ఒక్క హార్డ్‌డిస్క్ మాయం… Netflix పై రూ.900 కోట్ల కేసు!అందులో ఏముంది?
సోమవారం ఉదయం.
లాస్ ఏంజెల్స్‌లోని Netflix కార్యాలయం.
ఒక ఉద్యోగి తన టేబుల్ దగ్గరకు వచ్చాడు. అంతకు ముందు రోజు సాయంత్రం అక్కడే పెట్టిన కొన్ని హార్డ్‌డిస్క్‌లు కనిపించలేదు. మొదట పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ‘ఎక్కడో పెట్టి ఉంటారు… దొరుకుతాయి’ అనుకున్నారు. కానీ కొన్ని గంటల్లోనే ఆఫీస్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే కనిపించకుండా పోయింది ఒక హార్డ్‌డిస్క్ కాదు… ఇంకా ప్రపంచంలో ఎక్కడా విడుదల కాని హాలీవుడ్ సినిమా కాపీ.
ఆ ఒక్క డ్రైవ్ కోసం ఇప్పుడు Netflixపై సుమారు రూ.900 కోట్ల నష్టపరిహారం కోరుతూ కేసు నడుస్తోంది. ఒక చిన్న హార్డ్‌డిస్క్ నిజంగానే అంత విలువైనదా?. డిజిటల్ ప్రపంచంలో అసలు విలువ ఎక్కడ ఉందో ఈ ఘటన మళ్లీ గుర్తు చేసింది.
కొన్ని గంటల కోసం ఇచ్చారు… అంతలోనే మాయం!
ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. ఈ కాపీ నెట్‌ఫ్లిక్స్ దగ్గర శాశ్వతంగా ఉండాల్సింది కాదు. నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు సినిమా చూడటానికి (స్క్రీనింగ్) హార్డ్‌డిస్క్ తెప్పించుకున్నారు. సినిమా చూసిన వెంటనే ఆ ఫైల్‌ను కంప్యూటర్ నుంచి పూర్తిగా తొలగించి (డిలీట్ చేసి), హార్డ్‌డిస్క్ తిరిగి ఇచ్చేయాలని నిర్మాత ముందే సూచించినట్లు కోర్టు పిటిషన్ చెబుతోంది. అంటే నెట్‌ఫ్లిక్స్ దగ్గర ఆ సినిమా ఉండాల్సింది కొన్ని గంటలు మాత్రమే. కానీ అంతట్లోనే ఆ డ్రైవ్ దొంగతనానికి గురైందన్న ఆరోపణ ఇప్పుడు ఈ పెద్ద వివాదానికి కేంద్రంగా మారింది.
ఒక హార్డ్‌డిస్క్… రూ.900 కోట్ల వివాదం
‘Fortitude’ నిర్మాత సైమన్ అఫ్రామ్ తన సంస్థ తరఫున Netflixపై 105 మిలియన్ డాలర్లకు పైగా నష్టపరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించారు. భారతీయ కరెన్సీలో అది సుమారు రూ.900 కోట్లకు పైగానే ఉంటుంది. వారి వాదన ప్రకారం, సినిమా ఇప్పటికీ ఆన్లైన్లో లీక్ కాలేదు. కానీ విడుదలకు ముందే ఒక అన్ఎన్క్రిప్టెడ్ కాపీ దొంగతనానికి గురైందనే విషయం ఒక్కటే సినిమా మార్కెట్ విలువపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
సినిమా ఇంకా లీక్ కాలేదు… మరి కేసు ఎందుకు?
మన దగ్గర రిలీజ్ కు ముందే ‘తమిళ రాకర్స్’ లేదా టెలిగ్రామ్‌లో సినిమాలు లీక్ అవ్వడం కొత్తేమీ కాదు. కానీ ఈ కేసు భిన్నమైనది. ఇక్కడ సినిమా ఇంకా ఆన్లైన్లో లీక్ కాలేదు! కానీ లీక్ అయ్యే “అవకాశం” ఉందనే భయమే ఈ రూ. 900 కోట్ల దావాకు దారితీసింది.
సినిమా ఒకసారి లీక్ అయితే సమస్య కేవలం పైరసీ మాత్రమే కాదు. సినిమా కొనాలని అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గొచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు రకరకాల ప్రశ్నలు అడగొచ్చు, వేసుకున్న మార్కెటింగ్ ప్లాన్ మొత్తం మారిపోవచ్చు. ఒక్క లీక్ భయం వల్ల ఒక సినిమా మార్కెట్ విలువ ఒక్కసారిగా పడిపోతుంది.ఇప్పటికే సిద్ధం చేసిన మార్కెటింగ్ వ్యూహాన్ని మార్చాల్సి రావచ్చు. అవార్డుల ప్రచారంపైనా ప్రభావం పడొచ్చు. అందుకే నిర్మాత ఈ దొంగతనాన్ని ఒక చిన్న విషయంగా చూడటం లేదు.
