క్లాసిక్ రీమేక్? చూస్తే అది పెద్ద మేకు,కలెక్షన్స్ మాత్రం టాప్,అసలేం జరుగుతోంది?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మన చిన్నతనంలో చూసి పరవశించిపోయిన ‘మాయాబజార్’ లాంటి ఆల్-టైమ్ క్లాసిక్‌ను ఇప్పుడు మళ్లీ రీమేక్ చేసారు. ఆహా అని మురిసిపోయాం. అయితే అందులో ఉన్న అసలైన మ్యాజిక్, ఎమోషన్ అంతా తీసేసి… కేవలం కృత్రిమమైన గ్రాఫిక్స్ పెట్టి వదిలారని అర్దమైంది. అప్పుడు మీకేమనిపిస్తుంది? ప్రాణం నీరైపోతుంది కదూ!
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా 90s కిడ్స్‌లో సరిగ్గా ఇదే ఆవేదన నడుస్తోంది.
25 ఏళ్ల క్రితం థియేటర్లలో ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తి, విజిల్స్ వేయించిన సంచలనం గుర్తుందా? అదే… ‘షోలిన్ సాకర్’ (Shaolin Soccer). ఫుట్‌బాల్‌ను సూపర్ హీరో స్థాయికి తీసుకెళ్లి, మార్షల్ ఆర్ట్స్‌తో గాలిలో ఎగిరే విన్యాసాలు చేయించిన స్టీఫెన్ చౌ మ్యాజిక్ అది! ఫుట్‌బాల్, మార్షల్ ఆర్ట్స్, కడుపుబ్బ నవ్వించే కామెడీ, గుండెను పిండేసే ఎమోషన్… వీటన్నింటినీ కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని చూపించిన కల్ట్ క్లాసిక్. దర్శకుడు స్టీఫెన్ చౌ ఆ రోజుల్లో చేసిన ఆ మ్యాజిక్ ఒక ట్రెండ్ సెట్టర్.
దాదాపు 25 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే కాన్సెప్ట్‌ను ‘Kung Fu Soccer’ పేరుతో మన ముందుకు తెచ్చారు. కానీ ఈసారి ప్రేక్షకులు థియేటర్లలో చప్పట్లు కొట్టలేదు… తలలు పట్టుకున్నారు! “ప్రపంచాన్ని షేక్ చేసిన ఒక క్లాసిక్‌ను ఎందుకు ఇలా చంపేశారు?” అని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.
₹500 కోట్ల బడ్జెట్… కానీ AI వీడియోలాంటి గ్రాఫిక్స్!
ఒక క్లాసిక్ సినిమాను రీమేక్ చేయడం పెద్ద రిస్క్… కానీ దాన్ని పాత PS2 వీడియో గేమ్ లాగా, ఓ AI Slop (కృత్రిమమైన ఏఐ వీడియో)లా కనిపించేలా చేయడం అంతకంటే పెద్ద ఘోరం!
ఈ కొత్త ‘కుంగ్ ఫూ సాకర్’ (Kung Fu Soccer)లో ఉమెన్స్ టీమ్‌ను మెయిన్ లీడ్‌గా పెట్టారు. మెయిన్ లీడ్స్, కాన్సెప్ట్ వరకు బాగానే ఉన్నా, అసలు ప్రాణం పోయాల్సిన చోటే సినిమా దారుణంగా దెబ్బతింది.
రియాలిటీ మిస్సైంది: పాత ‘షోలిన్ సాకర్’లో యాక్టర్స్ నిజమైన స్టంట్స్ చేసి కామెడీ పండించారు. కానీ ఈ కొత్త సినిమాలో స్టేడియం దృశ్యాలు, సాకర్ మ్యాచ్‌లను కేవలం గ్రీన్ స్క్రీన్ల ముందే షూట్ చేశారు.
అసలు ఈ కొత్త సినిమాలో కథ ఏముంది? ఎక్కడ తేడా కొట్టింది? జనం బాగా లేదంటున్నా కలెక్షన్లు ఎలా వస్తున్నాయి?
అసలు కథేంటి?
‘ఎమెయ్’ (Emei) అనే మార్షల్ ఆర్ట్స్ ఆశ్రమానికి చెందిన కొందరు ఆడవాళ్లు ఒక ఫుట్‌బాల్ టీమ్‌గా ఏర్పడతారు. 40 ఏళ్ల వయసుకు దగ్గర పడుతున్న శ్వాంగ్ (జాంగ్ జియావోఫీ) ఈ జట్టుకు కెప్టెన్. ఆమె కోచ్‌గా వ్యవహరిస్తుంటుంది. గతంలో పెళ్లి కోసం జట్టును వదిలేసి వెళ్లిన జేడ్ (దిల్రాబా దిల్మురాత్) మళ్లీ టీమ్‌లోకి తిరిగి వస్తుంది.
వీరిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు, పగలు ఒకవైపు… జట్టులోని మిగతా సభ్యుల బ్రేకప్‌లు, సమస్యలు మరోవైపు! వీరి మెంటార్ ఎక్స్ ఫెంగ్ (లే జాంగ్) ప్రోత్సాహంతో, ఈ మహిళా టీమ్ తమ వద్ద ఉన్న అపూర్వమైన మార్షల్ ఆర్ట్స్ విద్యలను ప్రొఫెషనల్ సాకర్ మ్యాచ్‌లలో ఎలా ఉపయోగించింది? భౌతిక శాస్త్ర నియమాలను (Physics-defying) విరుద్ధంగా గాలిలో తేలుతూ ఎగిరే విన్యాసాలతో అంతర్జాతీయ ఉమెన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో మిగతా జట్లను ఓడించి కప్పు ఎలా గెలిచారనేదే ఈ సినిమా కథ.
వినడానికి బాగానే ఉంది కదా? కానీ అసలు లొసుగులన్నీ థియేటర్లో సినిమా మొదలయ్యాకే బయటపడ్డాయి.
Original vs Remake: అసలు ఎక్కడ తేడా కొట్టింది?
ఈ సినిమాకి పెద్ద మైనస్ కథ కాదు… దాన్ని స్క్రీన్ మీద చూపించిన విధానం! పాత ‘Shaolin Soccer’లో ప్రతి క్యారెక్టర్ వెనుక ఒక గుండెను తాకే బాధ ఉంటుంది. జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయిన మనుషులంతా కలిసి ఎలా గెలిచారనే ఆ ఎమోషనే ఆ సినిమాకి ప్రాణం. కానీ ఈ కొత్త సినిమాలో ఆ ఫీల్ అసలు వెతికినా దొరకదు.
క్యారెక్టర్లు వస్తాయి…నాలుగు డైలాగులు కొడతాయి..మ్యాచ్ మొదలవుతుంది. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ స్టార్ట్ అవుతాయి. సినిమా అయిపోతుంది. మన మనసు ఏ పాత్రకీ కనెక్ట్ అవ్వదు, వాళ్ల గెలుపోటములతో మనం ప్రయాణం చేయలేం.
ఫ్యాన్స్‌కి నచ్చని అసలు విషయం ఇదే…
ఈ సినిమా చూసొచ్చిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఒకటే:
“మాకేం కొత్త కథ అక్కర్లేదు సామీ… ఆ పాత సినిమాలో ఉన్న మ్యాజిక్, ఆ ఎమోషన్ ఉంటే చాలు.” సరిగ్గా అదే ఈ సినిమాలో మిస్సయింది.
Reddit, IMDbలలో నెటిజన్లు ఏమంటున్నారు?
Reddit, Letterboxd, IMDb వంటి అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌లలో పాత ‘షోలిన్ సాకర్’ అభిమానులు దారుణమైన రివ్యూలు ఇస్తున్నారు. “స్టీఫెన్ చౌ శైలి నటన, దర్శకత్వంలో ఉండే ఆ వింటేజ్ మ్యాజిక్ ఎటుపోయింది?” అని ప్రశ్నిస్తున్నారు. చైనీస్ సోషల్ మీడియా సైట్లలో కూడా “ఇది సినిమా కాదు, కలెక్షన్ల కోసం నోస్టాల్జియాను అమ్ముకోవడానికి చేసిన డెమో వీడియో” అని ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.
2001లో మనం చూసింది కంప్యూటర్ గ్రాఫిక్స్ కాదు… స్టీఫెన్ చౌ ఆలోచనల్లోంచి వచ్చిన ప్యూర్ మ్యాజిక్! కానీ ఈసారి ఆ ఊహాశక్తి స్థానంలో కేవలం నిస్సారమైన కంప్యూటర్ ఎఫెక్ట్స్ (VFX) ఎక్కువైపోయాయి.
పెద్ద పెద్ద స్టేడియంలు, మ్యాచ్‌లు, ఫైట్లు… అన్నీ గ్రాండ్‌గా డిజైన్ చేశారు. కానీ అవేవీ కంటికి నిజంగా అనిపించవు. కొన్ని సీన్లు చూస్తుంటే పాతకాలపు వీడియో గేమ్ ఆడుతున్నట్లు ఉంటే, మరికొన్ని సీన్లు ఏఐ (AI)తో చేసిన వీడియోల్లా అనిపిస్తాయి.
ఫుట్‌బాల్ లవర్స్ ఎందుకు అప్సెట్ అయ్యారు?
ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కామెడీ సినిమాయే అయినా… ఇందులో స్పోర్ట్స్ ఆత్మ మిస్సయింది. ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ అంటే ఉండే ప్లానింగ్, మైండ్ గేమ్స్, ఆ టెన్షన్, టీమ్ వర్క్ ఏమీ ఉండవు. ఎవరో ఒకళ్లు బంతిని ఉన్న పళంగా బలంగా తన్నడం… ఆ బంతి నిప్పులు చెరుగుతూ గాలిలో ఎగరడం…చివరికి గోల్ పడిపోవడం.
