మీకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ నిజంగా డాక్టరేనా?
మీరు హాస్పిటల్‌కు వెళ్తారు. డాక్టర్ గదిలోకి పిలుస్తారు. తెల్లకోటు వేసుకున్న వ్యక్తి మీ ఎదురుగా కూర్చుంటాడు. మెడికల్ డిగ్రీ ఉంది. పేరు ముందు ‘Dr.’ ఉంది. కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. మీరు ఒక్క క్షణం కూడా అనుమానించరు.
ఎందుకంటే మనం డాక్టర్‌ను ప్రశ్నించం. డాక్టర్ అర్హతను వ్యవస్థ ఇప్పటికే తనిఖీ చేసిందని నమ్ముతాం. కానీ ఆ సర్టిఫికెట్ నకిలీ అయితే? ఆ రిజిస్ట్రేషన్ ఒక ఫేక్ పేపర్ ఆధారంగా వచ్చి ఉంటే?, అసలు పరీక్షలో పాస్ కాకుండానే డబ్బులు పెట్టి ‘డాక్టర్’గా మారిపోయి ఉంటే?
ఇప్పుడు రాజస్థాన్‌లో బయటపడుతున్న ఒక మెడికల్ ఫోర్జరీ కేసు ఈ భయంకరమైన ప్రశ్ననే మన ముందుంచుతోంది.
పరీక్షలో ఫెయిల్.. కానీ డాక్టర్ అయ్యాడు!
కజకిస్థాన్‌లో MBBS చదివిన 27 ఏళ్ల నితిన్ కుమార్‌కు భారత్‌లో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయడానికి ఒక ముఖ్యమైన అడ్డంకి ఎదురైంది. Foreign Medical Graduate Examination — FMGE.
పరీక్షలో పాస్ కావాలి. అది లేకపోతే భారత్‌లో మెడికల్ రిజిస్ట్రేషన్, ప్రాక్టీస్‌కు వెళ్లే మార్గం మూసుకుపోతుంది. అతను ఆ పరీక్షలో అనేక సార్లు ఫెయిలైనట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
అక్కడితో ఆగాల్సిన కథ మరో దారిలోకి వెళ్లింది.
దర్యాప్తు ప్రకారం, నితిన్ రూ.10 లక్షలు చెల్లించి ఫేక్ FMGE సర్టిఫికెట్ పొందాడు. ఆ సర్టిఫికెట్ ఆధారంగా ఇంటర్న్‌షిప్, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ కూడా పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఒక్కసారి ఆలోచించండి. పరీక్ష పాస్ కాలేదు. కానీ పరీక్ష పాస్ అయినట్లు పేపర్ వచ్చింది. ఆ పేపర్ అఫీషియల్ నెట్ వర్క్ లోకి వెళ్లింది. రిజిస్ట్రేషన్ వచ్చింది. అక్కడి నుంచి ఒక వ్యక్తి ‘డాక్టర్’గా కనిపించడం మొదలైంది. ఇదే ఈ కథలో అత్యంత భయపెట్టే విషయం.
ఇది ఒక వ్యక్తి మోసం కాదు.. ఒక నెట్ వర్క్ !
గత కొంతకాలంగా ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లకు పెద్ద మార్కెట్ ఏర్పడినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మధ్యవర్తులు రూ.20-30 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇది ఒక వ్యక్తి కంప్యూటర్ ముందు కూర్చొని నకిలీ సర్టిఫికెట్ తయారు చేసిన చిన్న మోసం కాదు.
డబ్బు ఇచ్చే వ్యక్తి ఉన్నాడు. సర్టిఫికెట్ తయారు చేసే వ్యక్తి ఉన్నాడు. మధ్యలో పని పూర్తి చేసే బ్రోకర్లు ఉన్నారు. చివరికి ఆ ఫేక్ సర్టిఫికేట్ ను అధికారిక రిజిస్ట్రేషన్‌గా మార్చి, డాక్టర్ల వ్యవస్థలోకి ప్రవేశించే మార్గం కూడా ఉంది.
ఇప్పుడు ఆలోచించాల్సింది. అసలు ఫేక్ సర్టిఫికెట్ ఎవరు తయారు చేశారు? అనేది కాదు. ఆ ఫేక్ సర్టిఫికెట్‌ను ఎవరు నిజమైనదిగా మార్చారు? అనేదే.
రాజస్థాన్‌లో జరిగిన దర్యాప్తులో ఇప్పటివరకు 29 మంది అరెస్టయ్యారు. వీరిలో మాజీ రాజస్థాన్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ రాజేష్ శర్మ, మధ్యవర్తులు, విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. దర్యాప్తుదారుల ప్రకారం, 100 మందికి పైగా విదేశీ గ్రాడ్యుయేట్లు ఫేక్ FMGE సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్ పొందినట్లు గుర్తించారు. ఆ ఆరోపణలు నిజమని కోర్టులో నిరూపించాల్సి ఉంది. కానీ దర్యాప్తు బయటపెడుతున్న వ్యవస్థ మాత్రం ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది.
FMGE ఎందుకు అంత ముఖ్యమైనది?
విదేశాల్లో MBBS చదివిన భారతీయ పౌరులు, కొన్ని మినహాయింపులు తప్ప, భారత్‌లో వైద్య వృత్తిలోకి రావడానికి FMGE వంటి తప్పనిసరి స్క్రీనింగ్ వ్యవస్థను దాటాలి.
