తెలుగు ప్రజలు రాజకీయంగా మరింత చురుకైన పాత్ర పోషించాలి: అరుణా మిల్లర్
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా ఘనంగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు, యూత్ కన్వెన్షన్లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు విచ్చేసిన వారందరినీ ఆప్యాయంగా “నమస్కారం” అంటూ ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అమెరికాలో మొట్టమొదటి బ్లాక్ గవర్నర్ ఉన్న ఏకైక రాష్ట్రం , దేశంలోనే తెలుగు మూలాలు ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్న ఏకైక రాష్ట్రం మేరీల్యాండ్ మాత్రమేనని ఆమె ఎంతో గర్వంగా పేర్కొన్నారు. మేరీల్యాండ్ రాష్ట్రంలో ఆటా మహాసభలు జరగడం ఇదే తొలిసారి అని, ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన అతిథులకు స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ 19వ ఆటా కన్వెన్షన్ విజయవంతం కావడానికి అంకితభావంతో అహర్నిశలు కృషి చేస్తున్న ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా , కన్వీనర్ శ్రీధర్ బానాల ఆమె ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు సంఘాన్ని ఏకం చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి వారు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. అలాగే ఈ వేడుకల నిర్వహణకు ఉదారంగా తోడ్పడుతున్న హై-లెవెల్ డోనర్స్, గ్రాండ్ స్పాన్సర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, భారత్ నుండి విచ్చేసిన ప్రముఖ అతిథులకు తన కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు ప్రజల విజయాలపై…
ఈ సందర్భంగా తెలుగు జాతి అమెరికా గడ్డపై సాధించిన అద్భుత విజయాలను అరుణా మిల్లర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలుగు ప్రజలు వ్యాపారవేత్తలు, వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ప్రముఖ కళాకారులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా, సమాజానికి తిరిగి ఎంతో సేవ అందిస్తున్నారని తెలిపారు.
అయితే భవిష్యత్తును మరింత సురక్షితంగా, ఉజ్వలంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ అమెరికాలో రాజకీయంగా, పౌరులుగా చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మన విలువలను ప్రతిబింబించే నాయకులకు మద్దతు ఇస్తూ, తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవచ్చని చెప్పారు. అమెరికాలో తెలుగు జాతి విజయాల ప్రస్థానం కేవలం ఆర్థిక విజయాలతోనే ఆగిపోకుండా, అత్యున్నత నాయకత్వ స్థానాల్లోకి, ప్రజా సేవలోకి మరింత విస్తరించాలని ఆమె ఆకాంక్షించారు.








