చైనా మిలిటరీ వెపన్స్ వెనుక… అమెరికా AI? షాకింగ్ పవర్ గేమ్!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
“కమ్యూనికేషన్ డౌన్!”
కంట్రోల్ రూమ్‌లో ఒక్కసారిగా అలారం మోగింది.
యుద్ధభూమితో సంబంధం పూర్తిగా తెగిపోయింది. రాడార్లు పనిచేయడం లేదు. GPS సిగ్నల్స్ లేవు. కమాండర్ ఆదేశాలు డ్రోన్‌కు చేరడం లేదు. కానీ ఆకాశంలో మాత్రం అది ఇంకా ఎగురుతోంది.
కొద్దిసేపు నిశ్శబ్దం.
ఇక మిషన్ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ… డ్రోన్ ఆగలేదు. కింద కనిపిస్తున్న ప్రతి కదలికను అది స్వయంగా విశ్లేషించింది. ఎవరు శత్రువు? ఎక్కడ దాడి చేయాలి? ఎప్పుడు దాడి చేయాలి? ప్రతి నిర్ణయాన్నీ అదే క్షణాల్లో తీసుకుంది. మనిషి ఆదేశాలతో కాదు… తన AI మెదడుతో.
ఇప్పటివరకు ఇది హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించే దృశ్యం. కానీ ప్రపంచంలోని అతిపెద్ద సైన్యాలు ఇప్పుడు అలాంటి యుద్ధాలకే సిద్ధమవుతున్నాయని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే…ఆ డ్రోన్‌కు ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఈ కథలోని అసలు ట్విస్ట్.
మెదడు అమెరికాది… శరీరం చైనాది
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన AI మోడళ్లను రూపొందించింది అమెరికా. OpenAI…Anthropic… ఇలాంటి కంపెనీలు కోట్లాది డాక్యుమెంట్లు, పుస్తకాలు, పరిశోధనలు, డేటాతో AIకి ఆలోచించడం, విశ్లేషించడం, సమాధానాలు ఇవ్వడం నేర్పించాయి. కానీ ఇప్పుడు ఆ సామర్థ్యాన్ని మరో దేశం తన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకుంటోందని రాయిటర్స్ పరిశీలించిన పరిశోధనా పత్రాలు సూచిస్తున్నాయి.
అమెరికా తయారు చేసిన AIని చైనా నేరుగా తన సైనిక వ్యవస్థల్లో పెట్టడం లేదు. అలా చేయడం దాదాపు అసాధ్యం కూడా. అయితే మరి అమెరికా AI తెలివి చైనా దగ్గరకు ఎలా చేరుతోంది?
ఒక గురువు… వందల మంది శిష్యులు
ఒక విద్యార్థి గొప్ప గురువు దగ్గర చదువుకుంటాడు. ఆ గురువు ప్రతి సమస్యను ఎలా పరిష్కరిస్తాడో గమనిస్తాడు. తర్వాత ఇంటికి వెళ్లి, తన మాటల్లో, తన పద్ధతిలో అదే విషయాన్ని మళ్లీ నేర్చుకుంటాడు. AI ప్రపంచంలో దీనినే మోడల్ డిస్టిలేషన్ అంటారు. భారీ AI మోడల్ ఇచ్చే సమాధానాలు, విశ్లేషణలు, తార్కిక విధానాన్ని ఉపయోగించి… చిన్న దేశీయ AI మోడల్‌కు శిక్షణ ఇవ్వడం.
చైనా చేస్తోంది.. అమెరికన్ AIని కాపీ చేయడం కాదు. అది ఎలా ఆలోచిస్తుందో నేర్చుకుని, అదే స్థాయి సామర్థ్యాన్ని తమ సొంత వ్యవస్థలో నిర్మించేందుకు ప్రయత్నించడం. రాయిటర్స్ పరిశీలించిన 80కిపైగా చైనా పరిశోధనా పత్రాలు, పేటెంట్లలో ఇలాంటి విధానాల ప్రస్తావన కనిపించింది.
తర్వాత ఆ AIతో ఏం చేస్తున్నారు?
ఇక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. చైనా పరిశోధకుల లక్ష్యం చాట్‌బాట్ తయారు చేయడం కాదు. యుద్ధం చేసే AIని తయారు చేయడం. చైనా National University of Defense Technology కు చెందిన పరిశోధనల్లో, భారీ AI మోడళ్ల సామర్థ్యాలను చిన్న మోడళ్లుగా మార్చి డ్రోన్లలో ఉపయోగించే దిశగా అధ్యయనాలు జరిగాయని ప్రస్తావించారు.
