కోట్లు ఖర్చు పెట్టి AI కొన్నారు.. కంపెనీకి కలిసొచ్చింది ఏమీ లేదా?
మారుతున్న ప్రపంచానికి తగినట్లుగా… మీ కంపెంనీలోనూ ఏఐ ని తీసుకురావాలని అనుకుంది యాజమాన్యం. అందుకోసం కంపెనీ ఉత్సాహంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఉద్యోగులందరికీ ఏఐ టూల్స్ ఇచ్చింది. ప్రత్యేక సాఫ్ట్వేర్లు కొనుగోలు చేసింది. ట్రైనింగ్ ఇచ్చింది. ఆఫీసులో ఎక్కడ చూసినా ఏఐ గురించే మాట. ఇక కంపెనీ లాభాల్లో దూసుకుపోవడం ఖాయం అనిపిస్తుంది.
కానీ ఒక్కసారి ఆ కంపెనీ బాస్‌ను పక్కకు తీసుకెళ్లి అడిగితే.. “సార్.. ఇంత ఖర్చు పెట్టారు కదా. దాని వల్ల మీ కంపెనీకి నిజంగా ఎంత లాభం వచ్చింది?” అని అడిగితే మాత్రం సమాధానం అంత ఈజీగా చెప్పలేడు.
ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను వేధిస్తున్న సిట్యువేషన్. ఏఐని వాడుతున్నామా లేదా? అన్నది నిన్నటి ప్రశ్న. ఏఐపై పెట్టిన డబ్బుకు తగ్గ ఫలితం వస్తోందా, ఏమన్నా రాబడి పెరిగిందా? అనేది అందరినీ ఆలోచనలో పడేస్తున్న విషయం.
ఏఐ వచ్చిన కొత్తలో మాత్రం పరిస్థితి వేరుగా ఉండేది. “ఏఐ వాడండి.. ఇంకా ఎక్కువగా వాడండి” అంటూ ఉద్యోగులను కంపెనీలు ప్రోత్సహించేవి. ఎవరు ఎక్కువ ఏఐ వాడుతున్నారు? ఎవరు ఎక్కువ టోకెన్లు ఖర్చు చేస్తున్నారు? అనే లెక్కలు కూడా పెట్టేవారు. ఏఐని ఎక్కువగా వాడితే అంత గొప్ప ఉద్యోగి అన్నట్టుగా పరిస్థితి ఉండేది. దీనికి ‘టోకెన్మ్యాక్సింగ్’ అనే పేరు కూడా వచ్చింది.
కానీ ఇప్పుడు కంపెనీలు కాస్త వెనక్కి తిరిగి చూస్తున్నాయి. “సరే.. మా ఉద్యోగులు రోజంతా ఏఐ వాడుతున్నారు. మరి దాని వల్ల కంపెనీకి ఒరిగిందేమిటి?” అని చూస్తే పెద్దగా తేడా కనపడటం లేదు.
సపోజ్..ఫర్ సపోజ్…ఒక ఉద్యోగి ఏఐని ఉపయోగించి తన పని రెండు గంటలు ముందే పూర్తి చేశాడనుకుందాం. అతను ఆ మిగిలిన రెండు గంటలు ఏం చేస్తున్నాడు. ఆ టైమ్ లో అతను మరో ముఖ్యమైన పని కంపెనీకి పనికొచ్చేది చేశాడా? పోనీ కంపెనీకి కొత్త ఆలోచన ఇచ్చాడా? కస్టమర్ సమస్యను పరిష్కరించాడా? లేక ఇంటి షాపింగ్ చేసుకుంటూ కూర్చున్నాడా? కొలీగ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసాడా…ఏమిరా బాలరాజు.ఏమిరా నీ వల్ల ఉపయోగం అని ఏఐ ని అడిగేలా చేస్తున్నాడా?
