భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగస్ట్ 1న ప్రారంభం అవుతున్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర ప్రగతిలో కీలక మైలురాయి అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభంతో రాష్ట్ర విమానయాన రంగంలో నూతన శకం ప్రారంభం అవుతుందని సీఎం స్పష్టం చేశారు. ఆధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ విమానాశ్రయం ఈ ప్రాంతంలో ప్రయాణ సౌకర్యాలతో పాటు ఉపాధి, పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం ఇస్తుందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రతో పాటు తెలుగు జాతికి గర్వకారణంగా మారనున్న విమానాశ్రయం ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ప్రధాని మోదీకి గిరిజన సంప్రదాయ నృత్యం థింసా, కూచిపూడి నృత్యంతో స్వాగతం పలకాలని అధికారులకు సీఎం సూచించారు. గిన్నిస్ రికార్డు సృష్టించేలా ఎక్కువ మందితో థింసా నృత్య ప్రదర్శన ఉండాలని స్పష్టం చేశారు. అలాగే అరకు కాఫీ సహా స్థానిక పర్యాటకానికి బ్రాండింగ్ జరుగుతుందన్నారు.



ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు విస్తృత ప్రచారం
ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు థీమ్ తో విమానాశ్రయం గురించి ప్రతీ ఇంటా చర్చ జరిగేలా విస్తృత ప్రచారం జరగాలని.. మహిళలు, యువత, పాఠశాల విద్యార్ధులు ఇలా వివిధ వర్గాలకు చేరువయ్యేలా వేర్వేరు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అవుట్ రీజ్ కార్యక్రమాలు, క్విజ్, ఉపన్యాస పోటీలు, ఫ్లాష్ మాబ్ లు, డ్రోన్ షోలను నిర్వహించాలన్నారు. స్థానిక పారిశ్రామిక వేత్తలతోనూ రౌండ్ టేబుల్ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు థీమ్‌తో 3-5కే రన్ లాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వారిని కూడా విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వీక్షించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం జరిగేలా చూడాలని సూచించారు. మరోవైపు విమానాశ్రయం టెర్మినల్ భవనం ప్రారంభించిన అనంతరం ఇంధన, ఉపరితల రవాణా మంత్రిత్వశాఖలకు చెందిన రూ.18 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికారులు వివరించారు.
2.30 గంటల పాటు భోగాపురంలో ప్రధాని పర్యటన
ఆగస్టు 1 తేదీ ఉదయం 10.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబులు స్వాగతం పలకనున్నారు. 10.58 గంటలకు విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం, గవర్నర్ తదితరులతో కలిసి ప్రధాని మోదీ టెర్మినల్ భవనాన్ని పరిశీలించనున్నారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదికకు ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణించనున్న ప్రధాని మోదీకి 13,500 మందికి పైగా గిరిజన మహిళలు, విద్యార్ధులు సంప్రదాయ గిరిజన థింసా నృత్యంతో ఘన స్వాగతం పలకనున్నారు. 11.30 నుంచి 12.55 గంటల వరకూ బహిరంగ సభలో పాల్గొని, అనంతరం ప్రధాని 1.10 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.







