బరువు తగ్గే ఇంజెక్షన్లు వాడుతున్న భారత క్రికెటర్లు..?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(virat Kohli) స్థాయి ఫిట్నెస్ను సాధించడం కోసం కొందరు భారతీయ క్రికెటర్లు బరువు తగ్గే ఇంజెక్షన్లను (Weight-Loss Injections) వాడుతున్నట్లు ఒక సంచలన నివేదిక వెల్లడించింది. మైదానంలో విరాట్ కోహ్లీ ప్రదర్శించే అద్భుతమైన చురుకుదనం, ఫిట్నెస్ ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. అయితే, కోహ్లీలా కఠినమైన ఆహార నియమాలు, కష్టతరమైన జిమ్ వర్కవుట్లు చేయలేక.. కొంతమంది ఐపీఎల్ (IPL) ఆటగాళ్లతో పాటు జూనియర్ క్రికెటర్లు కూడా బరువు తగ్గడానికి సులువైన దారులను వెతుకుతున్నట్లు ‘క్రిక్‌బ్లాగర్’ నివేదిక పేర్కొంది.
ప్రొఫెషనల్ క్రికెట్లో ఇలాంటి వెయిట్ లాస్ డ్రగ్స్ వాడకంపై ఈ నివేదిక ఇప్పుడు పెద్ద చర్చకు తెరలేపింది. క్రికెట్ లాకర్ రూమ్‌లలో ప్రస్తుతం ‘ఓజెంపిక్’ (Ozempic), ‘మౌంజారో’ (Mounjaro) వంటి జీఎల్పీ-1 (GLP-1) ఆధారిత మందుల వాడకం విపరీతంగా పెరిగిపోయినట్లు సమాచారం. సాధారణంగా వైద్యులు వీటిని మధుమేహం నియంత్రణ కోసం సిఫార్సు చేస్తారు. ఓజెంపిక్లోని ‘సెమగ్లుటైడ్’, మౌంజారోలోని ‘టిర్జెపటైడ్’ అనే క్రియాశీల పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతూ, ఆకలిని తగ్గించి జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి.
తద్వారా తక్కువ శ్రమతోనే వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కేవలం అథ్లెట్లే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ ఇంజెక్షన్లను విరివిగా వాడుతున్నట్లు సదరు నివేదికలో ఒకరు వెల్లడించారు. ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్ల వల్ల సులభంగానే బరువు తగ్గినప్పటికీ, వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రమాదకరంగా ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని వాడటం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు, మరియు మలబద్ధకం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిరంతరం మైదానంలో చెమటోడ్చే ప్రొఫెషనల్ అథ్లెట్లకు ఇలాంటి శారీరక సమస్యలు రావడం వారి కెరీర్‌ను ముప్పులోకి నెట్టేసే ప్రమాదం ఉంది. ఒకవైపు బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు తలెత్తుతుండగా, మరోవైపు ఈ ఇంజెక్షన్ల వ్యవహారం భారత క్రికెట్లో కొత్త వివాదానికి కారణమవుతోంది.