అంటే.. ఏఐ వల్ల ఉద్యోగికి సమయం ఆదా అయింది కానీ కంపెనీకి విలువ పెద్దగా రాలేదని చాలా చోట్ల తేలిపోయింది. అందుకే ఏఐని ఎన్ని గంటలు వాడారు, ఎన్ని టోకెన్లు ఖర్చు చేశారు అనే లెక్కల నుంచి కంపెనీలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏఐ వల్ల పని నిజంగా ఎంత మెరుగుపడింది? అన్నదే చూస్తున్నారు.
ఉదాహరణకు ఒక పని గతంలో ఎనిమిది గంటలు పట్టేది. ఇప్పుడు ఏఐ సాయంతో నాలుగు గంటల్లో అయిపోతోందనుకుందాం. మిగిలిన నాలుగు గంటల్లో ఉద్యోగి మరో పని కూడా పూర్తి చేస్తే.. అక్కడే ఏఐ అసలు విలువ కనిపిస్తుంది. కస్టమర్‌కు సమాధానం ఇవ్వడానికి మూడు రోజులు పట్టేది.. ఇప్పుడు ఒక రోజులోనే ఇస్తున్నారా? కొత్త ఉద్యోగికి పని నేర్పడానికి నెల రోజులు పట్టేది.. ఇప్పుడు రెండు వారాల్లో నేర్పగలుగుతున్నారా? ఇలాంటి మార్పులే కంపెనీకి నిజమైన లాభాలు.
పని వేగంగా జరిగితే సరిపోతుందా?
ఒక ఏఐ టూల్ రోజుకు వంద రిపోర్ట్ లు తయారు చేస్తోంది అనుకుందాం. గతంలో మనుషులు రోజుకు ఇరవై మాత్రమే తయారు చేసేవారు. అద్భుతమైన ఉత్పాదకత కదా! కానీ ఆ వంద నివేదికల్లో సగం తప్పులే ఉంటే? అప్పుడు ఏం లాభం?
అంటే ఏఐతో పని వేగం పెరగడం ఒక్కటే కాదు. పని నాణ్యత కూడా కావాలి. ఇది ఏఐ విషయంలో చాలా ముఖ్యమైన పాఠం. వేగంగా తప్పు చేయడం కంటే, కొంచెం ఆలస్యమైనా సరిగ్గా చేయడం కంపెనీకి ఎక్కువ విలువ ఇవ్వొచ్చు.
ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మరో అసలైన విషయం ఏమిటంటే.. ఏఐ పెట్టుబడి పెట్టిన వెంటనే లాభాలు రావాల్సిన అవసరం లేదు. కొత్త టెక్నాలజీని ఉద్యోగులు నేర్చుకోవాలి. కొత్త విధానాలకు అలవాటు పడాలి. పాత పద్ధతులను మార్చాలి. కొన్నిసార్లు ఒక విభాగంలో పని వేగం పెరిగితే, ఆ పని తర్వాత వెళ్లాల్సిన మరో విభాగం మీద ఒక్కసారిగా భారం పెరుగుతుంది.
అందుకే మొదట్లో కంపెనీ పనితీరు కాస్త పడిపోయి.. ఆ తర్వాత మళ్లీ పైకి వెళ్లొచ్చు. దీనినే ‘జే-కర్వ్’ ప్రభావం అంటారు.
