కొండా సురేఖ ఎపిసోడ్.. రంగంలోకి ‘ట్రబుల్ షూటర్’!
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఇప్పుడు అధిష్టానం వద్దకు చేరింది. ఓవైపు సినీ, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటం, మరోవైపు ఏఐసీసీ నాయకత్వం ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొండా కుటుంబం నష్టనివారణ చర్యల్లో పడింది. ఈ క్రమంలోనే మంత్రి భర్త, సీనియర్ నేత కొండా మురళి హుటాహుటిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రహస్య సమాలోచనలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరుకావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యక్తిగత, సంచలన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీని మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కూడా ఇరుకున పెట్టాయి. అక్కినేని కుటుంబంతో పాటు యావత్ చిత్ర పరిశ్రమ ఏకతాటిపైకి వచ్చి నిరసన తెలపడం, న్యాయపోరాటానికి దిగడంతో కాంగ్రెస్ అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అయింది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఇలాంటి వ్యక్తిగత విమర్శలను ఉపేక్షించవద్దని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపినట్లు సమాచారం. పరిస్థితి విషమించి మంత్రి పదవికే ముప్పు వాటిల్లే పరిస్థితులు కనిపించడంతో, కొండా మురళి స్వయంగా రంగంలోకి దిగి రాయబారాలు ప్రారంభించారు.
వివాదం ముదురుతున్న తరుణంలో ఈ సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యతను కాంగ్రెస్ హైకమాండ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించినట్లు సమాచారం. వివాదరహితుడిగా, సంయమనంతో వ్యవహరించే నేతగా పేరున్న భట్టి వద్దకు కొండా మురళి వెళ్లి దాదాపు గంటకు పైగా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే, ఈ భేటీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యక్షమవ్వడం కాంగ్రెస్ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. అయితే తాను నియోజకవర్గ పనిమీదే ప్రజాభావన్ కు వచ్చినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు.
భట్టి విక్రమార్కతో జరిగిన భేటీలో కొండా మురళి తమ వైఖరిని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వేధిస్తున్న నేపథ్యంలోనే తీవ్ర ఆవేదనతో, ఆవేశంలో సురేఖ ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని, సినీ పరిశ్రమను గానీ, మహిళలను గానీ కించపరచడం తమ ఉద్దేశం కాదని మురళి వివరించినట్లు సమాచారం. ఇప్పటికే క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, పార్టీ పరంగా ఇకపై వివాదం పెద్దది కాకుండా చూడాలని, ఢిల్లీ పెద్దలకు వాస్తవ పరిస్థితులను వివరించి పరిస్థితిని చక్కదిద్దాలని భట్టిని కోరినట్లు సమాచారం.
కొండా సురేఖ ఎపిసోడ్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో, భట్టి విక్రమార్క రాయబారంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు కోర్టు కేసులు, మరోవైపు విపక్షాల దాడి నేపథ్యంలో పార్టీ కేవలం హెచ్చరికతో సరిపెడుతుందా లేక క్రమశిక్షణా చర్యల దిశగా అడుగులు వేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. అయితే కొండా మురళి సాగిస్తున్న ఈ రాయబారాలు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయి, భట్టి విక్రమార్క ‘ట్రబుల్ షూటర్’ పాత్ర కొండా ఫ్యామిలీని ఈ సంక్షోభం నుంచి గట్టెక్కిస్తుందా అన్నది వేచి చూడాలి.








