అమెరికాకు ‘ఖైబర్ షెకాన్’ టెన్షన్..ఇరాన్ సరికొత్త క్షిపణి..!
అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధంలో ఇరాన్ ఎప్పటికప్పుడు కొత్త అస్త్రాలను సంధిస్తోంది. వాటిని గుర్తించి, కౌంటర్ ఎటాక్స్ చేసేసరికే పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది. నిన్నటి వరకూ షాహెద్ డ్రోన్లతో అమెరికా,ఇజ్రాయెల్ తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు వాటికి తోడుగా ఓ సరికొత్త క్షిపణిని ఇరాన్ పరిచయం చేసింది. అదే ఖైబర్ షికాన్.. ఇది అత్యుత్తమంగా పనిచేసే చౌకబారు క్షిపణీ వ్యవస్థగా నిపుణులు చెబుతున్నారు.
ఖైబర్ షెకాన్..!
ఖైబర్ షెకాన్ (Kheibar Shekan). దీని రేంజి 1,400 కిలోమీటర్లు. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై జరిగిన భీకర దాడుల్లో ఈ క్షిపణిదే కీలక పాత్ర. పాత ఇరాన్ (Iran) క్షిపణులతో పోలిస్తే ఇది విభిన్నమైనది. ఘన ఇంధనంతో పనిచేస్తుంది. శత్రువుపై వినియోగించే ముందు.. దీనిలో ఇంధనం నింపాల్సిన అవసరం లేదు. ఫలితంగా వీటిని ట్రక్కులపై లోడ్ చేసి.. వేగంగా తరలించి శత్రువుపై దాడి చేయవచ్చు. దీంతో ఇరాన్ క్షిపణి లాంఛర్ల కోసం ప్రత్యర్థుల యుద్ధ విమానాలు వెతికే వేళ త్వరగా తప్పించుకొనే అవకాశం ఉంది.
యుద్ధ సమయంలో కొన్ని ఖైబర్ క్షిపణులను కూల్చినా.. ఇరాన్ ప్రత్యేకమైన ఫ్లైట్పాత్లు, కదలికలు, స్పీడ్‌తో వీటిని అమెరికాకు దొరక్కుండా చేస్తోంది. దీనికి తోడు కొన్ని వేరియంట్లకు ముక్కు భాగంలో ఇరాన్ చిన్న ఇంజిన్లను అమర్చుతోంది. ఇది క్షిపణి దాడి చేయాల్సిన లక్ష్యం దగ్గరయ్యే కొద్దీ దిశను మార్చుకోవడానికి ఉపయోగపడటంతో పాటు.. వేగాన్ని గంటకు 10,000 కిలోమీటర్లకు తీసుకెళుతోంది. ఈ క్షిపణులను అటాక్ డ్రోన్లు, మరికొన్ని మిసైల్స్‌తో కలిపి ఇరాన్ వాడుతోంది.
యుద్ధం ప్రారంభం నాటికి ఇరాన్ వద్ద సుమారు 2,500 ఖైబర్ షెకాన్ క్షిపణులు, ఇతర మిసైల్స్ ఉన్నాయని అమెరికా అంచనావేసింది. వీటితోపాటు అండర్ గ్రౌండ్ ఆయుధ కేంద్రాల్లో మరిన్ని అసెంబ్లింగ్ చేస్తున్నట్లు భావిస్తున్నారు. కాకపోతే.. క్షిపణి ఇంజిన్ల ఉత్పత్తి కేంద్రాన్ని మాత్రం అమెరికా ధ్వంసం చేసింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ వినియోగించే క్షిపణులతో పోలిస్తే దీని ధర కూడా చాలా చౌక అని ఆయుధ నిపుణులు వెల్లడిస్తున్నారు.








