పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ దే పై చేయి? చతికిల పడ్డ ఎన్డీఏ..
అంతా అనుకున్నట్లే జరిగింది. ఈ సారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీ వేడీగా జరుగుతాయని, రచ్చ రచ్చ జరగడం ఖాయని సామాన్య ప్రజలు భావించారు. అది నిజమే అయ్యింది. గురువారం వందేమాతర గీతాలాపన అనంతరం లోక్ సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు. అయితే చివరి రోజు సమావేశాలకు మాత్ర ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. దాదాపు 19 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు ఎలాంటి అర్థవంతమైన చర్చలు లేకుండా, ప్రతి రోజూ వాయిదాలకే పరిమితమైంది. సభ లోపలు, వెలుపల అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో నిరసనలు చోటు చేసుకున్నాయి.
ఇదిలా వుండగా… అధికార ఎన్డీయేది పై చేయి అయ్యిందా? ప్రతిపక్ష కాంగ్రెస్ ది పై చేయి అయ్యిందా? అని పలువురు చర్చించుకుంటున్నారు. వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న బీజేపీ ఈ సారి కాస్త ఇబ్బందుల్లో పడిందని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సారి కాంగ్రెస్ ప్రధాని మోదీని కాకుండా కేంద్ర హొం మంత్రి అమిత్ షా ను టార్గెట్ చేసింది. సీజేపీ నిరసనల సమయంలో నిరసనకారులపై లాఠీఛార్జి, పెల్లెట్ల వినియోగంపై అమిత్ షా యే సభకు వచ్చి సమాధానం ఇవ్వాలని అటు రాహుల్, ఇటు ప్రియాంక ఇద్దరూ పట్టుబట్టారు. అలాగే అయోధ్య రామ మందిర విరాళాల అవకతవకలపై కూడా కేంద్రం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ గట్టిగా పట్టుబట్టింది.
మరో వైపు ఈ సారి పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అత్యంత చురుగ్గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంపై మునుపెన్నడూ లేని విధంగా విమర్శలకు దిగారు. అమిత్ షా సభకు రావాల్సిందేనని, కేంద్ర హోం మంత్రి హోదాలో సభకు సమాధానం చెప్పాల్సిందేనని, అప్పటి వరకూ సభలో ప్రతిష్ఠంభన ఇలాగే కొనసాగుతుందని కాంగ్రెస్ తెగేసి చెప్పింది.
కాంగ్రెస్ ఇంతలా మంకు పట్టు పట్టడంతో అధికార ఎన్డీయే తీవ్ర ఇరకాటంలోనే పడిపోయింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కాంగ్రెస్ ను ఎదుర్కోడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా సరే… కాంగ్రెస్ ముందు అవి సరిపోలేదనే చెప్పాలి. మేజిస్ట్రేట్ హోదాలో వుండే అధికారే కాల్పులకు ఆదేశాలిస్తారు కానీ, కేంద్ర హోం మంత్రి ఇవ్వరని జేపీ నడ్డా వివరణ ఇచ్చినా.. కాంగ్రెస్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోనే పెట్టింది. అటు రాహుల్, ఇటు ప్రియాంక ఇద్దరి జోడీ.. ఈ పార్లమెంటరీ సమావేశాల్లో కాంగ్రెస్ కి కలిసొచ్చింది.
ఈ సారి ప్రభుత్వం కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ.. ప్రతిపక్షమైన కాంగ్రెస్ దానిని సమర్థవంతంగా అడ్డుకోవడంలో విజయం సాధించిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ20 పెట్రోల్ పై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనంటూ మంకు పట్టు పట్టింది. దీంతో ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందుల్లో పడిపోయిందని చెప్పవచ్చు. ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించినా, ముఖ్యంగా లోక్ సభ కార్యక్రమాలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఇదంతా చూసిన తర్వాత కాంగ్రెస్ మాత్రం అతి పక్కా వ్యూహంతోనే సభకు వచ్చినట్లు కనిపించింది. కానీ.. మోదీ, అమిత్ షా ద్వయం ఎందుకో మాత్రం ఈసారి తగినంత వ్యూహంతో సభ ముందుకు వచ్చినట్లు కనిపించలేదు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అడిగిన ప్రశ్నలకు దీటైన సమాధానం చెప్పడంలో విఫలమయ్యారు. అమిత్ షా సభకు హాజరవ్వాల్సిందేనని పట్టుబట్టగా… చివరి రెండు రోజుల ముందు మాత్రమే అమిత్ షా స్పందించారు. తాను సభకు రావడానికి రెడీగా వున్నానని, అంశాలపై సమాధానం చెప్పేందుకు కూడా సిద్ధంగానే వున్నానని ప్రకటించారు తప్పించి, పెద్దగా స్పందించినట్లు కనిపించలేదు.
ఇక.. మొత్తం లోక్ సభ షెడ్యూల్ లో 15 శాతమే సద్వినియోగమైంది. రాజ్యసభ సమయంలో 39 శాతం మాత్రమే చర్చలు జరిగాయి. ఎలాంటి చర్చ లేకుండానే 12 బిల్లుల ఆమోదం కూడా జరిగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్, విదేశీ విరాళాల నియంత్రణ బిల్లులను ఈ సెషన్ లో ఆమోదింపజేసుకోలేకపోయింది.








