నోవైలో వైభవంగా జరిగిన మాటా మిషిగన్ బోనాల జాతర
నోవై: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) మిషిగన్ ఆధ్వర్యంలో బోనాలు జాతర 2026 కార్యక్రమం నోవైలోని శ్రీ వెంకటేశ్వర టెంపుల్ & కల్చరల్ సెంటర్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మిషిగన్‌లోని తెలుగు కుటుంబాలు, కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాల పండుగ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఘనమైన బోనాల ఊరేగింపు, మహాకాళీ మాతకు బోనం సమర్పణ, కుంకుమ పూజలు కన్నుల పండువగా సాగాయి. వీటితో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించగా, మహారాష్ట్ర మండల్ డెట్రాయిట్ (MMD)కు చెందిన షిలేదార్ ఢోల్ తాషా పథక్ ప్రదర్శించిన ప్రత్యేక డోలు ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. సభ్యుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో ఈ వేడుక ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.
ఈ వేడుకను మాటా మిషిగన్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ బాతిని, రీజినల్ కోఆర్డినేటర్ సత్య మైనంపాటి, ఉమెన్స్ కో-చైర్ అమూల్య రామన్నగారి నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించారు. వీరితో పాటు ప్రియ, అక్షర, మల్లేశం అనేక మంది మాటా మిషిగన్ కమ్యూనిటీ వాలంటీర్లు అందించిన అంకితభావంతో కూడిన సహకారం కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించింది.

బోనాల సంప్రదాయాన్ని, తెలుగు సంస్కృతిని కాపాడుతూ భావితరాలకు అందించేందుకు తమ కుటుంబాలతో కలిసి హాజరైన ప్రతి ఒక్కరికీ, వాలంటీర్లకు, కళాకారులకు, ఆలయ ప్రతినిధులకు , కమ్యూనిటీ సభ్యులందరికీ MATA మిషిగన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ వేడుక విజయవంతం కావడానికి విశేషంగా సహకరించిన స్పాన్సర్ కళ్యాణ్ తిరుమల గారికి, శ్రీ వెంకటేశ్వర టెంపుల్ & కల్చరల్ సెంటర్‌కు, పాల్గొన్న అన్ని సంస్థలు , ప్రదర్శన బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు కమ్యూనిటీని ఒక్కతాటిపైకి తీసుకురావడం , మన గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడం పట్ల తమ నిబద్ధతను మాటా మిషిగన్ మరోసారి చాటుకుంది.








