నిమ్స్ వైద్యుడికి అమెరికాలో అరుదైన గౌరవం
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా (యూసీఎఫ్) ‘ఇండియా సెంటర’ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అకడమిక్ కార్యక్రమం ‘సైంటిస్ట్ ఇన్ రెసిడెన్స’కు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డా. తిరుమల్ ఎర్రగుంట ఎంపికయ్యారు. న్యూరో సర్జరీ విభాగంలో ఈ అరుదైన గుర్తింపు పొందిన తొలి భారతీయుడిగా ఆయన ఘనత సాధించారు. ఆగస్టు 9 నుంచి 16 వరకు అమెరికాలో కొనసాగుతున్న ఈ విద్యా సంబంధిత కార్యక్రమంలో డా.తిరుమల్ పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా యూసీఎఫ్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో కార్యక్రమం ముగింపు రోజు ఆయన ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వనున్నారు. వర్సిటీ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు, ప్రవాస భారతీయులతో సమావేశమై.. ఆధునిక వైద్య విద్య, న్యూరో సర్జరీలో అత్యాధునిక విధానాలు, వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వాడకం, భారత్ – అమెరికా సంస్థల మధ్య పరస్పర సహకారం తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. ఆగస్టు 15న ఓర్లాండోలోని ఇండియా సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించే భారత స్వాతంత్య్ర దినోత్సంలో ప్రత్యేక అతిథిగా హాజరవుతారు.








