డీఎస్సీ ఆరోపణలపై జగన్ తో బహిరంగ చర్చకు నేను సిద్ధం : మంత్రి లోకేశ్
వైసీపీ హయాంలో లిక్కర్, భూకుంభకోణాలపై కూడా చర్చిద్దాం
అభివృద్ధి – సంక్షేమం మా సిద్ధాంతం, విధ్వంసం, బూతులు గొడ్డలిపార్టీ విధానం
స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరుశాతం విజయమే లక్ష్యంగా కేడర్ పనిచేయాలి
కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ వెళ్లి తెలియజేయండి
పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్
పెనమలూరు (విజయవాడ): డీఎస్సీపై గొడ్డలి పార్టీ అధినేత చేస్తున్న ఆరోపణలపై చర్చకు తాను సిద్ధం అని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ జగన్‌కు సవాల్ విసిరారు. కంకిపాడు ఆయాన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ… డీఎస్సీపై ఆరోపణలతోపాటు వైసీపీ హయాంలో లిక్కర్ భూ కుంభకోణాలపై కూడా చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 2లక్షల టీచర్ పోస్టులు భర్తీచేసిన చరిత్ర టీడీపీది అని, ఐదేళ్ల వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేని నీచ చరిత్ర జగన్‌ది అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను అమలుచేసి అత్యంత పారదర్శకంగా డిఎస్సీ నిర్వహిస్తే బురద జల్లుతున్నారు, 150రోజుల్లో విజయవంతంగా డిఎస్సీ నిర్వహిస్తే 150కేసులు వేసి అడ్డుకోవాలని చూశారు, వారు వేసిన కేసులన్నీ గౌరవ న్యాయస్థానాలు కొట్టివేయడం మా చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి, సంక్షేమం అయితే, గొడ్డలి పార్టీ విధానం విధ్వంసం, బూతులు, బాబాయిని గొడ్డలిపార్టీతో లేపేయడం, తల్లి,చెల్లిని ఇంటినుంచి తరిమేయడం. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కేడర్ పై ఉందన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు క్రెడిట్ చోరీ డిజార్డర్ (సీసీడీ) అనే జబ్బు ఉంది. కూటమి ప్రభుత్వం తెచ్చిన ఆర్సెలర్ మిట్టల్, గూగుల్, రాయల్ ఎన్ ఫీల్డ్ పరిశ్రమలను తానే తెచ్చానని చెప్పుకోవడం ఆయనకున్న జబ్బు లక్షణాలని ఎద్దేవా చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తున్నామని, వీటన్నింటినీ పార్టీ కేడర్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేష్ కోరారు.
పసుపుజెండానే మా బలం, బలగం
పసుపుజెండా, కార్యకర్తలు లేకపోతే వేదికపైన ఉన్న మాకు పదవులు లేవు. ప్రతిపక్షంలో ఉండగా ఎత్తిన పసుపుజెండా దించకుండా అహర్నిశలు పార్టీకోసం కష్టపడింది తెలుగుదేశం కార్యకర్తలు. టిడిపి స్థాపించిన ముహూర్తబలం అద్భుతమైంది. ఓడిపోయిన దగ్గరే గెలవడం మనకు కొత్తకాదు. టిడిపి లేకుండా చేస్తామని ప్రగల్బాలు పలికిన వారి పరిస్థితి ఏమైందో మీకే బాగా తెలుసు. దివంగత ఎన్టీఆర్ జన్మించిన గొప్పనేల కృష్ణాజిల్లా. మీ పట్టుదల, పౌరుషం వేరు. యువగళం పాదయాత్రలో వచ్చినపుడు తెల్లవారుజామున 4గంటలవరకు నన్ను నడిపించారు. ఇక్కడి ప్రజలు అర్ధరాత్రి కూడా నాకోసం ఎదురుచూశారు. మీ అభిమానం జీవితాంతం నా గుండెల్లో ఉంటుంది. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం 226రోజులు, 3132 కి.మీ.ల మేర నేను చేపట్టిన యువగళం పాదయాత్రను ముందుండి నడిపించింది కార్యకర్తలే. యాత్రను అడ్డుకోవాలని చూసినపుడు రోడ్డుపైకి వచ్చి నిలబడి వైసిపి సైకోలకు సినిమా చూపించారు. పెనమలూరు నియోజకవర్గంలో 10కి ఆరుసార్లు గెలిచాం. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నిలబడి పోరాడే వ్యక్తి ఎమ్మెల్యే బోడె ప్రసాద్. సత్యనారాయణ అనే సీనియర్ కార్యకర్త ఇంటికి వెళ్లాను. తన కిడ్నీ దెబ్బతింటే ఎమ్మెల్యే ఆర్థికసాయం చేసి కాపాడారని చెప్పారు.
