“పాత ఈమెయిల్స్ ఉన్నాయా? కొనుక్కుంటాం!”, ఏంటీ కొత్త బిజినెస్?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
“కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా, అగ్గిపుల్లా.. కాదేదీ కవితకనర్హం” అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు అదే ధోరణిలో .. పాత ఈమెయిల్స్, ఆఫీస్ చాట్లు కాదేది అమ్మకానికి అనర్హం అంటోంది నేటి ప్రపంచం. అదెలా అంటారా?
ఒక్కసారి ఆఫీస్‌లో మీ రోజును గుర్తు చేసుకోండి. బాస్‌కు ఒక మెయిల్ పంపారు. కస్టమర్‌కు రిప్లై ఇచ్చారు. టీమ్ చాట్‌లో ఎవరో అడిగిన ప్రశ్నకు పరిష్కారం చెప్పారు. వీడియో మీటింగ్‌లో గంటసేపు మాట్లాడారు. ప్రాజెక్ట్‌లో చేసిన మార్పులను రికార్డ్ చేశారు. రోజు పూర్తయింది. ల్యాప్‌టాప్ మూసేశారు. ఇంటికి వెళ్లిపోయారు. మీ పని అయిపోయింది.
మీరు రాసిన ఆ మెయిల్స్, చాట్లు, మీటింగ్ రికార్డింగ్స్, కోడ్ మార్పులు.. అన్నీ డిజిటల్ ఫైళ్లలో అలాగే మిగిలిపోయాయి.అయితే ఇన్నాళ్లు కేవలం ఏదన్నా రిఫరెన్స్ కు వెనక్కి తిరిగి చూసుకోవాలంటే అవి ఓ సారి తిరగేసేవారు. కొన్నిసార్లు ఏదన్నా ఎవిడెన్స్ కోసం ఉపయోగించేవారు. అంతకు మించి వాటితో పనిలేదు. కానీ ఇప్పుడు వాటిని అమ్ముకునే టైమ్ వచ్చింది.
మీకు గుర్తుందా..ఒకప్పుడు ఆఫీస్‌లో పాత ఫైళ్లు, పాత కాగితాలు, పనికిరాని రికార్డులు అన్నీ ఒక మూలకు పోగేసి… “ఇవన్నీ టోకున అమ్మేయండి” అనేవారు.ఇప్పుడు అదే పని డిజిటల్ ప్రపంచంలో జరుగుతోంది.
కాకపోతే ఈసారి అమ్మకానికి వెళ్తున్నవి పాత కాగితాలు కాదు. మీ ఆఫీస్ చాట్లు. మీ మెయిల్స్ . మీటింగ్ రికార్డింగ్స్. కోడ్ మార్పుల చరిత్ర. ఇవన్నీ కట్టగట్టి అమ్మే మార్కెట్ తయారవుతోంది.
వీటిని ఎవరు కొంటారండీ బాబూ అంటారా.ఉంటారు…ఉన్నారు. అదీ ఆషామాషీ బ్యాచ్ కాదు. OpenAI, Anthropic లాంటి AI దిగ్గజాలు.
ఈ స్క్రాప్ తో వాళ్లేం చేస్తారు అంటారా..
స్క్రాప్ నుంచి కూడా బంగారం పండించే మానవ జాతిలో మనం బ్రతుకుతున్నాం. అయితే ఇక్కడ ఈ స్క్రాప్ అయిపోయిన మెయిల్ కాదు వాళ్ళకు కావాల్సింది. మీ ఆలోచనా విధానమే కావాలి.
రేపటి AI..ఆఫీస్ లో ఉద్యోగిలా పనిచేయాలంటే… ఇది కేవలం ChatGPTలాంటి ప్రశ్న-సమాధానాల విషయం కాదు. రాబోయే AI Agent మీ తరఫున పని చేయాలి. కస్టమర్ మెయిల్ చదివి సమాధానం ఇవ్వాలి. ఇన్వాయిస్లో తప్పు ఉందో లేదో గుర్తించాలి. సాఫ్ట్వేర్ సమస్యను గుర్తించాలి. మీటింగ్‌లో జరిగిన చర్చను అర్థం చేసుకోవాలి. కంపెనీ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించాలి. అంటే AIకి ఒక ఉద్యోగి ఏం చేయాలో చెప్పడం మాత్రమే సరిపోదు.
