తెలంగాణ కాంగ్రెస్‌లో ‘ఒరిజినల్ వర్సెస్ వలస’ రచ్చ!
తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ అంతర్గత రాజకీయాలు, ఆధిపత్య పోరు మరోసారి రచ్చకెక్కుతున్నాయి. కొండా సురేఖ వ్యవహారం, తాజా పరిణామాల నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. క్రమశిక్షణ, అధిష్ఠానం నిర్ణయాల ప్రాధాన్యతను నొక్కి చెబుతూనే, పార్టీలోని వలస నేతలు వర్సెస్ అసలైన కాంగ్రెస్ వాదులు అనే అంతర్గత వైరుధ్యాన్ని ఆయన బలంగా తెరపైకి తెచ్చారు.
ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి, ప్రస్తుత రాజకీయ వివాదాలపై తనదైన శైలిలో స్పందించారు. కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత, అలాగే చిన్నారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలను పార్టీ క్రమశిక్షణా కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి పీసీసీకి నివేదిక సమర్పించిందని గుర్తుచేశారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారని, సీఎం తీసుకున్న వైఖరితో తాను పూర్తి స్థాయిలో ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ఎన్నడూ పార్టీని గానీ, ముఖ్యమంత్రిని గానీ, ఏ ఒక్క నాయకుడిని గానీ వ్యక్తిగతంగా విమర్శించలేదని, పార్టీ గీత దాటే ప్రసక్తే లేదని స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇచ్చారు.
ఈ వివాదానికి అతీతంగా, కాంగ్రెస్ అంతర్గత నిర్మాణంలో నెలకొన్న అసంతృప్తిని రాజగోపాల్ రెడ్డి బహిర్గతం చేశారు. 2018 శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ హేమాహేమీలు ఓటమి పాలైన క్లిష్ట సమయంలో, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ ఆధిపత్యాన్ని, విపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలన్న ఎత్తుగడలను ఎదుర్కొని మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో తాను గెలిచానని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన, ప్రజా సమస్యలు, అవినీతిపై అలుపెరగని పోరాటం చేశానని వివరించారు.
అయితే, ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి గెలిచిన కొందరు నేతలు.. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన అసలైన కార్యకర్తలను, సీనియర్లను విస్మరిస్తుండటంపై ఆయన పరోక్షంగా మండిపడ్డారు. పార్టీని నమ్ముకుని ఉన్న నిజమైన కాంగ్రెస్ రక్తం ఉన్న నాయకులను, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిబద్ధత గల కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వం, హైకమాండ్‌పై ఉందని గట్టిగా డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడం వల్ల సుదీర్ఘకాలం పార్టీకి సేవ చేసిన నిజమైన కాంగ్రెస్ శ్రేణులకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని తాను గతంలోనే ప్రస్తావించానని తెలిపారు.
తనపై విమర్శలు చేసే నాయకులు తమ స్థాయిని, ఉద్దేశాలను ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ అభివృద్ధి, అవినీతి రహిత పాలనతో పాటు రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా చూడటమే తన ఏకైక పరమావధి అని రాజగోపాల్ రెడ్డి పునరుద్ఘాటించారు. పార్టీని బలోపేతం చేయడానికే మాట్లాడతానని, బలహీనపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చి కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు పార్టీ శ్రేయస్సును దెబ్బతీసే కథనాలు రాయించడం లేదా వివాదాలు సృష్టించడం సరికాదని హెచ్చరించారు.
మొత్తంగా చూస్తే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత సమీకరణాలను మరోసారి వేడెక్కించాయి. హైకమాండ్, సీఎంతో ఎటువంటి విభేదాలు లేవని చెప్తూనే.. కొత్తగా పార్టీలో చేరి ఆధిపత్యం చలాయిస్తున్న నాయకులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో సాగాల్సిన కీలక సమయంలో సీనియర్లు, పాత కాంగ్రెస్ వాదుల అసంతృప్తిని హైకమాండ్ ఎలా సమన్వయం చేస్తుందో వేచి చూడాలి.








