E.T. సినిమా: స్పీల్‌బర్గ్‌కు ఆ శాస్త్రవేత్తే స్ఫూర్తి. ఆయన రీసెర్చ్ తెలిస్తే మైండ్ బ్లాక్!?
ఆ రోజు…
చీకటిని చీల్చుకుంటూ ఆకాశం నుంచి ఓ భారీ కాంతి నెమ్మదిగా కిందికి దిగుతోంది…
వందలాది మంది ఊపిరి బిగపట్టి చూస్తున్నారు.
ఆ కాంతి మరింత దగ్గరపడుతోంది…
అది విమానం కాదు. హెలికాప్టర్ కాదు. భూమిపై ఎవరూ చూడని ఓ వింత వాహనం.
కొన్ని క్షణాల తర్వాత… ఆ UFO తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల నుంచి ఓ వింత జీవి బయటకు అడుగుపెట్టింది. దాని ఎదురుగా… భయంతో కాదు, ఆశ్చర్యంతో నిలబడి ఉన్న మనుషులు.
సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప సైన్స్ ఫిక్షన్ సన్నివేశాల్లో ఒకటి ఇది.
గుర్తుచ్చిందా…స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన ‘Close Encounters of the Third Kind’ క్లైమాక్స్.
అయితే అందరూ అనుకుంటున్నట్లు ఆ సన్నివేశం పుట్టింది స్పీల్బర్గ్ ఊహలో కాదు. ఆ విజువల్స్ కు విత్తనం వేసింది…హాలీవుడ్ రచయిత కాదు. మరే సినీ దర్శకుడు కాదు. అమెరికా ప్రభుత్వానికి పనిచేసిన ఓ ఖగోళ శాస్త్రవేత్త. వేలాది UFO కేసుల మధ్య జీవితం గడిపిన ఆయన చెప్పిన నిజమైన సంఘటనలే… తర్వాత స్పీల్బర్గ్ కెమెరా ముందు ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసిన ఆ దృశ్యాలుగా మారాయి.
ఆ సన్నివేశం ఒక్క రోజులో పుట్టలేదు.
దాని వెనక దాదాపు మూడు దశాబ్దాల అన్వేషణ ఉంది. వేలాది పేజీల నోట్లు ఉన్నాయి. లక్షల ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా… ఒక మనిషి అంతర్మథనం ఉంది. ఆ మనిషి పేరు… జే. అలెన్ హైనెక్.
“UFOలు లేవని నిరూపించాలి… అదే నీ మిషన్!”
ఇక్కడో వింత విషయం తెలుసుకోవాలి. 1948… అమెరికాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఆకాశంలో కనిపిస్తున్న వింత వెలుగులు. గుర్తుతెలియని ఎగిరే వస్తువులు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న భయాన్ని ఆపాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పని కోసం ఖగోళ శాస్త్రవేత్త జే. అలెన్ హైనెక్ను పిలిచింది.
అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆయనకు అప్పగించిన పని నిజాన్ని వెతకడం కాదు. “UFOలు లేవని నిరూపించాలి.” అదే మిషన్. ఎక్కడైనా ఒక UFO కనిపించిందని వార్త వస్తే… ప్రభుత్వ అధికారులు హైనెక్ను పంపేవారు. ఆయన వెళ్లేవారు. సాక్షులను కలిసేవారు. ఆకాశాన్ని పరిశీలించేవారు. తర్వాత మీడియా ముందుకొచ్చి ఒక సమాధానం చెప్పేవారు.
“అది కేవలం గ్రహం వెలుగు.”, “అది వాతావరణ ప్రభావం.”, “అది మెరుపు.”. ఇలా ప్రతి కేసుకీ ఏదో ఒక వివరణ. కానీ ప్రతి వివరణ తర్వాత హైనెక్ మనసులో ఒక కొత్త ప్రశ్న పుట్టేది. ఓ సారి ఇలాగే ఎప్పటిలాగే మైక్ ముందు నిలబడ్డాడు… “అది Swamp Gas” అన్నాడు!అక్కడ నుంచే కథ మలుపు తిరిగింది.
మిచిగన్ రాష్ట్రం.
వందలాది మంది ఒకేసారి ఆకాశంలో ఒక వింత కాంతిని చూశామని చెప్పారు. దేశమంతా ఉత్కంఠ. కెమెరాలన్నీ హైనెక్ వైపు తిరిగాయి. ఆయన మైక్ ముందు నిలబడ్డాడు. కొన్ని క్షణాలు ఆగాడు. తర్వాత అన్నాడు… “అది Swamp Gas.” చిత్తడి నేలల నుంచి వచ్చిన వాయువు. అంతే. మరుసటి రోజు…అమెరికా మొత్తం నవ్వుకుంది. పత్రికలన్నీ కార్టూన్లతో నిండిపోయాయి. టీవీ చర్చల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఒక్క సంఘటన… ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
కెమెరాకు చిక్కని ఆ సాక్ష్యాలు… కలం పట్టిన నిజాయితీ!
ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం ఆయనకు నరకంలా అనిపించింది. పైలట్లు, ఆర్మీ ఆఫీసర్లు, నిరుపేద రైతులు… కళ్లల్లో నిజమైన భయంతో వాళ్లు చెబుతున్న విషయాలు హైనెక్ను రాత్రిళ్లు నిద్రపోనివ్వలేదు. 1973లో ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
సొంతంగా CUFOS (Center for UFO Studies) అనే విచారణ సంస్థను ప్రారంభించాడు. “ఇకపై ఎవరూ దాచాల్సిన పనిలేదు… మీ అనుభవాలను ధైర్యంగా చెప్పండి” అని ప్రపంచానికి పిలుపునిచ్చాడు. కొద్ది రోజుల్లోనే ఆయన టేబుల్ మీద 60,000 పైగా కేసులు వచ్చి పడ్డాయి. ఆ కేసులను క్రమబద్ధీకరించడానికి ఆయన తయారుచేసిన కోడే… “హైనెక్ స్కేల్”.
