విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి పతకాలు అందించిన మంత్రి నారా లోకేశ్
విజయవాడలో పండుగ వాతావరణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వివిధ ప్రభుత్వ విభాగాల శకటాలు ప్రదర్శన
అందరినీ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి పతకాలు అందించిన మంత్రి నారా లోకేశ్
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆద్యంతం ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విద్య, ఐటీ శాఖల మంత్రి హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ విన్యాసాలు ప్రతిఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ముందుగా పోలీస్, హోంగార్డ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, గర్ల్స్, జీఎన్ ఎమ్, యూత్ రెడ్ క్రాస్, మై భారత్, యూత్ టైం బ్యాంక్ కంటిజెంట్ మంత్రి నారా లోకేష్ కు గౌరవ వందనం సమర్పించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
అనంతరం రాష్ట్ర ప్రగతిని సూచిస్తూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శకటాలు ప్రదర్శించారు. శ్రీకనకదుర్గ అమ్మవారి శకటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శకటం, పంచాయతీ రాజ్ శాఖ శకటం, గ్రామీణాభివృద్ధి శకటం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ- జలవనరుల శాఖ శకటం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ శకటం, వ్యవసాయ శాఖ శకటం, పశుసంవర్థక, ఉద్యానశాఖ, ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకం శకటం, పౌరసరఫరాల శాఖ శకటం, పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్ష శకటం, వైద్య, ఆరోగ్యశాఖ శకటం, రవాణశాఖ శకటం, పరిశ్రమల శాఖ శకటం, అటవీశాఖ శకటం, విజయవాడ నగరపాలక సంస్థ శకటం, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డ్రోన్ నిఘా శకటం ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ విన్యాసాలు ప్రతిఒక్కరినీ అలరించాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి మంత్రి నారా లోకేష్ పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.