కార్యకర్తే అధినేత నినాదాన్ని చేతల్లో చూపిస్తున్నాం
మారిన కాలానికి అనుగుణంగా 2025 మహానాడులో ఆరుశాసనాలు చేశాం. అందులో నా మనసుకు దగ్గరైంది కార్యకర్తే అధినేత. ఇది మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తున్నాం. చంద్రబాబు, నేను నియోజకవర్గాలకు వెళినపుడు కార్యకర్తలను కలిశాకే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అధ్యక్షుడి పక్కన సామాన్య కార్యకర్తలను కూర్చోబెట్టాం. కేంద్ర, రాష్ట్ర మంత్రులు వేదిక ముందు కూర్చున్నారు. కార్యకర్తే అధినేత అనే సిద్ధాంతాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. ప్రతిపక్షంలో కార్యకర్తల త్యాగాలు చూశాం. తోటచంద్రయ్య మెడపై కత్తిపెట్టి వైసిపికి జైకొట్టమంటే… జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలారు. ఆయన కుమారుడికి చట్టసవరణ చేసి శాశ్వత ఉద్యోగం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలచి, భరోసా ఇచ్చాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి బెదిరింపులను లెక్కచేయకుండా తొడగొట్టి నామినేషన్ వేసిన అంజిరెడ్డి తాత, రక్తమోడుతున్నా పోలింగ్ బూత్ వదలని పల్నాడు మహిళ మంజులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. నా తెలుగుదేశం – నా బాధ్యత అనే నినాదాన్ని అందరూ కలసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలి. బూత్, యూనిట్, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరిలో ఆ భావన రావాలి. కార్యకర్తలంతా కూడా సొంత కాళ్లపై నిలబడి, నాయకులుగా ఎదగాలి.
పనిచేసే వారిని గుర్తించేందుకే మై టిడిపి యాప్ తెచ్చాం
తెలుగుదేశం పార్టీ నాయకులంతా మైటిడిపి యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా 4లక్షలమంది నాయకులు ఉన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకే టెక్నాలజీని అనుసంధానించాం. ప్రమాదంలో చనిపోయిన వారికి 5లక్షలు ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం. వారి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూలులో చదివిస్తున్నాం. ఫ్యాక్షన్ దాడిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను చదివించి ప్రయోజకులను చేశాం. కార్యకర్తల ఆరోగ్యానికి సైతం అత్యంత ప్రాతినిధ్యం ఇస్తున్నాం. కేంద్ర కార్యాలయంలో యూనిట్, బూత్ ఇన్ చార్జిలకు రక్తపరీక్షలు చేయిస్తుంటే 75శాతంమంది షుగర్, బిపి, కొలెస్ట్రాల్ బయటపడుతున్నాయి. ప్రతినియోజకవర్గంలో 3వేలమంది నాయకులకు రక్తపరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇంటికి పంపించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది.
ఇంటింటికీ తెలుగుదేశంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి
నేటినుంచి ప్రారంభమైన ఇంటింటికీ తెలుగుదేశం (డోర్ టు డోర్) కార్యక్రమం ద్వారా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను పట్టుదల, క్రమశిక్షణతో అమలుచేయాలని కోరుతున్నా. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, గొడ్డలి పార్టీ విధ్వంసం, ఫేక్ ప్రచారాలను ప్రజలకు వివరించాలి. టిడిపి, బిజెపి, జనసేన కార్యకర్తల మధ్య ఐక్యత చాలా అవసరం. నాయకులు, కార్యకర్తలంతా రాష్ట్రంలోని ప్రతి గడప తొక్కాలి…. బాగా పనిచేసిన వారిని ఉత్తమ కార్యకర్తగా గుర్తిస్తా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిస్థానాల్లో తిరిగి కూటమి గెలిచేలా కష్టపడాలి. ఆర్థిక ఇబ్బందులున్నా 4వేల పెన్షన్, స్త్రీశక్తి, తల్లికి వందనం, చేనేతలకు ఉచిత విద్యుత్, అన్నక్యాంటీన్లు, దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలెండర్లు వంటి సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నాం. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పెద్దఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి రప్పిస్తున్నాం. అయితే భవిష్యత్ ఎన్నికల్లో విజయానికి సంక్షేమం, అభివృద్ధి ఒక భాగం. ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారితో మమేకం కావాలి. వారితో ఎమోషనల్ కనెక్టివిటీ ముఖ్యం. ప్రజలతో అనుబంధం వల్లే మంగళగిరిలో నేను 91వేలమెజారిటీతో విజయం సాధించానని లోకేష్ వివరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ పాల్గొన్నారు.








