న్యూజెర్సీలో భారత్-అమెరికా జెండాల ప్రదర్శన…గిన్నిస్ వరల్డ్ రికార్డు!
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ మరియు జోహో కార్పొరేషన్ భాగస్వామ్యంతో విభాగంలో కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది. ఆగస్టు 15 శనివారం సాయంత్రం న్యూజెర్సీలోని పార్సిపనీ వెటరన్స్ మెమోరియల్ పార్క్‌లో ఈ చారిత్రాత్మక వేడుక ఘనంగా జరిగింది. ఈ రికార్డు కోసం 1,383 అమెరికన్ జెండాలను జెండాస్తంభాలపై ఏర్పాటు చేసి “250” అనే భారీ సంఖ్యగా అమర్చారు. దీని చుట్టూ భారత త్రివర్ణ పతాకాలను అలంకరించారు. భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం మరియు అమెరికా 250వ వార్షికోత్సవంసందర్భంగా ఈ ప్రత్యేక ప్రదర్శనను రూపొందించారు. పరిశీలన అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు ఈ ఘనతకు సంబంధించిన అధికారిక పత్రాన్ని నిర్వాహకులకు అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రసంగించారు. ఎఫ్ ఐఎ చైర్మన్ అంకుర్ వైద్య మాట్లాడుతూ, ఈ గిన్నిస్ రికార్డు సాధించడం మన సమాజపు అంకితభావానికి, మన సంస్కృతి పట్ల ఉన్న గర్వానికి ప్రతీక. మనమందరం ఒకే లక్ష్యంతో కలిస్తే ఎంతటి గొప్ప ఫలితాన్ని సాధించవచ్చో ఇది నిరూపించిందన్నారు. న్యూయార్క్ భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ, ఈ ఘనత భారత్-అమెరికాల మధ్య ఉన్న బలమైన స్నేహబంధానికి, ఇరు దేశాల ప్రజాస్వామ్యాలను అనుసంధానించే భారతీయ-అమెరికన్ల ప్రాముఖ్యతకు నిదర్శనం అని చెప్పారు. పార్సిపనీ మేయర్ పుల్కిత్ దేశాయ్ మాట్లాడుతూ, భారత్, అమెరికాలు రెండూ తమ సొంత భవిష్యత్తును తామే నిర్మించుకోవాలనే ఒకే రకమైన ప్రాథమిక సూత్రాన్ని నమ్ముతాయి అని పేర్కొన్నారు. న్యూజెర్సీ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ డేల్ జి. కాల్డ్వెల్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం వెనుక ఉన్న వాలంటీర్ల కృషిని అభినందిస్తూ, సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో స్వచ్ఛంద సేవను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఎఫ్ ఐ ఎ ప్రెసిడెంట్ శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, ఈ రికార్డు వెనుక రాత్రింబవళ్లు కష్టపడిన ప్రతి వాలంటీర్, భాగస్వామి మరియు మద్దతుదారులది ఈ విజయం. ఇది మన సమైక్యతకు, దేశభక్తికి చిహ్నం అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జోహో కార్పొరేషన్ యుఎసఏ హెడ్ రాజు వేగెస్నా, యుఎస్ కాంగ్రెస్ ఉమెన్ అనలిలియా మెజియా మరియు ఎఫ్ ఐఎ మాజీ ప్రెసిడెంట్ సౌరిన్ పటేల్ పాల్గొని ప్రసంగించారు. సాంకేతిక, ప్రజా సేవ మరియు వ్యాపార రంగాలలో భారతీయ-అమెరికన్ల పాత్రను వారు కొనియాడారు. సాంస్కృతిక ప్రదర్శనలతో ఈ వేడుక ఘనంగా ముగిసింది.