అందుకే నిర్మాతలు ఈ ఘటనను సాధారణ దొంగతనంగా కాకుండా, తమ సినిమా భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంగా చూస్తున్నారు.
నిర్మాత చెప్పేది ఒకటి… Netflix చెప్పేది మరొకటి!
అసలు ఫైట్ ఇక్కడే మొదలైంది. రూ. 900 కోట్లు కట్టడానికి నెట్‌ఫ్లిక్స్ అస్సలు ఒప్పుకోవడం లేదు.
నెట్‌ఫ్లిక్స్ వాదన ఏంటంటే:
“మీరు సినిమా ఇచ్చారు సరే… కానీ దానికి ఉండాల్సిన కనీస ‘ఇండస్ట్రీ స్టాండర్డ్ ఎన్క్రిప్షన్ (పాస్వర్డ్ ప్రొటెక్షన్)’ సెక్యూరిటీ లేదు. పాస్వర్డ్ లేని ఓపెన్ కాపీ మాకిచ్చి, ఇప్పుడు చోరీకి గురైతే మా మీద తోస్తే ఎలా? పైగా మా పైరసీ టీమ్ రాత్రింబవళ్లు ఇంటర్నెట్ను పర్యవేక్షిస్తోంది. సినిమా ఎక్కడా లీక్ కాలేదు!”
అంతేకాదు, నిర్మాత తమను బెదిరించి డబ్బులు లాగాలని చూస్తున్నాడని నెట్‌ఫ్లిక్స్ తీవ్రంగా ప్రత్యారోపణ చేస్తోంది.
అసలు ఆ సినిమాలో ఏముంది?
‘Fortitude’ ఒక వరల్డ్ వార్–2 స్పై థ్రిల్లర్. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అధికారులు నాజీ నాయకత్వాన్ని తప్పుదారి పట్టించేందుకు చేపట్టిన రహస్య ఆపరేషన్ల స్ఫూర్తితో రూపొందిన కథ ఇది. ఈ చిత్రానికి సైమన్ వెస్ట్ దర్శకత్వం వహించగా, హాలీవుడ్ స్టార్ నికోలస్ కేజ్‌తో పాటు మ్యాథ్యూ గుడ్, ఎడ్ స్క్రైన్, జోర్డీ మొల్లా, అలిస్ ఈవ్ కీలక పాత్రల్లో నటించారు.అంటే ఇది చిన్న ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ కాదు. అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకున్న పెద్ద సినిమా.
డిజిటల్ యుగంలో అసలైన సంపద
ఈ ఘటన ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతోంది. ఈ రోజుల్లో సినిమా విలువ కేవలం కెమెరాలు, సెట్లు, స్టార్ హీరోల రెమ్యూనరేషన్లో మాత్రమే ఉండదు. చివరికి ఆ సినిమా ఒక డిజిటల్ ఫైల్ రూపంలోనే ఉంటుంది. ఆ ఫైల్ సురక్షితంగా ఉండటం కూడా అంతే కీలకం.
ఒక చిన్న హార్డ్‌డిస్క్ కనిపించకుండా పోవడం… ప్రపంచంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థపై వందల కోట్ల నష్టపరిహారం కేసుకు దారితీయడం… డిజిటల్ యుగంలో డేటా విలువ ఎంత పెరిగిందో చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ.
అసలైన ఐరనీ!
ప్రపంచవ్యాప్తంగా సినిమాలు, సిరీస్‌లను కోట్లాది మంది ప్రేక్షకులకు నిరంతరం అందించే ఓటీటీ దిగ్గజం Netflix… తన కార్యాలయంలో ఉన్న ఒక సినిమా కాపీ భద్రతపై ఇప్పుడు ప్రశ్నలు ఎదుర్కొంటుండటమే ఈ కథలోని ప్రధాన ఐరనీ!
చివరికి…
ఈ కేసులో గెలిచేది నిర్మాతనా… Netflixనా… అనేది కోర్టు తేల్చుతుంది. కానీ ఈ ఘటన ఇప్పటికే సినిమా పరిశ్రమకు ఒక హెచ్చరిక ఇచ్చింది. సినిమా పూర్తయ్యాక అసలు ప్రయాణం థియేటర్లో కాదు… ఒక డిజిటల్ ఫైల్లో మొదలవుతోంది. ఆ ఫైల్ భద్రత ఇప్పుడు కెమెరా, నటీనటులు, భారీ సెట్లంతే కీలకంగా మారింది.
ఒకప్పుడు సినిమాను కాపాడేందుకు స్టూడియోలకు తాళాలు వేసేవారు. ఇప్పుడు… ఒక చిన్న స్టోరేజ్ డ్రైవ్‌ను కాపాడలేకపోతే వందల కోట్ల విలువ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ కథ ఒక హార్డ్‌డిస్క్ దొంగతనం గురించి కాదు. డిజిటల్ యుగంలో ‘నమ్మకం’ కూడా కోట్ల రూపాయల విలువైన ఆస్తిగా మారిపోయిందని గుర్తు చేసిన ఘటన గురించి.








