రహానేకి వచ్చే పెన్షన్ ఎంత..? రూల్స్ఏంటి..?
భారత సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే(Rahane) అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అతను తీసుకునే పెన్షన్ ఎంత అనే దానిపై చర్చ మొదలైంది. తాజాగా జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బీసీసీఐ పెన్షన్ స్కీమ్ కింద అతను ప్రతి నెల పెన్షన్ పొందేందుకు అర్హత సాధించాడు. విదేశీ గడ్డపై నమ్మకమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న రహానే, 2020-21లో ఆస్ట్రేలియాలో భారత్ కు చారిత్రాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని అందించి కెప్టెన్ గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు.
జూలై 30న అతను క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. భారత జట్టు(Team India) తరఫున రహానే 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్ లు ఆడాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం 75 అంతకంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్ లు ఆడిన మాజీ క్రికెటర్లు అత్యున్నత పెన్షన్ స్లాబ్ కు అర్హులవుతారు. దీని ప్రకారం రహానేకు ఇకపై ప్రతి నెల రూ. 70,000 పెన్షన్ రూపంలో అందుతుంది. గతంలో ఈ పెన్షన్ మొత్తం రూ. 50,000 ఉండగా, సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాజీ ఆటగాళ్ల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని దీనిని రూ. 70,000 కి పెంచారు.
అయితే బీసీసీఐ పెన్షన్ నిబంధనల ప్రకారం ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది. రిటైర్మెంట్ తర్వాత రహానే భవిష్యత్తులో బీసీసీఐతో ఎలాంటి అధికారిక పదవుల్లో అంటే.. ఉదాహరణకు కోచ్, సెలెక్టర్ లేదా అడ్మినిస్ట్రేటర్ వంటి జీతం పొందే బాధ్యతలలో.. కొనసాగనంత కాలం మాత్రమే ఈ పెన్షన్ నిరంతరాయంగా అందుతుంది. ఒకవేళ బోర్డులో ఏదైనా అధికారిక పదవిని చేపట్టి శాలరీ తీసుకోవడం ప్రారంభిస్తే, ఆ కాలానికి ఈ పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ప్రస్తుతం తను యువ క్రికెటర్లకు మెంటార్‌గా వ్యవహరిస్తూ భారత క్రికెట్ భవిష్యత్తుకు తన వంతు సహాయం చేయాలని భావిస్తున్నాడు.