నోక్టర్నల్ లైట్స్: రాత్రివేళ కనిపించే కాంతులు
డేలైట్ డిస్క్స్: పగటిపూట కనిపించే వింత ఆకారాలు
రాడార్-విజువల్: రాడార్లకు మాత్రమే చిక్కే ఆధారాలు
CE1 (మొదటి రకం): దగ్గరగా చూడటం
CE2 (రెండో రకం): కార్ల ఇంజిన్లు ఆగిపోవడం, నేల కాలిపోవడం వంటి భౌతిక ఆధారాలు
CE3 (మూడో రకం): ఏలియన్లను నేరుగా చూడటం లేదా మాట్లాడటం!
ఈ ఆరో రకానికి ఆయన పెట్టిన పేరే… “Close Encounters of the Third Kind”.
స్పీల్బర్గ్ చేతికి చిక్కిన ఆ పుస్తకం..
1975… హాలీవుడ్లో ఒక యంగ్ డైరెక్టర్ ఏలియన్లపై పెద్ద సినిమా తీయాలని రాత్రింబవళ్లు స్క్రిప్ట్ రాస్తున్నాడు. ఆయనే స్టీవెన్ స్పీల్బర్గ్. ఆ టైమ్‌లోనే హైనెక్ రాసిన “The UFO Experience” పుస్తకం స్పీల్బర్గ్ చేతికి చిక్కింది. అందులోని ప్రతీ పేజీ చదువుతుంటే స్పీల్బర్గ్ ఒళ్లు గూస్‌బంప్స్‌తో పులకరించిపోయింది.
వెంటనే హైనెక్కు ఫోన్ చేశాడు. “మీ పుస్తకంలోని ఆ ‘విభాగం పేరు’ నా సినిమా టైటిల్ కాబోతోంది” అని చెప్పి $1,000 చెల్లించి హక్కులు కొనుగోలు చేశాడు. అంతేకాదు… హైనెక్ను ఆ సినిమాకు అధికారిక UFO సలహాదారుడిగా సెట్లోకి ఆహ్వానించాడు.
ఆసక్తికరమైన విషయం:
1977లో విడుదలైన ఆ సినిమా ముగింపు సీన్లో… ఆకాశం నుంచి దిగొచ్చిన ఏలియన్ల వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నోటితో పైప్ పొగ వదులుతున్న ఒక వృద్ధ శాస్త్రవేత్త కనిపిస్తాడు. ఆయన ఏ నటుడో కాదు… స్వయంగా జే. అలెన్ హైనెక్!
ఒక రద్దయిన హారర్ సీన్… ‘E.T.’ అనే అద్భుతంగా మారిన వేళ!
హైనెక్ ఫైళ్లలో ఉన్న మరొక కేసు స్పీల్బర్గ్ను బాగా ఆకర్షించింది. 1955లో కేంటకీలోని ఒక ఫామ్‌హౌస్‌పై వింత జీవులు దాడి చేసిన “కెల్లీ-హాప్కిన్స్విల్లే” ఘటన అది. దాన్ని ఆధారంగా చేసుకుని స్పీల్బర్గ్ మొదట ‘Night Skies’ అనే భయానక హారర్ సినిమా తీయాలనుకున్నాడు. అయితే హైనెక్ సేకరించిన వేలాది కథల్లోని మానవీయ కోణాన్ని చూశాక స్పీల్బర్గ్ ఆలోచన మారింది.
“ఏలియన్లు అంటే కేవలం భయపెట్టే రాక్షసులు మాత్రమే కాదు… మనలాగే ప్రేమించే జీవులు కూడా కావచ్చు కదా?” . ఆ చిన్న మార్పే… ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత ఎక్కువ వసూళ్లు సాధించిన ‘E.T. the Extra-Terrestrial (1982)’ గా అవతరించింది. ఆ సినిమాలో కనిపించే చిన్నపిల్లల మైత్రి, రాత్రి పూట కాంతివంతంగా వెలిగే వాహనాలు, సిగ్నల్ వ్యవస్థలు… అన్నీ హైనెక్ తన డైరీలో నమోదు చేసిన నిజమైన UFO అనుభవాల ప్రతిరూపాలే!
గెలిచిన నిజాయితీ!
ఒకప్పుడు ప్రభుత్వం చేతిలో ఒక పావుగా మారి… “UFOలు లేవు” అని ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నించిన ఒక శాస్త్రవేత్త… చివరికి ప్రపంచం ఏలియన్ల గురించి ఆలోచించే విధానాన్నే మార్చేశాడు. జే. అలెన్ హైనెక్ సేకరించిన ఆ ఒక్కొక్క కేసే లేకపోతే… ఈరోజు స్పీల్బర్గ్ లేదు, Close Encounters లేదు, మన జ్ఞాపకాల్లో పదిలంగా ఉన్న E.T. అసలే లేదు!
సత్యం ఎప్పుడూ చీకటిలోనే ఉండిపోదు… ఏదో ఒక రోజు వెలుగును చీల్చుకుంటూ బయటకు వస్తుంది అనడానికి హైనెక్ జీవితమే అతిపెద్ద సాక్ష్యం! కాదంటారా?