ఇది కేవలం మరో పరీక్ష కాదు. భారత్‌లో ఒక వ్యక్తి తన మెడికల్ డిగ్రీతో ఇక్కడి రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన అర్హతను తనిఖీ చేసే కీలక గేట్‌వే.
కానీ ఆ గేట్‌వే వద్దే సమస్య మొదలవుతోంది.
జూన్ 28న జరిగిన FMGE పరీక్షలో 37,448 మంది అభ్యర్థుల్లో కేవలం 13.5 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. జూన్ 2023 తర్వాత కూడా పాస్ శాతం ఎప్పుడూ చాలా ఎక్కువగా లేదు; అత్యధికంగా 29.62 శాతం, అత్యల్పంగా 10.20 శాతం నమోదయ్యాయి.
అంటే పరీక్ష కఠినంగా ఉంది. వేలాది మంది పరీక్ష రాస్తున్నారు. చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అక్కడే కొందరికి ఒక అక్రమ షార్ట్‌కట్ కనిపిస్తోంది. “పరీక్ష ఎందుకు పాస్ కావాలి? సర్టిఫికెట్ కొనుక్కుంటే సరిపోతుంది కదా?” ఈ ఆలోచన చుట్టూనే ఒక నకిలీ మార్కెట్ పెరిగితే, ప్రమాదం పరీక్షా వ్యవస్థకు మాత్రమే కాదు. రోగి వరకు చేరుతుంది.
ఒక నకిలీ సర్టిఫికెట్ చివరికి ఎక్కడికి వెళ్తుంది?
ఒక ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఒక ఫేక్ డిగ్రీ ఉంటే ఉద్యోగ వ్యవస్థ మోసపోతుంది. కానీ ఒక వ్యక్తి ఫేక్ మెడికల్ అర్హతతో డాక్టర్‌గా మారితే?అక్కడ తప్పిదానికి మూల్యం వేరే లెవెల్ లో ఉంటుంది. తప్పు మందు ఇవ్వచ్చు.తప్పు నిర్ధారణ చేయచ్చు. అవసరం లేని చికిత్స మొదలు కావచ్చు. దాంతో ఆలస్యమైన చికిత్స కావచ్చు. కొన్నిసార్లు ప్రాణం కూడా పోవచ్చు.
అందుకే ఒక రోగి డాక్టర్ గదిలోకి వెళ్లినప్పుడు అతని దగ్గర ఉండే అత్యంత విలువైన వస్తువు డబ్బు కాదు. నమ్మకం. “నా ముందు కూర్చున్న వ్యక్తి నిజంగా అర్హుడే” అన్న నమ్మకం. ఆ నమ్మకాన్నే ఫేక్ సర్టిఫికెట్ స్కామ్ దెబ్బతీస్తోంది.
మరి మనం ఎంతవరకు తనిఖీ చేస్తున్నాం?
ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. 2022 డిసెంబర్ నుంచే CBI విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల రిజిస్ట్రేషన్ వ్యవస్థకు సంబంధించిన అక్రమాలపై దర్యాప్తు చేసింది. 2011 నుంచి 2022 మధ్య జరిగిన వ్యవహారాలను 14 రాష్ట్రాల్లో పరిశీలించినట్లు సమాచారం.
అయితే ఇంత పెద్ద దర్యాప్తు జరిగిన తర్వాత వ్యవస్థలో శాశ్వత మార్పులు వచ్చాయా?
ఆ కాలంలో ఇచ్చిన రిజిస్ట్రేషన్లన్నీ మళ్లీ వెరిఫై చేశారా?. ప్రతి FMGE సర్టిఫికెట్‌ను నేరుగా డిజిటల్‌గా ధృవీకరించే వ్యవస్థ ఉందా? రాష్ట్ర మెడికల్ కౌన్సిళ్లలో ఉన్న పాత రికార్డులపై రెగ్యులర్ ఆడిట్ జరుగుతోందా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేకపోతే, ఒక కేసులో కొంతమందిని అరెస్టు చేయడం సమస్యకు పూర్తి పరిష్కారం కాదు. ఎందుకంటే ఫేక్ సర్టిఫికెట్ వ్యాపారం ఉన్నంతకాలం కొత్త వ్యక్తులు వస్తూనే ఉంటారు.
అసలు భయం ఇక్కడే ఉంది
ఈ కథ చదివిన తర్వాత మనం ప్రతి డాక్టర్‌ను అనుమానించాల్సిన అవసరం లేదు.
దేశంలో వేలాది మంది నిజమైన, అర్హత కలిగిన వైద్యులు ప్రతిరోజూ లక్షలాది మందికి సేవ చేస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అడగాల్సిందే. మెడికల్ రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఒక నంబర్ కాదు. అది ప్రజల ప్రాణాలపై వ్యవస్థ ఇచ్చే హామీ. ఆ హామీని ఫేక్ సర్టిఫికెట్తో ఎవరైనా దాటగలిగితే, సమస్య ఆ ఒక్క వ్యక్తిలో లేదు.గేట్ దగ్గరే ఉంది.
ఎందుకంటే మనం హాస్పిటల్లో డాక్టర్‌ను చూసినప్పుడు సాధారణంగా అడిగే ప్రశ్న
“డాక్టర్ గారు, నాకు ఏమైంది?”
ఇప్పుడు వ్యవస్థను అడగాల్సిన ప్రశ్న మరోటి.
“డాక్టర్ గారు నిజంగా డాక్టరేనా?”








