న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో పూజా హెగ్దే, అడివి శేష్.. ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’ బృందం
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్ ఐ ఎ) ఆధ్వర్యంలో ఆదివారం, ఆగస్టు 16న మ్యాన్హాటన్లోని మాడిసన్ అవెన్యూలో 44వ వార్షిక “ఇండియా డే పరేడ” అత్యంత వైభవంగా జరిగింది. “హార్మనీ ఇన్ హెరిటేజ” (సంస్కృతిలో సామరస్యం) అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ పరేడ్‌కు దాదాపు 2,00,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవం మరియు అమెరికా 250వ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పరేడ్‌ను నిర్వహించారు. న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కేథీ హోచుల్ ఈ ప్రదర్శనను ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో న్యూయార్క్ స్టేట్ సెనెటర్ జెరెమీ కూనీ, కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్, అసెంబ్లీ సభ్యుడు డేవిడ్ వేప్రిన్, మరియు అభ్యర్థి సరితా కొమిరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటి పూజా హెగ్డే, నటుడు-దర్శకుడు అడివి శేష్ మరియు ప్రముఖ టీవీ షో ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’ బృందం ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మాడిసన్ అవెన్యూలో సాగిన ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’ ఫ్లోట్ (శకటం) ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ప్రొడ్యూసర్ అసిత్ కుమార్ మోదీతో పాటు నటులు దిలీప్ జోషి, మందార్ చంద్వాడ్కర్, మున్మున్ దత్తా, సోనాలికా జోషి, బల్విందర్ సింగ్ సూరి మరియు నితీష్ భలూని ఈ శకటంపై సందడి చేశారు.
సాంస్కృతిక సంస్థలు, వ్యాపార సంస్థలు మరియు ప్రాంతీయ సంఘాలకు చెందిన మొత్తం 55 శకటాలు మాడిసన్ అవెన్యూ గుండా ఊరేగాయి. వీటితో పాటు మార్చింగ్ బ్యాండ్లు, నృత్య బృందాలు మరియు ప్రాంతీయ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కూడా ఒక ప్రత్యేక శకటాన్ని ప్రదర్శించింది. దీనితో పాటు, ఈస్ట్ 26వ వీధి (మాడిసన్ మరియు పార్క్ అవెన్యూల మధ్య) ఎఫ్ ఐ ఎ ప్రత్యేకంగా ఫుడ్ ఫెస్టివల్ మరియు కమ్యూనిటీ స్టాళ్లను ఏర్పాటు చేసింది. ఈస్ట్ 26 మరియు 25వ వీధుల మధ్య లైవ్ సాంస్కృతిక వేదికపై మధ్యాహ్నమంతా సాంప్రదాయ సంగీత, నృత్య కార్యక్రమాలు కొనసాగాయి. ఎఫ్ ఐ ఎ ఛైర్మన్ అంకుర్ వైద్య, ఎఫ్ ఐ ఎ ప్రెసిడెంట్ శ్రీకాంత్ అక్కపల్లి ప్రముఖులకు స్వాగతం పలికి వేడుకలను సమన్వయం చేశారు.








