిగణనలోకి తీసుకుని సీట్ల పంపకం జరగాలని కోరుతోంది. తమకు బలం ఉన్న ప్రాంతాల్లో తగినన్ని స్థానాలు దక్కాల్సిందేనని స్పష్టమైన వైఖరితో ఉంది. కనీసం 30 శాతం సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలన్న లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం కేరళలో ప్రకృతి వైద్యం తీసుకుంటున్నప్పటికీ, అక్కడి నుంచే పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్థానిక ఎన్నికల వ్యూహంపై ఆయన నాయకులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న బలాన్ని అంచనా వేసి అభ్యర్థుల ఎంపిక చేపట్టాలని ఆయన మార్గనిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఈ నెల 28న మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న ఈ భేటీకి పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ పదవుల్లో ఉన్న నాయకులు హాజరుకానున్నారు. గతంలో ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా పోటీ చేసిన వారినీ సమావేశానికి ఆహ్వానించారు.
గత ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూనే పార్టీ తరఫున పోటీ చేసిన నాయకుల అనుభవాలను కూడా ఈసారి వ్యూహరచనలో ఉపయోగించుకోవాలని జనసేన భావిస్తోంది. స్థానికంగా ప్రజల్లో మంచి పరిచయం, గెలుపు అవకాశాలు, పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సమావేశంలో పవన్ కళ్యాణ్ సూచనలను నాయకులకు వివరించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు 14 మంది సభ్యులతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ కూడా స్థానిక ఎన్నికల విధివిధానాలపై చర్చించనుంది.
జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు సాధించడం ద్వారా పార్టీని మరింత విస్తరించుకోవచ్చని నాయకత్వం భావిస్తోంది. అదే సమయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం కొనసాగిస్తూ వైసీపీ (YSR Congress Party)కి రాజకీయంగా ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో మిత్రపక్షాల సహకారం, ఇతర ప్రాంతాల్లో జనసేన మద్దతు ఉండేలా పరస్పర సమన్వయంతో ముందుకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. దీంతో స్థానిక ఎన్నికలు కూటమి రాజకీయాల్లో కీలక పరీక్షగా మారనున్నాయి.