మొత్తం సినిమా అంతా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఆఖరికి క్లైమాక్స్ షాట్ కూడా కనీస ఫుట్‌బాల్ రూల్స్ పట్టించుకోకుండా తీసేయడంతో స్పోర్ట్స్ లవర్స్ తీవ్రంగా నిరాశపడ్డారు.
మరి కలెక్షన్లు ఎలా వస్తున్నాయి?
బాక్స్ ఆఫీస్ పరంగా ఈ సినిమా జూలై 17–19 వారాంతంలో $73.7 మిలియన్లు వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది. మొదటి తొమ్మిది రోజుల్లో $214.3 మిలియన్ల భారీ వసూళ్లు సాధించింది.
అవును, కలెక్షన్లు వస్తున్నాయి… కానీ “స్టీఫెన్ చౌ మార్క్ ఎక్కడ?” అన్న అభిమానుల అసంతృప్తి ముందు ఈ నంబర్లు చిన్నవిగా మారిపోయాయి.
ఇక్కడే ఉంది అసలు మెలిక! ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు సూపర్ హిట్ టాక్ వల్ల వచ్చింది కాదు.
ఆ పాత బ్రాండ్ నేమ్: 25 ఏళ్లుగా ఆ పాత సినిమాని గుండెల్లో పెట్టుకున్న జనం, ఆ ప్రేమతోనే థియేటర్ల బాట పట్టారు.
చైనాలో హాలిడేస్ కలసిరావడం: అక్కడ పండగ సెలవులు ఉండటం, ఫ్యామిలీ ఆడియన్స్ రావడం, స్టీఫెన్ చౌకున్న క్రేజ్ కలెక్షన్లకు ప్లస్ అయ్యాయి.
ఉమెన్ సెంట్రిక్ పబ్లిసిటీ: మహిళల ఫుట్‌బాల్ ప్రాధాన్యత అంటూ చేసిన ప్రచారం ప్రారంభంలో గట్టిగా వర్కవుట్ అయింది.
ఈ కారణాల వల్లనే ఫస్ట్ వీకెండ్ లోనే దాదాపు $73.7 మిలియన్ల (రూ. 600 కోట్లకు పైగా) భారీ వసూళ్లు సాధించింది.
అంటే సినిమా బొత్తిగా బాగోలేదా?
అలా అని తేల్చేయలేం. మెయిన్ లీడ్స్ జాంగ్ జియావోఫీ, దిల్రాబా దిల్మురాత్ తమ క్యారెక్టర్లలో బాగానే చేశారు. గుడ్డి ఫిజియోథెరపిస్ట్ పాత్ర చేసే హాస్యం అక్కడక్కడా బాగానే నవ్విస్తుంది. ఆ కుంగ్ ఫూ కాన్సెప్ట్ ఇప్పటికీ టైమ్‌పాస్‌కి ఓకే అనిపిస్తుంది.
కానీ ఈ సినిమా కొంపముంచింది ‘Shaolin Soccer’ అనే ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాతో దీనికి ఉన్న పోలికే! ఇదొక కొత్త పేరుతో వచ్చిన మామూలు సినిమా అయి ఉంటే జనం ఏమీ అనుకునేవాళ్లు కారు. కానీ ఆ లెజెండరీ సినిమాకి రీమేక్/సీక్వెల్ అనడంతో ప్రతి సీన్‌ని పాత దానితో పోల్చి చూడటం వల్లనే అసలు తేడా కొట్టేసింది.
చివరిగా…
‘Kung Fu Soccer’ ఓడిపోయింది బాక్సాఫీస్ దగ్గర కాదు… ఫ్యాన్స్ మనసుల్లో!. సినిమా తీసి కోట్లు సంపాదించడం ఈ రోజుల్లో పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ 25 ఏళ్ల క్రితం మన మనసుల్లో ముద్రపడిపోయిన ఆ నోస్టాల్జియాను, ఆ మ్యాజిక్‌ను మళ్లీ రీ-క్రియేట్ చేయడం ఎవరి వల్ల కాదు.
అందుకే ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న…”మన చిన్ననాటి తీపి జ్ఞాపకాల్లాంటి క్లాసిక్ సినిమాలను మళ్లీ రీమేక్ చేసి ఆ మ్యాజిక్‌ను పాడుచేయడం అవసరమా? లేక వాటిని అలాగే వదిలేస్తే మంచిది కదా?”
మీ చిన్నప్పటి ఫేవరెట్ క్లాసిక్ సినిమాను ఇలా రీమేక్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? క్లాసిక్ సినిమాలను మళ్లీ తీయాలా… లేక వాటిని జ్ఞాపకాలుగా అలాగే వదిలేయాలా?