ఒక ఉద్యోగి ఎలా ఆలోచిస్తాడో కూడా నేర్పించాలి. అందుకు నిజ జీవితంలోని మానవ చర్యల కంటే విలువైన డేటా ఇంకేముంటుంది? అందుకే…మీ ఆఫీస్ మెయిల్ AIకి ఒక పాఠం. మీ టీమ్ చాట్ ఒక కేస్ స్టడీ. మీ వీడియో మీటింగ్ ఒక శిక్షణా తరగతి. మీరు చేసిన కోడ్ మార్పు ఒక సమస్య పరిష్కార ఉదాహరణ. అందుకే కార్పొరేట్ డేటాకు ఇప్పుడు కోట్ల విలువ.
అదేం లెక్క?
ఒక సాధారణ మెయిల్లో మీకు కనిపించేది కొన్ని వాక్యాలు. AIకి మాత్రం అందులో ఇంకేదో కనిపిస్తుంది. ఒక ఉద్యోగి సమస్యను ఎలా వివరించాడు? ఎలా ప్రశ్నించాడు? ఎలా సమాధానం వెతికాడు? కస్టమర్ కోపంగా ఉన్నప్పుడు ఎలా స్పందించాడు? మేనేజర్ ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఎలా నిర్ణయం తీసుకున్నాడు? డెవలపర్ సాఫ్ట్‌వేర్‌లో వచ్చిన బగ్‌ను ఎలా గుర్తించాడు? CFO కంపెనీ ఆర్థిక సమస్యను ఎలా విశ్లేషించాడు? ఇవి పుస్తకాల్లో దొరకవు. వెబ్సైట్లలో దొరకవు. ఇవి నిజ జీవితంలో మనుషులు పని చేస్తూ రాసిన మాటల్లో ఉంటాయి. అందుకే ఇప్పుడు AI కంపెనీలకు కావాల్సింది కేవలం డేటా కాదు. మానవ అనుభవం.
AIకి కొత్త పాఠ్యపుస్తకం.. మన ఆఫీసులే!
ఇప్పటివరకు AIకి శిక్షణ ఇవ్వాలంటే ఇంటర్నెట్లో ఉన్న సమాచారాన్ని సేకరించారు. పుస్తకాలు. వెబ్సైట్లు. వార్తలు. వ్యాసాలు. కోడ్. సోషల్ మీడియా పోస్టులు. కానీ ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. సరైన మానవ డేటా దానికి దొరకటం కాదు.
Epoch AI అంచనాల ప్రకారం, నాణ్యమైన మానవ రచనతో కూడిన పబ్లిక్ టెక్స్ట్ నిల్వ సుమారు 300 ట్రిలియన్ టోకెన్ల స్థాయిలో ఉండవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రాంటియర్ AI మోడళ్లు ఈ వనరును 2026 నుంచి 2032 మధ్య పూర్తిగా వినియోగించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. మరింత స్పీడుతో శిక్షణ జరిగితే ఆ గడువు 2027కే చేరవచ్చని అంచనా.
ఎంత రేటు పెట్టి కొంటున్నారు
డేటా బ్రోకరేజ్ స్టార్టప్ Protege CEO బాబీ సామ్యూల్స్ చెప్పిన వివరాలు ఈ మార్కెట్ స్పీడుగా ఉంది. Warmly అనే AI ఏజెంట్ స్టార్టప్‌ను HubSpot కొనుగోలు చేసే ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ కంపెనీ అంతర్గత మీటింగ్ నోట్స్, ఇమెయిల్స్ కొనుగోలు చేయడానికి నాలుగు వేర్వేరు ఆఫర్లు వచ్చినట్లు నివేదిక పేర్కొంది. వాటిలో ఒకటి 3 లక్షల డాలర్ల వరకు ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2.5 కోట్లకు పైగా. కంపెనీ మాత్రం ఆ డేటాను అమ్మడానికి నిరాకరించింది.
ఫైనల్ గా..
శ్రీశ్రీ చెప్పిన “కాదేదీ కవితకనర్హం” అన్న మాటకు టెక్నాలజీ యుగం తనదైన అర్థం చెబుతున్నట్టుంది. కాదేదీ డేటుగా మారకుండా ఉండదు. కాదేదీ విలువ లేకుండా ఉండదు.
నిన్నటి వరకు పాత మెయిల్ అంటే డిలీట్ చేయాల్సిన ఫైల్.
ఈరోజు అది AIకి ఒక పాఠం కావచ్చు. ఎంతో రేటు పలకొచ్చు.