ఏఐ వచ్చింది కదా స్టాఫ్ ని తీసెయచ్చు కదా
ఏఐ వల్ల ఉద్యోగుల సమయం ఆదా అవుతోంది కదా.. ఆ ఉద్యోగులను తగ్గించేస్తే కంపెనీకి మరింత డబ్బు మిగులుతుందిగా? అంటే లెక్క ప్రకారం అవును. కానీ కాదు. ఎందుకంటే ఏఐ వల్ల ఒక ఉద్యోగి పని నాలుగు గంటలకు తగ్గితే.. ఆ ఉద్యోగిని తొలగించడం ఒక్కటే మార్గం కాదు. మిగిలిన సమయాన్ని ఉపయోగించి అతనితో మరో ముఖ్యమైన పని చేయించవచ్చు. కొత్త ఉత్పత్తి మీద పనిచేయించవచ్చు. కొత్త కస్టమర్లను తీసుకురావచ్చు. సంస్థలో ఏఐ చేయలేని పనుల్లో అతని నైపుణ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
అందుకే కంపెనీలు ఇలా లెక్క వేయొచ్చు. “ఏఐ లేకపోతే వచ్చే రెండేళ్లలో మేం ఎంతమంది కొత్త ఉద్యోగులను తీసుకోవాల్సి వచ్చేది?”. ఉదాహరణకు 500 మంది అదనపు సిబ్బంది అవసరమయ్యే పని.. ఏఐ వల్ల 200 మందితోనే నిర్వహించగలిగితే, అక్కడ ఏఐకి వచ్చిన ఆర్థిక విలువను కొంతవరకు లెక్కించవచ్చు.
అయితే ఏఐ వల్ల కంపెనీ అమ్మకాలు ఎంత పెరిగాయో లెక్కించడం మాత్రం అంత సులభం కాదు. ఒక ఉత్పత్తి బాగా అమ్ముడైంది. దానికి ఏఐ కారణమా? లేక మంచి మార్కెటింగ్ వల్లనా? ధర తగ్గించడం వల్లనా? పోటీదారు బలహీనపడటం వల్లనా? ఒక్క ఏఐకే క్రెడిట్ ఇవ్వడం కష్టం.
అందుకే కంపెనీలు ఏఐ రాకముందు తమ పరిస్థితి ఎలా ఉందో, ఏఐ వచ్చిన తర్వాత ఎలా మారిందో స్పష్టంగా నమోదు చేసుకోవాలి. అప్పుడే తేడా తెలుస్తుంది.
అసలు పెద్ద సమస్య ఇంకొకటి
ఏఐ రేపు ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ పూర్తిగా తెలియదు. ఈరోజు గొప్పగా కనిపిస్తున్న టూల్ రేపటికి పాతబడిపోవచ్చు. ఈరోజు ఒక ఉద్యోగి చేస్తున్న పనిని రేపు ఏఐ పూర్తిగా చేయొచ్చు. అదే సమయంలో ఈరోజు ఏఐ చేయలేని కొత్త పనులు కూడా రేపు పుట్టొచ్చు.
కాబట్టి కంపెనీలు కేవలం “ఏఐ వల్ల ఎంత డబ్బు ఆదా అయింది?” అని మాత్రమే చూడకూడదు. “మా ఉద్యోగులు ఏఐని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకుంటున్నారా? భవిష్యత్తులో ఏఐ చేయలేని పనులకు అవసరమైన నైపుణ్యాలను మేం పెంచుకుంటున్నామా?” అని కూడా చూడాలి.
చివరికి విషయం చాలా సింపుల్.
ఏఐని వాడుతున్నామని చెప్పుకోవడం గొప్ప విషయం కాదు. ఉద్యోగులందరి కంప్యూటర్లలో ఏఐ టూల్స్ పెట్టడం కూడా గొప్ప విషయం కాదు. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత.. ఆ డబ్బుకు తగ్గ విలువ కంపెనీకి తిరిగి వస్తోందా? అన్నదే అసలైన విషయం.
కంక్లూజన్
అందుకే ఇకపై కంపెనీల్లో ఏఐ గురించి ఒక కొత్త ప్రశ్న వింటాం మనం. “మా ఉద్యోగులు ఏఐని ఎంత వాడుతున్నారు?” కాదు.. “మేం ఏఐపై పెట్టిన ప్రతి రూపాయికి తిరిగి ఎంత విలువ వస్తోంది?”అదే ఏఐ యుగంలో అసలు లెక్క.








