తల నరికేయ్..కళ్లను పొడిచేయ్.. కానీ సెక్స్ మాత్రం చూపించద్దు!!
— చైనా సెన్సార్ కు టారంటినో పరీక్ష
— సూర్య ప్రకాష్ జోశ్యుల
తల నరికేస్తారు. ఓకే.
కళ్లను పొడిచేస్తారు. ఓకే. నో ప్రాబ్లం.
రక్తం ఏరులై పారుతుంది. అదీ ఓకే. అది కామన్.
కానీ…
ఒక సెక్స్ సీన్ కనిపించిందా?
అక్కడే చైనా సెన్సార్ కత్తెర బయటకు వస్తుంది. క్వెంటిన్ టారంటినో సినిమా ఇప్పుడు చైనాలో ఎదుర్కోబోతున్న విచిత్రమైన పరీక్ష ఇదే.
క్వెంటిన్ టారంటినో తీసిన Kill Bill అంటేనే రక్తపాతం, ప్రతీకారం, హింసకు మరో పేరు. ఇప్పుడు దాని రెండు భాగాలను కలిపిన నాలుగున్నర గంటల వెర్షన్ ‘The Whole Bloody Affair’ చైనాలో విడుదలకు సిద్ధమైంది. ఇదే ఇప్పుడు చైనా సెన్సార్లకు అసలు పరీక్ష.
ఎందుకంటే టారంటినో సినిమా అంటే చైనా సెన్సార్ అధికారులకు సాధారణ సినిమా కాదు.
రక్తాన్ని ఎంతవరకు ఉంచాలి? హింసను ఎంతవరకు కత్తిరించాలి? సెక్స్‌ను ఎలా తొలగించాలి?
చైనాలో పిల్లలకూ పెద్దలకూ ఒకటే సినిమా!
చైనాలో ఇప్పటికీ పాశ్చాత్య దేశాల తరహాలో సాధారణ ప్రేక్షకులకు వయసు ఆధారిత సినిమా రేటింగ్ వ్యవస్థ లేదు. అక్కడి అధికారుల దృష్టిలో సినిమా అంటే వీలైనంతవరకు అందరూ చూడగలిగేదిగా ఉండాలి. అంటే నాలుగేళ్ల పిల్లవాడు చూసినా ఇబ్బంది ఉండకూడదు. నలభై ఏళ్ల పెద్దవాడు అదే సినిమా ని హాయిగా చూడాలి.
ఫలితం?
సెన్సార్ల చేతిలో ఒక పెద్ద కత్తెర. పాశ్చాత్య సినిమాల్లోని సెక్స్, నగ్నత్వం, బూతులు, హింసను కత్తిరించడం మాత్రమే కాదు… అవసరమైతే డిజిటల్‌గా దుస్తులు కూడా జోడించగలరు. కొన్ని సన్నివేశాల్లో కెమెరా ఫ్రేమ్‌ను దగ్గరకు తీసుకెళ్లి ‘అసౌకర్యకరమైన’ భాగాలను ప్రేక్షకుల కళ్లకు కనిపించకుండా చేస్తారు.టారంటినో సినిమా అయితే మరింత కష్టం. ఎందుకంటే అక్కడ హింస, శృంగారం కథలో భాగం.
టారంటినోకు చైనాతో పాత గొడవే
చైనాలో టారంటినో సినిమాల చరిత్ర కూడా పెద్దగా సాఫీగా లేదు. Django Unchained 2013లో చైనాలో విడుదలకు అనుమతి పొందింది. కానీ మొదటి ప్రదర్శన ఒక్కసారిగా ఆగిపోయింది. దాదాపు నెల తర్వాత మరింత కత్తిరింపులతో సినిమా మళ్లీ విడుదలైంది.
Once Upon a Time in Hollywood కూడా ఒక దశలో చైనా విడుదలకు అనుమతి పొందింది. తర్వాత కారణం స్పష్టంగా తెలియకుండానే ఆ విడుదల రద్దయింది. అందుకే ఇప్పుడు The Whole Bloody Affairకు అనుమతి రావడం చైనా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. వాళ్లు ఇప్పుడు ఏ సినిమా చూస్తారు? టారంటినో సినిమానా? లేక చైనా సెన్సార్లు తయారు చేసిన టారంటినో సినిమానా?
రక్తం కూడా బాక్సాఫీస్‌ను కాపాడలేకపోతే?
చైనా సినిమా మార్కెట్ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. 2026 తొలి ఆరు నెలల్లో సినిమా టికెట్ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 40 శాతం పడిపోయాయి. కోవిడ్ కాలాన్ని పక్కన పెడితే ఇది దాదాపు దశాబ్దంలోనే అత్యంత బలహీనమైన పరిస్థితి.
మరో షాకింగ్ విషయం…ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 550కి పైగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అంటే సమస్య కేవలం ఏ సినిమా ఎంత సంపాదించింది అన్నది కాదు. ప్రజలు థియేటర్లకే రావడం తగ్గుతోంది. ఇలాంటి సమయంలో టారంటినో సినిమా లాంటి సాధారణ చైనా ప్రేక్షకుడు చూడని, కానీ భారీ ఫ్యాన్‌బేస్ ఉన్న సినిమాను అనుమతించడం యాదృచ్ఛికమా? అన్నది ఇప్పుడు చైనా సినిమా వర్గాల్లో చర్చ.
అదే సమయంలో Obsession అనే హారర్ సినిమా కూడా విడుదలైంది. భయపెట్టే సినిమాలతోనైనా ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు తీసుకురావాలనే ప్రయత్నమా? అన్న ప్రశ్న మొదలైంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం ఈ దారిలో పెద్దగా ముందుకు కదలడం లేదు.
‘Kill Bill’లో బుల్లెట్లు, కత్తులు, రక్తం ఎంత మిగులుతాయి?
సెక్స్ ఎంత మిగులుతుంది? కథ ఎంత మిగులుతుంది? అన్నదే ఆసక్తి. చివరికి చైనా సెన్సార్లు నాలుగున్నర గంటల The Whole Bloody Affairను కుటుంబం మొత్తం కూర్చొని చూడగలిగేంత ‘స్వచ్ఛమైన’ సినిమాగా మార్చగలిగితే…
అది టారంటినో విజయం కాదు. చైనా సెన్సార్లకు ఒక ప్రత్యేకమైన అవార్డు ఇవ్వాల్సిందే!