ఇక్కడే అమెరికాకు అసలు టెన్షన్
ఈ పరిణామాన్ని చాలామంది ఒక సామెతతో పోలుస్తున్నారు. “తన వేలితోనే తన కంటిని పొడుచుకున్నట్లు.”
ఎందుకంటే… AI విప్లవానికి నాయకత్వం వహించింది అమెరికా. అత్యాధునిక AI మోడళ్లను అభివృద్ధి చేసింది కూడా అమెరికన్ కంపెనీలే. కానీ ఇప్పుడు అదే సాంకేతిక సామర్థ్యాల నుంచి నేర్చుకున్న పద్ధతులను ఉపయోగించి, ప్రత్యర్థి దేశం తన సైనిక AIని మరింత బలోపేతం చేసుకుంటోందనే చర్చ మొదలైంది. ఇది అమెరికా ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదు.
కానీ ప్రపంచానికి అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక AI సామర్థ్యాలు, చివరికి భౌగోళిక రాజకీయ పోటీలో కొత్త రూపం దాల్చుతున్నాయనే ఆందోళన మాత్రం పెరుగుతోంది.
షీ జిన్‌పింగ్ ఆదేశం ఏమిటి?
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చాలా కాలంగా ఒక లక్ష్యాన్ని స్పష్టంగా చెబుతున్నారు. 2027 నాటికి ప్రపంచంలో అత్యంత ఆధునిక “ఇంటెలిజెంట్ మిలిటరీ”ని నిర్మించాలి. అంటే… AI… స్వయంచాలక డ్రోన్లు… మానవరహిత యుద్ధ వ్యవస్థలు…డేటాతో నిర్ణయాలు తీసుకునే ఆయుధాలు… ఇవన్నీ చైనా భవిష్యత్తు సైన్యంలో కీలక భాగాలుగా మారాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వెలుగులోకి వస్తున్న పరిశోధనా పత్రాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రపంచం ఎందుకు భయపడుతోంది?
ఒకప్పుడు ఆయుధాలను నియంత్రించవచ్చు. అణు బాంబుల సంఖ్యను లెక్కించవచ్చు.క్షిపణుల పరిధిని అంచనా వేయవచ్చు. కానీ AIకి సరిహద్దులు ఉండవు. ఒకసారి ఆలోచించే పద్ధతి నేర్చుకున్న తర్వాత… అదే సామర్థ్యం కొత్త మోడళ్లలో, కొత్త దేశాల్లో, కొత్త యుద్ధ వ్యవస్థల్లో కనిపించవచ్చు. అందుకే నిపుణులు ఇప్పుడు ఆయుధాల పోటీ కంటే AI పోటీనే మరింత ప్రమాదకరంగా చూస్తున్నారు. రేపటి యుద్ధంలో మొదటి బుల్లెట్ కాల్చేది ఎవరో కంటే…మొదటి నిర్ణయం తీసుకునేది ఎవరో అన్నదే పెద్ద ప్రశ్నగా మారుతోంది.
కంక్లూజన్
ఒకప్పుడు ప్రపంచాన్ని మార్చేస్తుందని AIని ఆహ్వానించారు. ఉద్యోగాలు సులభమవుతాయని…వైద్యం మెరుగవుతుందని… విద్య అందరికీ చేరుతుందని…ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అవి ఇప్పటికీ నిజమే. కానీ అదే AI ఇప్పుడు ప్రపంచ సైనిక సమీకరణాలను కూడా మార్చే శక్తిగా మారుతోంది.
అమెరికా రూపొందించిన అత్యాధునిక AI సామర్థ్యాల నుంచి నేర్చుకుంటూ, చైనా తన భవిష్యత్తు యుద్ధ వ్యవస్థలను మరింత తెలివైనవిగా మార్చేందుకు ప్రయత్నిస్తోందనే సంకేతాలు ఇప్పుడు ప్రపంచాన్ని కొత్త ప్రశ్న ముందు నిలబెట్టాయి.
రేపటి యుద్ధాల్లో గెలిచేది ఎక్కువ ట్యాంకులు ఉన్న దేశం కాదు… ఎక్కువగా ఆలోచించే AI ఉన్న దేశమా? ప్రస్తుతం ప్రపంచం ఎదురుచూస్తున్న సమాధానం అదే.








