ఆ అధికారుల పేర్లు రాయండి.. వైసీపీ నేతలకు జగన్ ఆదేశాలు..!
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత కీలకమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించిన ఆయన, పార్టీ కేడర్‌కు పవర్ఫుల్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు గనుక నిజంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడం ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలను సక్రమంగా జరగనివ్వరని, అందువల్ల వైసీపీ నేతలు ఈ పోరాటాన్ని ఏమాత్రం ఆషామాషీగా తీసుకోవద్దని గట్టిగా హెచ్చరించారు.
ఈ ఎన్నికలు కేవలం సాధారణ గెలుపోటములకు సంబంధించినవి మాత్రమే కావని, క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న మన కార్యకర్తల భవిష్యత్తు కోసం, వారి రక్షణ కోసం గట్టిగా నిలబడాల్సిన సమయమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ అత్యంత బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతామని, కూటమి నేతల దౌర్జన్యాలకు భయపడి పోటీ లేకుండా ఏకగ్రీవాలు కావడానికి ఎక్కడా ఆస్కారం ఇవ్వకూడదని నేతలకు తేల్చి చెప్పారు. “వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన” అంటూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలు విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి.. గత వైసీపీ ప్రజా రంజక పాలనకు, ప్రస్తుత కూటమి అరాచక పాలనకు ఉన్న స్పష్టమైన తేడాను ప్రజలకు వివరించాలని సూచించారు.
రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ లీగల్ మరియు మీడియా సెల్స్‌ను వంద శాతం బలోపేతం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లతో పోలీసుల వేధింపులకు గురవుతున్న వైసీపీ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకోవాలని, వారికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో.. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి తొత్తులుగా మారి వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న అధికారుల వివరాలను నిశితంగా నమోదు చేయాలని జగన్ ఒక సంచలన ఆదేశం జారీ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టేది లేదని, భవిష్యత్తులో వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీటితో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై కూటమి అబద్ధాలను తిప్పికొట్టేలా సోషల్ మీడియాలో పార్టీ కేడర్ అంతా నిరంతరం యాక్టివ్‌గా ఉండాలని వైఎస్ జగన్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు.








